
జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.హరిజవహర్‌లాల్
సాక్షి ప్రతినిధి, విజయనగరం: ‘వచ్చిన పని అయిపోయింది. ఇక ఒక్క రోజు ఉన్నా... అది బోనస్‌గానే భావించాలి’ అని కుండబద్దలు గొట్టి తన మనోభావాన్ని కచ్చితంగా చెప్పగల వ్యక్తిత్వం ఆయన సొంతం. జిల్లా అభివృద్ధే ధ్యేయంగా... ప్రగతిపూలు పూయించాలన్నదే లక్ష్యంగా... పనిచేసేందుకు జిల్లాలోనే కొనసాగే అవకాశం దక్కించుకున్నారు. ఆయనే జిల్లా కలెక్టర్ ఎం.హరిజవర్‌లాల్. రాష్ట్రవ్యాప్తంగా ఇటీవల జరిగిన బదిలీల్లో స్థాన చలనం కాని నలుగురు కలెక్టర్లలో ఈయన ఒకరు. ఈ అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిని అమరావతిలో కలసి కృతజ్ఞతలు తెలిపిన అనంతరం జిల్లాకు మంగళవారం వచ్చారు. ఈ సందర్భంగా జిల్లా అభివృద్ధికి చేపడుతున్న కార్యక్రమాల గురించి ‘సాక్షిప్రతినిధి’కి వివరించారు.
సమన్వయంతో... సమగ్రాభివృద్ధి.
నాపై నమ్మకం ఉంచి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మరో అవకాశం ఇచ్చారు. ఆయనను మర్యాదపూర్వకంగా కలసినపుడు చాలా బాగా రిసీవ్ చేసున్నారు. ఆప్యాయంగా మాట్లాడారు. జిల్లాలోనే కొనసాగాలని ఆదేశించారు. ప్రజల కు మంచి చేయాలనే తపనతో ఉన్న సీఎం చెప్పినట్లు ఇకపై జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధుల సమన్వయంతో అభివృద్ధి పథకాలను ముందుకు తీసుకువెళతాం. జిల్లాలో ఇప్పటికే ఏడాది పాటు పనిచేసిన అనుభవంతో భవిష్యత్‌తో చేపట్టాల్సిన ప్రాజెక్టులపై ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. దానిలో భాగంగా మున్సిపాలిటీలపై ప్రధానంగా దృష్టిసారిస్తున్నాం. విజయనగరం, పార్వతీపురంతో పాటు జిల్లాలోని అన్ని మున్సిపాటీల్లోనూ, అనేక ప్రాంతాల్లోనూ తాగునీటి సమస్య అధికంగా ఉంది. దీనిని అధిగమించడానికి కార్యచరణ రూపొందిస్తున్నాం.
మైసూర్‌కు దీటుగా విజయనగరం
జిల్లా కేంద్రమైన విజయనగరం పట్టణాన్ని మైసూర్ నగరానికి దీటుగా తయారు చేస్తాం. అది కూడా అతి తక్కువ కాలంలోనే చేసి చూపిస్తాం. పెద్ద చెరువు శుద్ధి కార్యక్రమం నిరంతరం కొనసాగుతుంది. ప్రజల్లో ఊహించిన దానికంటే ఎక్కువగానే చెరువు విషయంలో సెంటిమెంట్ ఉంది. గూడ్స్‌షెడ్ రోడ్డును ఎక్కడా లేని విధంగా పచ్చదనంతో సుందరీకరించేందుకు రైల్వే శాఖ అధికారులతో సంప్రదిస్తున్నాం. పట్టణంలో కొన్ని ప్రధాన కూడళ్లలో ‘మన విజయనగరం’ పేరుతో ఐలాండ్స్ ఏర్పాటు చేసేందుకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తిచేశాం. ప్రజా ప్రతినిధులతో కూడా సంప్రదించి వాటిని త్వరలోనే ఏర్పాటు చేస్తాం. ట్రాఫిక్ సమస్య పరిష్కరించేందుకు పార్కింగ్ ప్రదేశాలను గుర్తించాలని అధికారులను ఆదేశించాం.
గిరిజనాభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక
గిరిజన ప్రాంత అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నాం. ముఖ్యంగా గిరిజనుల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు వారికి జీవనోపాధి కల్పించేలా చర్యలు చేపడుతున్నాం. ఐటీడీఏ ప్రాజెక్టు డైరెక్టర్‌తో ఈ విషయంపై సంప్రదింపులు జరుపుతున్నాం. విశాఖ జిల్లా అరకు, పాడేరు ప్రాంతాల్లో ఉన్నట్లుగానే మన జిల్లాలోనూ కాఫీ తోటల పెంపకానికి అనుకూల ప్రాంతం, వాతావరణం ఉందని గుర్తించాం. గిరిజనులతో కాఫీ తోటల పెంపకాన్ని మొదలుపెట్టించేందుకు సాధ్యాసాధ్యాలపై చర్చిస్తున్నాం. ఏడాది తిరిగేసరికి జిల్లాను అన్ని రంగాల్లోనూ, అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి కొత్త ప్రభుత్వం ద్వారా అవకాశం వచ్చినందుకు సంతోషంగా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment