పలమనేరు, న్యూస్‌లైన్: పలమనేరులో జరిగిన పోలీసు జంట హత్యలు కేవలం పది నిమిషాల వ్యవధిలో జరిగాయని ఆదివారం పోలీసుల విచారణలో తేలింది. ఇదే విషయాన్ని ‘సాక్షి’ అప్పట్లోనే ప్రచురించింది. కానిస్టేబుళ్ల హత్య కేసులో కొత్తకోణం, ప్రేమ జంటను బెదిరిస్తే డబ్బులే డబ్బులు అనే శీర్షికల్లో కథనాలు వెలువడ్డాయి.
ఆ పదినిమిషాల్లో ఏం జరిగిందంటే...
గత ఏడాది డిసెంబర్ 1న సాయంత్రం 5 గంటల ప్రాంతంలో గాంధీనగర్ అటవీ ప్రాంతం నుంచి బాల వినాయగర్ స్థానిక స్టేషన్‌కు చెందిన కానిస్టేబుల్ మహేష్‌కు అటవీ ప్రాంతంలో ఓ యువతితో పాటు ఆటోలో ఓ వ్యక్తి వెళ్తున్నట్లు సమాచారమిచ్చాడు. సాయంత్రం 5.08 నిమిషాలకు కానిస్టేబుల్ మహేష్ ఈ విషయాన్ని బ్లూకోల్ట్ సిబ్బంది జవహర్‌లాల్ నాయక్‌కు ఫోన్‌లో చెప్పాడు.
నాయక్‌తో పాటు హోమ్‌గార్డు దేవేంద్రకుమార్ బైక్‌లో గాంధీనగర్ అటవీ ప్రాంతానికి వెళ్లారు. 5.15 నిమిషాలకు ఇక్కడెవరూ లేరని నాయక్ కాల్ చేశాడు. దీంతో మహేష్ బాలవినాయగర్‌కు ఫోన్ చేశాడు. ఆపై నాయక్‌కు ఫోన్ చేసి ఇంకొంచెం ముందుకెళ్లాలని సూచించాడు. ఆ తర్వాత 5.21 నిమిషాలకు మరోసారి నాయక్‌కు రింగ్ చేయగా అతను పిక్ చేయలేదు. ఆపై 5.27 నిమిషాలకు మహేష్ మరోమారు నాయక్ ఫోన్‌కు రింగ్ చేసినా అతను తీయలేదు. దీంతో దేవేంద్ర సెల్‌కు ఫోన్ చేసినా అతనూ తీయలేదు.
ఆపై వీరిద్దరి మొబైళ్లకు చాలా కాల్స్ వచ్చినా ఎవరూ పిక్ చేయలేదు. దీన్నిబట్టి 5.21 నుంచి 5.30లోపే ఈ హత్యలు జరిగాయి. వీరిరువురూ అటవీ ప్రాంతంలోకెళ్లగానే ఓ పల్సర్ వాహనం కనిపించింది. ఆ వాహన నంబర్‌ను హోమ్‌గార్డు దేవేం ద్ర తన చేతిపై రాసుకున్నాడు. అక్కడి నుంచి కొంత ముందుకెళ్లగానే అప్పటికే అక్కడ ప్రేమ జంటల కోసం కాపుగాచి ఉన్న వెల్లియప్పన్, కాశీలు వీరికి ఎదురుగా వచ్చారు. ఎవరు మీరు..ఇక్కడేం చేస్తున్నారంటూ పోలీసులు ప్రశ్నించారు. తాము సమీపంలోని ఓ ఫ్యాక్టరీలో కూలిపని చేసుకుంటామని నమ్మబలికారు. వారు కొంతదూరం వెళ్లగానే అనుమానం వచ్చి పోలీసులు వెంబడించారు.
తొలుత దేవేంద్ర వెల్లియప్పన్‌ను పట్టుకోగా అతను ముళ్లపొదల్లో దాక్కునేందుకు ప్రయత్నించాడు. భారీకాయుడైన వెల్లియప్పన్‌ను దేవేంద్ర పైకి లేపే క్రమంలో తన ఆటోమెటిక్ కత్తితో దేవేంద్ర కిడ్నీ వద్ద పొడిచాడు. ఆపై తలపై కాళ్లతో తొక్కి ఊపిరాడకుండా చంపేశాడు. మరోవైపు కాశీని వెంబ డించిన జవహర్‌లాల్ నాయక్ అతన్ని పట్టుకొనే లోపే వెల్లియప్పన్ అక్కడికెళ్లి ఆ కానిస్టేబుల్‌నూ కత్తితో పొడిచి చంపేశాడు. ఆపై హంతకులిద్దరూ మెయిన్ రోడ్డు వైపు వచ్చి పల్సర్ వాహనంలో బంగారుపాళ్యం వైపు వెళ్లిపోయారు.
