కార్మికులు ఔట్..!
సాగనంపేందుకు కుట్ర
కౌన్సిల్‌కు సిద్ధమైన టెండర్ ప్రతిపాదనలు
మూడువేల మంది భవిష్యత్ ప్రశ్నార్థకం
కార్పొరేషన్ పాలకుల అనాలోచిత నిర్ణయం
విజయవాడ సెంట్రల్ : కాకుల్ని కొట్టి గద్దలకు వేసిన చందంగా మారాయి నగరపాలక సంస్థ పాలకుల నిర్ణయాలు. ఓవైపు పొదుపు మంత్రం జపిస్తూనే, మరోవైపు దుబారాకు తెగబడుతున్నారు. ఏళ్ల తరబడి అరకొర జీతాలతో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్ కార్మికులను సాగనంపేందుకు కుట్ర పన్నుతున్నారు. ఇందుకు టెండర్లు అనే పాచిక విసురుతున్నారు. ఇందులో భాగంగానే గూర్ఖాలు, పార్కు కార్మికులకు సంబంధించి టెండర్లు పిలవాలని స్టాండింగ్ కమిటీ నిర్ణయించింది. తాజాగా డ్వాక్వా, సీఎంఈవై కార్మికులకు సంబంధించి టెండర్లు పిలిచేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. కార్మిక చట్టాల ప్రకారం పారిశుధ్య విభాగంలో పనిచేసే ఔట్‌సోర్సింగ్ కార్మికులకు రూ.8,300 చెల్లించాలి. కనీసం పదిశాతం లాభానికి టెండర్ దాఖలు చేస్తే ఆ పదిశాతం కార్పొరేషన్‌కు అదనపు భారంగా పరిణమిస్తుంది. నిత్యం కార్పొరేషన్ ఆర్థిక సంక్షోభం గురించి మాట్లాడే పాలకులు ఎవరి ప్రయోజనం కోసం టెండర్లు పిలవాలని నిర్ణయించారన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది.
కార్మికుల్లో ఆందోళన
నగరపాలక సంస్థలో 2004 నుంచి డ్వాక్వా, సీఎంఈవై గ్రూపుల కార్మికులు పారిశుధ్య విభాగంలో ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్నారు. 443 గ్రూపుల నుంచి 3,274 మంది విధుల్లో చేరారు. ప్రస్తుతం 2,984 మంది 59 డివిజన్లలో పనిచేస్తున్నారు. రూ.1,600తో ప్రారంభమైన వీరి జీతం ప్రస్తుతం రూ.8,300కు చేరింది. గడిచిన పదకొండేళ్లుగా ఏటా వీరి కాంట్రాక్ట్‌ను కొనసాగిస్తుండటం ఆనవాయితీగా వస్తోంది. ఈ దఫా టెండర్లు పిలవాలని పాలకులు, అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు ఫైల్ సిద్ధం చేస్తున్నారు. టెండర్ల విధానం అమలైతే భవిష్యత్ అగమ్యగోచరంగా మారుతోందని కార్మికులు ఆందోళన చెందుతున్నారు.
ప్రతిపాదనలు సిద్ధం
ప్రజారోగ్య విభాగంలో ఔట్‌సోర్సింగ్ కార్మికుల నియామకానికి సంబంధించి టెండర్ల ప్రక్రియ నిర్వహించాల్సిందిగా 2011 జూలైలో కమిషనర్ అండ్ డెరైక్టర్ ఆఫ్ మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ (సీడీఎంఏ) ప్రేమ్‌చంద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు నాటి కమిషనర్ రవిబాబు టెండర్లు పిలిచేందుకు సిద్ధమయ్యారు. దీంతో కార్మికులు ఆందోళనబాట పట్టారు. మునిసిపల్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) ప్రధాన కార్యదర్శి ఆసుల రంగనాయకులు కార్మికులకు అన్యాయం జరుగుతోందంటూ లోకాయుక్తలో కేసు ఫైల్ చేశారు. దీంతో వివాదం ముదిరింది. అనూహ్య పరిణామంతో కంగుతిన్న అధికారులు తూచ్.. అన్నారు. టెండర్లు పిలవడం లేదంటూ లోకాయుక్తకు సమాచారం ఇచ్చారు. మూడున్నరేళ్ల స్పెషల్ అధికారుల పాలనలో కాంట్రాక్ట్ కాలపరిమితి పెంచుతూ వస్తున్నారు. కార్మికులకు ఏడాదికి సుమారు రూ.29 కోట్లు జీతాలుగా చెల్లించాలి. దీనికి సంబంధించి బడ్జెట్ కేటాయింపుల్లో అనుమతి తీసుకోవాల్సి ఉంది. ఈ విషయాన్ని ఇటీవల చీఫ్ మెడికల్ ఆఫీసర్ ఎం.గోపీనాయక్ కమిషనర్ జి.వీరపాండియన్ దృష్టికి తీసు కెళ్లారు. 2016 మార్చి వరకు కార్మికుల కొనసాగింపు సాధ్యం కాదని, టెండర్లు పిలవాల్సిందిగా కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ప్రజారోగ్యశాఖాధికారులు ఈనెల ఏడో తేదీన జరిగే కౌన్సిల్ సమావేశంలో చర్చించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు.
కౌన్సిల్‌పైనే ఆధారం
కౌన్సిల్ తీసుకునే నిర్ణయంపైనే కార్మికుల భవిష్యత్ ఆధారపడి ఉంటుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. గూర్ఖాలు, పార్కు వర్కర్లకు సంబంధించి టెండర్లవైపు మొగ్గుచూపిన టీడీపీ పాలకులు ప్రజారోగ్య విభాగంలోనూ ఇదే విధానాన్ని అనుసరించే అవకాశం ఉందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. కౌన్సిల్‌లో 38 మంది సభ్యులతో పూర్తి మెజారిటీ ఉన్న టీడీపీ గడిచిన మూడు సమావేశాల్లో పలు అంశాలపై ఏకపక్ష ధోరణిలోనే నిర్ణయాలు తీసుకుంది.