నేటి నుంచి ప్రభుత్వ దుకాణాలు
చిత్తూరు (అర్బన్): పోలీసులంటే శాంతి భద్రతను పర్యవేక్షించడం, అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపడం లాంటి పను లు చేయాల్సి ఉంది. ఇప్పుడు పోలీసులంటే మద్యం బాటిళ్లు అమ్ముకునేవాళ్లుగా కొత్త అర్థాన్ని సైతం ప్రవేశపెట్టారు. ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు రాకపోవడం, కలెక్టర్ వింత పోకడతో అధికారులకు తిప్పలు తప్పడం లేదు. మద్యం దుకాణాల కేటాయింపులో పాఠాలు బోధించే విద్యాశాఖ అధికారి నుంచి డిప్ తీయించిన జిల్లా అధికారులు తాజాగా మరో వివాదానికి తెరతీశారు. జిల్లాలోని ప్రభుత్వ మద్యం దుకాణాల్లో మద్యం విక్రయించే బాధ్యతలను పోలీసులకు అప్పగించారు. జిల్లా ఎక్సైజ్, ప్రొహిబిషన్ శాఖలో హెడ్‌కానిస్టేబుళ్లుగా పనిచేసే 48 మంది పోలీసులను మద్యం విక్రయాలకు ప్రత్యేక విధులు కేటాయించారు. జిల్లాలో 410 ప్రైవేటు మద్యం దుకాణాలకు టెండర్లు నిర్వహించిన అధికారులు 320 దుకాణాలకు ఇప్పటికే లెసైన్సులు కేటాయించారు. దరఖాస్తులు పడని 90 దుకాణాలకు రీ-టెండర్ నోటిఫికేషన్ సైతం విడుదల చేశారు.
48 ప్రభుత్వ మద్యం దుకాణాలను ఈనెల ఒకటి నుంచే ప్రారంభించాల్సి ఉండగా మద్యం బాటిళ్లు సరఫరా చేసే ట్రాన్స్‌పోర్టర్లు అందుబాటులోకి లేకపోవడంతో 20 దుకాణాలను బుధవారం రాత్రి నుంచి ప్రారంభించారు. గురువారం నుంచి పూర్తి స్థాయిలో ప్రభుత్వ మద్యం దుకాణాలను నిర్వహించనున్నారు. మద్యం విక్రయించడానికి గతంలో ఏపీబీసీఎల్ ద్వారా తాత్కాలిక పద్ధతిన ప్రభుత్వ అవుట్‌లెట్లలో పనిచేసిన 88 మంది సిబ్బందిని నియమించారు. వీరితో పాటు ప్రతి దుకాణానికీ ఒక ఎక్సైజ్ హెడ్ కానిస్టేబుల్‌ను సైతం కేటాయించి మద్యం విక్రయాలు, దుకాణం పర్యవేక్షణ బాధ్యతను అప్పగించారు. ప్రభుత్వ మద్యం దుకాణాల అవుట్ లెట్లలో సిబ్బంది నియామకంపై ప్రభుత్వం నుంచి గాని, కలెక్టర్ నుంచి గానీ స్పష్టమైన ఆదేశాలు రాకపోవడంతో ఎక్సైజ్ అధికారులు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
మద్యం విక్రయానికి పోలీసులు
Published Thu, Jul 2 2015 2:15 AM | Last Updated on Thu, Jul 11 2019 8:43 PM
Advertisement
Advertisement