సంఘటనా స్థలంలో దొరికిన పౌచ్ నిందితులదే
హోమ్‌గార్డు దేవేంద్రను హతమార్చిన చోటే హంతకుడు వెల్లియప్పన్ తన పౌచ్‌ను వదిలిపెట్టాడు. ఈ పౌచ్‌ను పోలీసులు గుర్తించిన విషయం తెలిసిందే. ఇక దేవేంద్ర చేతిపై రాసుకున్న నంబర్ హంతకులు చోరీ చేసి వాడిన పల్సర్ నంబర్‌గా బయటపడింది.
నేడు పలమనేరు కోర్టుకు హంతకులు
హంతక ముఠాను సోమవారం పలమనేరు కోర్టులో హాజరు పరచనున్నారు. పోలీసులు ప్రత్యేక వాహనాల్లో ఎనిమిది మంది నిందితులను ఆదివారం రాత్రి పలమనేరుకు తీసుకొచ్చారు. వీరిలో వెల్లియప్పన్ అలియాస్ సంపత్, కాశీలతో పాటు ఇతర నేరాలకు సంబంధించిన ప్రేమ్, స్థానికులు రామిరెడ్డి, రాజేంద్రలను స్థానిక స్టేషన్‌లో ఉంచారు. మిగిలిన ముగ్గురినీ కుప్పం పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
ఏడాదిగా పలమనేరులోనే హంతకుల మకాం
పలమనేరు పోలీసులను పొట్టన పెట్టుకున్న కరుడుగట్టిన అంతర్రాష్ట్ర ముఠా ఏడాదిగా పలమనేరులోనే ఉన్నట్టు పోలీసుల విచారణలో తేలింది. తమిళనాడు రాష్ర్టం సేలం సమీపంలోని సంఘగిరికి చెందిన వెల్లియప్పన్(28), మురుగన్ అలియాస్ కాశీ (25)లు తమిళనాడు, కర్ణాటకతో పాటు జిల్లాలోని పలుచోట్ల హత్యలు, అత్యాచారాలు, దోపిడీలు, చోరీలకు పాల్పడిన విషయం తెలిసిందే. ఈ గ్యాంగ్‌కు సురక్షితమైన ప్రాంతంగా పలమనేరును ఎంచుకొన్నారు. పట్ట ణ సమీపంలోని డిగ్రీ కళాశాల వెనుక వైపు ఓ అద్దె ఇంట్లో కొన్నాళ్లుగా ఉన్నట్లు తెలిసింది. అదేవిధంగా పట్టణ సమీపంలోని కేటిల్‌ఫామ్ వద్ద నాలుగు నెలల పాటు ఉన్నట్లు విచారణలో వెల్లడైంది. ఈ సమయంలో ఈ గ్యాంగ్ నక్కపల్లెకు చెందిన రామిరెడ్డి, కేటిల్‌ఫామ్‌కు చెందిన విజయకుమార్‌లు సహాయ సహకారాలు అందించారు. దీంతో పాటే ఆ గ్యాంగ్‌తో కలసి పలు నేరాల్లో పాల్గొన్నట్లు తెలుస్తోంది.
తమిళనాడు రాష్ట్రంలోని షోలింగర్‌కు చెందిన బొమ్మి అనే యువతిని కేటిల్‌ఫామ్‌లోనే తమతో పాటు ఈ ముఠా ఉంచుకున్నట్లు తేలింది. దీంతో పాటు బెరైడ్డిపల్లె మండలం కడతట్లపల్లెకు చెందిన రాజేంద్ర, తవణంపల్లె మండలం కృష్ణాపురానికి చెందిన ప్రతాప్‌లు వీరికి పరిచయమై, అవసరమైన సాయం చేసేవారు. వీరితో పాటు సేలంకు చెందిన ప్రేమ్, రాఘవన్, మిలటరీ ఉద్యోగి గోవిందస్వామి, కాలప్ప, గోవిందప్పలు ఈ ముఠాలో కీలకమైన వారు. వీరందరికీ పలమనేరు ప్రాంతంలో మంచి పట్టు ఉంది. ఈ క్రమంలోనే వెల్లియప్పన్, కాశీలు డిసెంబర్ 1న గాంధీనగర్ అటవీ ప్రాంతంలో ప్రేమ జంటల కోసం కాపుగాచి ఉండగా ఈ హత్యలు జరిగాయి.