తీరా ఇలా.. తీరే అలా!
ప్రభుత్వ మద్యం దుకాణాల్లో సేల్స్‌మ్యాన్, సూపర్‌వైజర్ పోస్టులకు ప్రకటన
జిల్లాలో 1,200 మంది దరఖాస్తులు
తాజాగా ప్రభుత్వ మద్యం దుకాణాలను రద్దు చేస్తూ ఆదేశాలు
నిరుద్యోగులకు మొండిచెయ్యి తీరు మార్చుకోని టీడీపీ ప్రభుత్వం
నరసరావుపేట టౌన్ : తెలుగుదేశం ప్రభుత్వం నిరుద్యోగులను మరోసారి మోసగించి తన వైఖరిని చాటుకుంది. టీడీపీ ప్రభుత్వ ఏర్పాటు కాగానే ప్రతి మండలంలో ప్రభుత్వ మద్యం దుకాణాన్ని ఏర్పాటు చేసింది. ఈ దుకాణాల్లో నిరుద్యోగ యువతకు ఔట్ సోర్సింగ్ విధానంలో ఉద్యోగ అవకాశం కల్పిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. తీరా ప్రభుత్వ మద్యం దుకాణాలను రద్దు చేస్తూ తిరిగి నిర్ణయం తీసుకోవడంతో నిరుద్యోగులు తీవ్ర నిరాశ చెందుతున్నారు.
టీడీపీ ప్రభుత్వం ఏర్పాటైన అనంతరం ప్రతి మండలానికి ఒక మద్యం దుకాణాన్ని ఏర్పాటు చేసిన విషయం విదితమే. ఈ దుకాణాల్లో సూపర్‌వైజర్, సేల్స్‌మ్యాన్ పోస్టులను ఔట్ సోర్సింగ్ విధానంలో నియమించేందుకు చర్యలు చేపట్టింది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో నియామకానికి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. జిల్లాలోని 50 సేల్స్‌మ్యాన్, 32 సూపర్‌వైజర్ల పోస్టులకు సుమారు 1,200 మంది దరఖాస్తు చేసుకున్నారు. అదే నెల 25వ తేదీన అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించాల్సి ఉంది. రాజకీయ ఒత్తిడి నేపథ్యంలో అధికారులు ఇంటర్వ్యూలను వాయిదా వేశారు. సాంకేతిక కారణాలతో ఇంటర్వ్యూలు వాయిదా వేశామని, తిరిగి త్వరలోనే నిర్వహిస్తామని అధికారులు ప్రకటించారు. నేటి వరకు ఆ ఊసే లేదు. ఇటీవల ప్రభుత్వ మద్యం దుకాణాలను రద్దు చేస్తూ, వాటిని లాటరీ పద్ధతిలో ప్రైవేటు వ్యక్తులకు అప్పగించేందుకు రెండ్రోజుల క్రితం ప్రభుత్వం నిర్ణయించింది. ద్యోగాల కోసం దరఖాస్తు చేసిన నిరుద్యోగ యువత అదిక మొత్తంలో దరఖాస్తులు చేసుకున్నారు. ఉద్యోగం వస్తుందని ఆశగా ఎదురుచూస్తున్న తరుణంలో ప్రభుత్వం నిర్ణయం వారిని పిడుగుపాటుకు గురిచేసింది.
ప్రజాధనం వృధా... ప్రభుత్వ మద్యం దుకాణాల్లో సిబ్బంది నియామకానికి నోటిఫికేషన్ కోసం ప్రభుత్వం ప్రచారానికి లక్షల రూపాయలు వెచ్చించింది. చివరకు నియామకాలు చేపట్టకపోగా, నోటిఫికేషన్ రద్దు చేయడంతో ప్రజాధనం వృధా అయింది. నిరుద్యోగులు దరఖాస్తుల కోసం నోటరీ, అటెస్టేషన్‌లతో పాటు వ్యయ ప్రయాసలకోర్చి గుంటూరు కార్యాలయానికి దరఖాస్తులు సమర్పించారు. ఇదిలా ఉండగా అధికార పార్టీకి చెందిన కొందరు నాయకులు అభ్యర్థులకు ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ పెద్ద మొత్తంలో నగదు వసూలు చేసినట్టు పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపిస్తున్నాయి.