హుద్‌హుద్ @ కాసుల వర్షం
హుద్‌హుద్ తుపాను ఎందర్నో నిరాశ్రయులను చేసింది. ఆకలితో అలమటించేలా చేసింది. కానీ అధికార పార్టీ నేతలకు కాసులు కురిపించింది. పేదలకు చేరాల్సిన నిత్యావసరాలు పక్కదారి పట్టించి వీరు సొమ్ము చేసుకున్నారు. ఇప్పుడు బాధితులకిచ్చే పరిహారంపై కన్నేశారు. దాన్ని కూడా కాజేసేందుకు సిద్ధమవుతున్నారు. వీరికి పలువురు ఎమ్మెల్యేల అండదండలు ఉన్నట్టు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
సాక్షి, విశాఖపట్నం: తుపాను బాధితులకు తక్షణ సహాయం కోసం బియ్యంతో సహా ఎనిమిది రకాల నిత్యావసరాలను ఉచితంగా పంపిణీ చేశారు. కార్డులున్న వారికి ...లేని వారికి కూడా ఇచ్చారు. ఎమ్మెల్యేల సిఫార్సు లేఖలుంటే కార్డులతో ప్రమేయం లేకుండా పంపిణీ చేశారు. గత నెల 29వ తేదీ వరకు నగర పరిధిలో పంపిణీ చేయగా, గ్రామీణ ప్రాంతాల్లో ఈ నెల 5వ తేదీ వరకు పంపిణీ చేశారు. తేలిన లెక్కలను బట్టి చూస్తే ఏ మేరకు పక్కదారి పట్టాయో అర్థమవుతోంది. అధికారిక లెక్కల ప్రకారం జిల్లాలో 11,08,521 రేషన్‌కార్డులుండగా, 11.74 లక్షల కుటుంబాలున్నాయి. వీటిలో
విశాఖసిటీ పరిధిలో 3,76,939 కార్డులుంటే, రూరల్ జిల్లా పరిధిలో 7,36,517 కార్డులున్నాయి. జిల్లాలో 11.74 లక్షల కుటుంబాలుంటే తుపాను నేపథ్యంలో ఏకంగా 14.83 లక్షల కుటుంబాలకు బియ్యంతో సహా తొమ్మిది నిత్యావసరాల పంపిణీ జరిగింది. ఒక్క విశాఖ మహానగర పరిధిలోనే 4.54 లక్షల కుటుంబాలుంటే ఏకంగా 5.63,077 కుటుంబాలకు పంపిణీ చేశారు. ఇక రూర ల్ పరిధిలో 7.20 లక్షల కుటుంబాలుంటే 9.20 లక్షల కుటుంబాలకు పంపిణీ చేసినట్టుగా అధికారిక లెక్కలు చెబుతున్నాయి.
ఈ లెక్కన మంత్రులు, ఎమ్మెల్యేలే కాదు..జిల్లా కలెక్టర్‌తో సహా సామాన్య, మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి, ఉన్నత వర్గాల్లో ప్రతి ఒక్క కుటుంబం తీసుకున్నట్టే లెక్క. కార్డుల సంఖ్య కంటే కుటుంబాల సంఖ్య ఎక్కువగా ఉంటే.. కుటుంబాల సంఖ్య కంటే సాయం పంపిణీ చేసిన కుటుంబాలు మరీ ఎక్కువగా ఉన్నాయి. కార్డులతో పోల్చుకుంటే 3.75 లక్షల కుటుంబాలకు అదనంగా ఇస్తే, కుటుంబాలతో పోలిస్తే 3లక్షల కుటుంబాలకు అదనంగా ఇచ్చినట్టే. వీటిలో కార్డుల్లేకుండా ఎమ్మెల్యే సిఫార్సు లేఖలతో నగర పరిధిలో 71,720 కుటుం బాలు, రూరల్‌లో 30 వేల కుటుంబాలకు పంపిణీ చేసినట్టుగా లెక్కలు చెబుతున్నాయి.
ఈ లెక్కలన్నీ పొంతనలేకుండా ఉన్నాయి. రైతుబజార్ రేట్ల ప్రకారం చూసుకున్నా ఒక్కొక్క కుటుంబానికి పంపిణీ చేసిన సాయం విలువ రూ.800 వరకు ఉంటుందని అంచనా. ఈ లెక్కన ఎమ్మెల్యే సిఫార్సు లేఖలతో ఏకంగా రూ.8 కోట్ల విలువైన సరకును పంపిణీ చేసినట్టు తెలుస్తోంది. ఇక కుటుంబాల సంఖ్య కంటే అదనంగా పంపిణీ చేసిన సరకుల విలువ చూస్తే ఏకంగా పాతిక కోట్ల పైమాటే. ఒక్క బియ్యమే నగర పరిధిలో 14,469 మెట్రిక్ టన్నులు, గ్రామీణ ప్రాంతంలో 15వేల మెట్రిక్ టన్నులు సరఫరా చేసినట్టుగా చెబుతున్నారు.
ఇంకా అందలేదంటూ క్షేత్రస్థాయిలో బాధితుల నుంచి ఫిర్యాదులొస్తూనే ఉన్నాయి 11.74 లక్షల కుటుంబాలున్న జిల్లాలో ఏకంగా 30 వేల మెట్రిక్ టన్నుల బియ్యం పంపిణీ చేశారని చెబుతుండడం చూస్తుంటే ఏ మేరకు పక్కదారి పట్టిందో అర్థమవుతోంది. వీటిలో ఎంత తక్కువ లెక్కేసుకున్నా ఐదారువేల మెట్రిక్ టన్నుల బియ్యం పక్కదారి పట్టినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ సరకులన్నీ డీలర్ల సహకారంతో తెలుగు తమ్ముళ్లు దారిమళ్లించినట్టు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
విజిలెన్స్ దాడులేవీ?: విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు ఇటీవల నిర్వహించిన వరుస తనిఖీల్లో వందలాది మెట్రిక్ టన్నుల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. బియ్యం నిల్వ చేసిన వారిని వదిలేసి..ఆ బియ్యం సరఫరా చేసిన డీలర్లపై కేసులు పెట్టారు. వీరి తనిఖీల్లో దేశం నేతలు, కార్యకర్తల ప్రమేయం ఉన్నట్టుగా బట్టబయలవుతుండడంతో ఆ మచ్చ ఎక్కడ తమ ప్రభుత్వానికి అంటుతుందోననే భయంతో ప్రభుత్వం ఈ దాడులకు పుల్‌స్టాప్ పెట్టిందనే విమర్శలు వినిపిస్తున్నాయి.
గత నెలాఖరులో హడావుడి చేసిన విజిలెన్స్ అధికారులు నాలుగైదురోజులుగా చడీచప్పుడు లేకుండా ఉన్నారు. మొన్నటి ఎన్నికల్లో సామాన్య కార్యకర్తగా ఉన్న వారు ఈ తుపాను సాయం పుణ్యమాని లక్షలు వెనకేసుకున్నారని ఆ పార్టీ నేతలే బాహాటంగా చెప్పుకుంటున్నారు. ఇప్పటికే సాయం స్వాహాలో కోట్లు గడించిన తెలుగుతమ్ముళ్లు ఇప్పుడు పేదలకు దక్కాల్సిన పరిహారంపై కన్నేశారని విమర్శలున్నాయి. నచ్చిన వారికి ఒకలా..నచ్చని వారికి మరొకలా పరిహారం అందేలా చక్రంతిప్పుతున్న వీరు పరిహారంలో కూడాలో పర్సంటేజ్‌లు వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.