
జన్మభూమి.. సాధించిందేమి!
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన జన్మభూమి-మాఊరు కార్యక్రమంలో ప్రజా సమస్యలు వెల్లువెత్తాయి.
కర్నూలు(అగ్రికల్చర్):రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన జన్మభూమి-మాఊరు కార్యక్రమంలో ప్రజా సమస్యలు వెల్లువెత్తాయి. జిల్లాలో 890 గ్రామ పంచాయతీలు, 271 మునిసిపల్ వార్డుల్లో ఈ కార్యక్రమం నిర్వహించాల్సి ఉండగా సోమవారానికి 822 గ్రామ పంచాయతీలు, 254 మునిసిపల్ వార్డుల్లో ఈ కార్యక్రమం ముగిసింది. కార్యక్రమం ఆరంభం నుంచి చివరి వరకు నిరసనలు, అసంతృప్తుల మధ్యే సాగడం గమనార్హం.
పలు నిబంధనలతో సామాజిక పింఛన్లలో భారీగా కోత కోయడం, ఆధార్ లేదనే కారణంతో రేషన్ కార్డులను తొలగించడంతో బాధితుల నుంచి నిరసనలు వెల్లువెత్తాయి. ఈ నెల 8 నాటికి జిల్లా వ్యాప్తంగా 2,26,423 వినతులు వచ్చాయి. గ్రామీణ ప్రాంతాల నుంచి 1,35,640 అర్బన్ ప్రాంతాల నుంచి 90783 వినతులు వచ్చినట్లు అధికార వర్గాల సమాచారం.
ఇందులో ప్రధానంగా పింఛన్లు, రేషన్ కార్డుల సమస్యలపైనే వినతులు రావడం గమనార్హం. పింఛన్లకు సంబంధించి 1.15 లక్షలు, రేషన్ కార్డులకు 65 వేలు వినతులు రాగా పక్కా ఇళ్ల కోసం 35 వేల వినతులు రావడం గమనార్హం. ఇతరత్రా వివిధ సమస్యలపై 11 వేలకు పైగా ప్రజల నుంచి దరఖాస్తులు వచ్చాయి.
కార్యక్రమం పరిశీలకులుగా గ్రామీణాభివృద్ధి శాఖ ఈజీఎస్ డెరైక్టర్ కరుణ, అటవీశాఖ కన్జర్వేటర్ శాంతిప్రియ పాండేలను ప్రభుత్వం నియమించింది. శాంతిప్రియ పాండే చురుగ్గా జిల్లాలో పర్యటించినా కరుణమాత్రం నామమాత్రంగానే పర్యటించారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.