సాక్షి, కడప : మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి తనయ, జననేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల జిల్లాలో చేపట్టిన సమైక్య శంఖారావం బస్సు యాత్ర సక్సెస్ అయింది. ప్రొద్దుటూరు, మైదుకూరు, బద్వేలు నియోజకవర్గాల్లో చేపట్టిన యాత్రకు ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించింది.
షర్మిల వాడివేడి ప్రసంగాలు ఆకట్టుకున్నాయి. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ సమైక్యాంధ్ర కోసం ఉద్యమిస్తూ సమైక్య శంఖారావం చేపట్టిన షర్మిల బస్సు యాత్ర సమైక్యవాదుల్లో స్ఫూర్తినింపింది. సమన్యాయం పాటించనప్పుడు విభజించే హక్కు ఎవరిచ్చారని, సమైక్యాంధ్రగానే ఉంచాలన్న మాటలు ప్రజలకు దన్నుగా నిలిచాయి. అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా
సభలకు తరలివచ్చి సంఘీభావం తెలిపారు. రాష్ట్రాన్ని విభజిస్తే సీమాంధ్ర ప్రజలకు ఎదురయ్యే సమస్యలు, కష్టనష్టాలను వివరించడంతోపాటు తెలుగుదేశం పార్టీ ద్వంద్వ వైఖరిని షర్మిల ఎండగట్టారు. మరోవైపు షర్మిల పర్యటన వైఎస్సార్‌సీపీ శ్రేణుల్లో నూతనోత్తేజాన్ని నింపింది.
నాయకులు, కార్యకర్తల ఆరాటం .. :
బద్వేలు సమీపంలో షర్మిల బస చేసిన పర్యాటక అతిధిగృహం వద్దకు ఆదివారం ఉదయం నుంచే పెద్ద ఎత్తున కార్యకర్తలు, నాయకులు తరలివచ్చారు. మహానేత తనయను చూసేందుకు, ఆమెను పలుకరించేందుకు ఆరాటపడ్డారు. వైఎస్సార్‌సీపీ కేంద్రపాలక మండలి సభ్యులు డీసీ గోవిందరెడ్డి నియోజకవర్గ స్థాయి ముఖ్య నేతలను, కార్యకర్తలను పరిచయం చేశారు.
జిల్లా కన్వీనర్ సురేష్‌బాబు, కడప నియోజకవర్గ సమన్వయకర్త అంజద్‌బాషా, బద్వేలు మాజీ మున్సిపల్ ఛైర్మన్ మునెయ్య, వైస్ ఛైర్మన్ గురుమోహన్, నేతలు రమణారెడ్డి, ఓ.ప్రభాకర్‌రెడ్డి, విజయభాస్కర్‌రెడ్డి, మాజీ ఎంపీపీ సరస్వతమ్మ, నియోజకవర్గ మండల కన్వీనర్లు, ముఖ్య నేతలు, పార్టీ కార్యకర్తలు భారీ సంఖ్యలో షర్మిలను కలుసుకున్నారు.
పి.పి.కుంటలో మహిళల వీడ్కోలు :
జిల్లా సరిహద్దు ప్రాంతమైన గోపవరం మండలంలోని పీపీ కుంట ప్రాంతం వద్ద పెద్ద సంఖ్యలో మహిళలు, పార్టీ కార్యకర్తలు షర్మిలకు ఆత్మీయ వీడ్కోలు పలికారు. షర్మిల చిరునవ్వుతో బస్సులో నుంచే అభివాదం చేస్తూ ముందుకు కదిలారు. ఈ సందర్భంగా జై జగన్.. జై సమైక్యాంధ్ర అనే నినాదాలు మారుమోగాయి.
సమైక్య శంఖారావం సక్సెస్
Published Mon, Sep 9 2013 5:29 AM | Last Updated on Fri, Sep 1 2017 10:35 PM
Advertisement
Advertisement