సాక్షి ప్రతినిధి, కడప: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తనయ, వైఎస్సార్‌సీపీ అధినేత, కడప ఎంపీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల శుక్రవారం సొంత గడ్డలో సమైక్య శంఖారావం పూరించనున్నారు. ఓట్లు.. సీట్ల కోసం రాష్ట్ర విభజన చేస్తూ, ప్రజాభీష్టాన్ని పరిగణలోకి తీసుకోకుండా కాంగ్రెస్, టీడీపీ చేస్తున్న కుమ్మక్కు రాజకీయాలను ఎండగడుతూ సమైక్యాంధ్రప్రదేశ్ కోసం ప్రొద్దుటూరు, మైదుకూరు, బద్వేలులో షర్మిల ‘సమైక్య శంఖారావం’ బస్సు యాత్ర చేపట్టనున్నారు. వాణిజ్య కేంద్రమైన ప్రొద్దుటూరులోని కశెట్టి హైస్కూల్ మైదానంలో శుక్రవారం సాయంత్రం 5గంటలకు బహిరంగసభ నిర్వహించనున్నారు. 7వతేదీ శనివారం ఉదయం 10.30గంటలకు మైదుకూరు నాలుగు రోడ్ల జంక్షన్, సాయంత్రం 5గంటలకు బద్వేలు నాలుగు రోడ్లు కూడలిలలో బహిరంగసభలను నిర్వహించనున్నారు. షర్మిల సమైక్య శంఖారావానికి ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, కర్షక, ప్రజాసంఘాలు మద్దతు ప్రకటించాయి.
ప్రజాభీష్టానికి అనుగుణంగానే....
రాష్ట్ర విభజనలో సమన్యాయం పాటించాలని, అలా చేయలేని పక్షంలో విభజన చేయరాదని, సమైక్యాంధ్రప్రదేశ్‌కు కట్టుబడి ఉండాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ వచ్చింది. రాష్ట్ర విభజన ప్రకటన చేశాక ప్రజాభీష్టం మేరకు ఆ పార్టీ ఉద్యమాలబాట పట్టింది. రాష్ట్ర గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పదవులకు రాజీనామా చేశారు. ప్రజలకు మద్దతుగా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు మహానేత సతీమణి వైఎస్ విజయమ్మ గుంటూరులో ఆమరణదీక్ష చేపట్టారు. ఆ వెనువెంటనే రాష్ట్ర అధ్యక్షుడు, కడప ఎంపీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చంచల్‌గూడ జైల్లోనే ఆమరణదీక్ష చేపట్టారు. పోలీసులు వారి దీక్షలను ఏకపక్షంగా భగ్నం చేశారు.
రాష్ట్ర నాయకత్వం ఆకాంక్ష మేరకు జిల్లా కేంద్రాలలో సైతం 25 రోజులుగా ఆమరణదీక్షలను కొనసాగిస్తున్నారు. మహానేత వైఎస్సార్ నాలుగో వర్ధంతి సందర్భంగా సెప్టెంబర్ 2నుంచి సమైక్య రాష్ట్రం కోరుతూ జననేత జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల ‘సమైక్య శంఖారావం’ను ఇడుపులపాయ నుంచి పూరించారు. చిత్తూరు, అనంతపురం, కర్నూలు జిల్లాలలో పర్యటించిన అనంతరం శుక్రవారం సాయంత్రం వైఎస్సార్ జిల్లాలోకి షర్మిల ప్రవేశించనున్నారు.
సాయంత్రం 5గంటలకు ప్రొద్దుటూరు కశెట్టి హైస్కూల్ మైదానంలో బహిరంగసభ నిర్వహించనున్నారు. ఆ రోజు ప్రొద్దుటూరులోనే షర్మిల బస చేయనున్నారు. శనివారం ఉదయం బస్సు యాత్రను ప్రారంభించి 10.30గంటలకు మైదుకూరు నాలుగురోడ్లు జంక్షన్‌కు చేరుకోనున్నారు. అక్కడ సమైక్యవాదులను ఉద్దేశించి షర్మిల ప్రసంగిస్తారు. అక్కడి నుంచి బద్వేలు చేరుకుని సాయంత్రం 5గంటలకు నాలుగురోడ్లు కూడలిలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో ప్రసంగించనున్నారు. తెలుగుజాతి అంతా ఒక్కటిగా ఉండాలని కోరుతూ షర్మిల చేస్తున్న బస్సు యాత్రకు సమైక్యవాదుల నుంచి పెద్ద ఎత్తున సంఘీబావం వ్యక్తమవుతోంది.
నేడు షర్మిల సమైక్య శంఖారావం
Published Fri, Sep 6 2013 2:46 AM | Last Updated on Fri, Sep 1 2017 10:28 PM
Advertisement
Advertisement