- హడావిడిగా ముఖ్యమంత్రి పర్యటన
- పెంటావాలెంట్ టీకా ప్రారంభించిన సీఎం
- కేవీ పల్లెలో అడవిపల్లె రిజర్వాయర్ సందర్శన
- 25 నిమిషాల్లోనే ముగిసిన పర్యటన
- హంద్రీ-నీవా కాలువ పనులపై ఏరియల్ సర్వే
- రైతులు, కార్మికులకు ఒరిగిందేమీ లేదు
సాక్షి ప్రతినిధి, తిరుపతి: ముఖ్యమంత్రి గురువారం జిల్లాలో బిజీబిజీగా గడిపారు. జిల్లాలో నెలకొన్న కరువు, తాగు, సాగునీటి సమస్యలపై పరిష్కార మార్గం చూపుతారని భా వించిన ప్రజలకు ఈసారి నిరాశే ఎదురైంది. ఇక్కడ నెలకొన్న పరిస్థితులపై ముందే అవగాహనతో వచ్చిన ఆయన ఎక్కడా తొందర పాటుతో హామీలు గుప్పించకపోవడం గమనార్హం. సీఎం పర్యటనపై ఎన్నో ఆశలు పెట్టుకున్న రైతు, కార్మిక, పేద వర్గాల ఆశలపై మరోసారి ఆయన నీళ్లు చల్లారు. పర్యటన ఆసాంతం మొక్కుబడిగానే సాగింది. ఎక్కడికక్కడ సమస్యలపై విన్నవించాలని జనం పెద్ద సంఖ్యలో వేచి ఉన్నప్పటికీ అవకాశం మాత్రం లభించలేదు.
తొలుత సీఎం విశాఖపట్నం నుంచి ప్రత్యే క విమానంలో వచ్చిన 11.30 గంటల ప్రాంతంలో పద్మావతి మహిళా యూనివర్సిటీకి చేరుకున్నారు. అక్కడ చంద్రగిరి నియోజకవర్గంలో నీటి సమస్యపైన ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి నిలదీశారు. అనంతరం యూనివర్సిటీ ఆడిటోరియం చేరుకున్న సీఎం పెంటావాలెంట్ టీకాను లాంఛనంగా ప్రారంభిం చారు. ఇద్దరు చిన్నారులకు ఆయన టీకాలు మంత్రితో వేయించారు. శిశు, గర్భిణుల మరణాలను తగ్గిం చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. వైద్యం కోసం అవసరమైన అన్ని వసతులను సమకూరుస్తామని పేర్కొన్నారు.
మధ్యాహ్నం 12.30 గంటలకు తిరుపతి నుంచి యాదిమరి మండలంలోని అమరరాజా కర్మాగారానికి చేరుకున్నారు. అక్కడ గ్రోత్ కారిడార్ పైలాన్‌ను ఆవిష్కరించారు. తాగు, సాగు నీటి పరిష్కారానికి హంద్రీ-నీవా ఒక్కటే మార్గమని పేర్కొన్నారు. అది తప్ప జిల్లాలో కరువు రైతులను ఆదుకోవడం, తాగునీటి సమస్య పరిష్కార మార్గాలను మాత్రం చూపలేదు. మొక్కుబడిగా ప్రతిసారీ చెప్పే మాటలనే ఈ మారు చెప్పి తంతు ముగించారు.
మధ్యాహ్నం 2.30కి యాదమరి మండలం నుంచి కేవీపల్లె మండలంలోని అడవిపల్లె రిజర్వాయర్‌ను సం దర్శించారు. అక్కడ ప్రాజెక్ట్‌కు సంబంధించి నీటి నిల్వ పెంచే విషయమై అటవీ, నీటి పారుదల శాఖ అధికారులతో చర్చించారు. అయితే సీఎం రైతులతో ముఖాము ఖి సమావేశం జరుపుతారని అధికారులు హెలిప్యాడ్ వద్ద చర్చా వేదికను ఏర్పాటు చేశారు. సమయం లేదంటూ 25 నిమిషాల్లోనే సమావేశాన్ని ముగించి కురబలకోట మండలం అంగళ్లుకు ప్రయాణమయ్యారు. రైతులను అక్కడికే రావాలని సూచించారు. దీంతో రైతుల్లో తీవ్ర నిరాశ, నిస్పృహలు చోటు చేసుకున్నాయి.
కురబలకోట మండలం అంగళ్లులో ఏర్పాటుచేసిన రైతు సదస్సులో ప్రసంగించారు. మరోసారి పట్టిసీమ జపాన్ని జపించారు. ఇక్కడ రైతులతో సమావేశాన్ని జరుపుతామని చెప్పినప్పటికీ మొక్కుబడిగా ఏదో నలుగురు రైతులతో మాట్లాడి పంపించేవారు. అన్నదాతల సమస్యలపై ప్రత్యేకంగా చర్చించింది ఏమీ లేదు. హంద్రీ-నీవా కాలువ పనులకు సంబంధించి ఏరియల్ సర్వే చేయడంతోపాటు పనుల పురోభివృద్ధిపై అధికారులతో చర్చించారు. మొత్తం మీద జిల్లాలో సీఎం పర్యటన అధికారుల హడావిడిగా సాగడం తప్ప, ప్రజలకు మాత్రం ఒరిగిందేమీ లేదు.
ఈసారీ నిరాశే!
Published Fri, May 8 2015 3:56 AM | Last Updated on Sun, Sep 3 2017 1:36 AM
Advertisement
Advertisement