సాక్షి ప్రతినిధి, కడప : రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ..సమైక్యాంధ్ర ప్రదేశ్ కోసం ఉద్యమిస్తూ.. సమైక్య శంఖారావం చేపట్టిన షర్మిల బస్సు యాత్ర మార్గం జనసంద్రమవుతోంది. రాజన్న తనయ, జగనన్న సోదరి షర్మిల ప్రసంగాలు సమైక్యవాదులలో స్ఫూర్తిని నింపుతున్నాయి. సమన్యాయం పాటించలేనప్పుడు విభజించే హక్కు ఎవరిచ్చారంటూ షర్మిల నిలదీస్తుండటాన్ని సమైక్యవాదులు హర్షిస్తున్నారు.
పొద్దుటూరు నుంచి శనివారం ఉదయం సమైక్య శంఖారావం చేపట్టిన షర్మిల మైదుకూరులోని నాలుగురోడ్ల కూడలికి మధ్యాహ్నం 12 గంటలకు చేరుకున్నారు. అక్కడి నుంచి రాత్రి 7 గంటల ప్రాంతంలో బద్వేలు నాలుగురోడ్ల కూడలికి చేరుకుని అక్కడ ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించారు. రైతులను అమితంగా ప్రేమించిన వ్యక్తి దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి మాత్రమేనని కొనియాడారు. మహానేత పట్ల ఉన్న అభిమానంతో కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారన్నారు.
తెలుగు ప్రజలు పెట్టిన భిక్షతోనే కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగుతోందన్నారు. ఆదరించి అధికారం అప్పజెప్పితే రాష్ట్రాన్ని విభజించడానికి కాంగ్రెస్ నాయకత్వం పూనుకుందని ధ్వజమెత్తారు. విభజన పేరుతో రాష్ట్రాన్ని రెండు ముక్కలుగా చేసే అధికారం ఎవరిచ్చారని ప్రశ్నించారు. అన్నదమ్ముల్లా ఉన్న తెలుగు ప్రజల మధ్య నిప్పుపెట్టి ఆ మంటల్లో కాంగ్రెస్ నాయకత్వం చలికాచుకుంటోందని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు.
విభజిస్తే రాయలసీమ ఎడారే!
రాష్ట్ర విభజన జరిగితే ఒకనాటి రతనాల సీమ రాయలసీమ ఎడారిగా మారనుందని షర్మిల వివరించారు. రాష్ట్ర విభజన కారణంగా నదీ జలాలను వాడుకునే స్వేచ్చ, హక్కులను కోల్పోతామన్నారు.
శ్రీశైలం, ఎస్‌ఆర్‌బీసీ, టీజీపీ, జీఎన్‌ఎస్‌ఎస్, ఎస్‌ఎన్‌ఎస్‌ఎస్, కేసీ కెనాల్ నిర్వీర్యం కానున్నాయని వివరించారు. కర్ణాటకలోని అల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టుల్లో నీరు నిండితేనే కిందికి వస్తున్నాయని వివరించారు. అంతర్‌రాష్ట్ర జలాశయాలుగా మారితే వరద జలాలను సైతం వాడుకునే స్వేచ్చను కోల్పోవలసి వస్తుందని వివరించారు. కృష్ణా, గోదావరి నదులను అనుసంధానం చేస్తేనే ఆంధ్రప్రదేశ్‌కు యోగ్యకరమని షర్మిల వివరించారు. తెలుగుదేశం పార్టీ స్థాపించిన నందమూరి తారక రామారావు కుటుంబాన్నే నిలువునా చీల్చేందుకు నిత్యం కృషిచేస్తున్న చంద్రబాబునాయుడు రాాష్ట్ర విభజనలో ప్రాంతాలేమైనా పోయినా తనకేమీ సంబంధం లేదన్నట్లుగా ఓట్ల రాజకీయాలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు.
విద్యార్థులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, మహిళలు కోట్లాది మంది సమైక్య రాష్ట్రం కోరుతూ 40 రోజులుగా అనునిత్యం రోడ్లపైకి వస్తున్నారని, వారి ఆకాంక్ష మేరకు రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని ఆమె డిమాండ్ చేశారు. మైదుకూరు సమన్వయకర్త రఘురామిరెడ్డి, ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీకాంత్‌రెడ్డి, శ్రీనివాసులు, అమర్‌నాథరెడ్డి, ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి రాజమోహన్‌రెడ్డి, మాజీఎమ్మెల్యేలు డీసీ గోవిందరెడ్డి, డీసీసీబీ చైర్మన్ తిరుపాల్‌రెడ్డి, కమలాపురం సమన్వయకర్తలు మాజీ మేయర్ పి.రవీంద్రనాథ్‌రెడ్డి, దుగ్గాయపల్లె మల్లికార్జునరెడ్డి, జిల్లా కన్వీనర్ సురేష్‌బాబు, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు వైఎస్ అవినాష్‌రెడ్డి, మైదుకూరు యువనేత శెట్టిపల్లె నాగిరెడ్డి, డీఎల్ సోదరులు శ్రీనివాసరెడ్డి, గంగాధర్‌రెడ్డి, జనార్దన్‌రెడ్డి, ఈవీ మహేశ్వర్‌రెడ్డి, ధనపాల జగన్, కడప సమన్వయకర్త అంజాద్‌బాష,మాసీమబాబు, అఫ్జల్‌ఖాన్, హఫీజుల్లా తదితరులు షర్మిల వెంట ఉన్నారు.
నాడు పన్నుపోటు..నేడు వెన్నుపోటు
సీఎంగా తొమ్మిదేళ్లు అధికారాన్ని వెలగబెట్టిన చంద్రబాబు అప్పట్లో రాష్ట్ర ప్రజానీకంపై పన్నులపై పన్నులు పెంచుతూ పన్నుపోటు వేశారన్నారు. అధికారం కోసం పిల్లనిచ్చిన మామ అని కూడా చూడకుండా ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచారన్నారు. నేడు తెలుగు ప్రజలకు, తెలుగు తల్లికి మరోమారు వెన్నుపోటు పొడిచారని ధ్వజమెత్తారు. తెలంగాణ ఇచ్చేసుకోండి అని బ్లాంక్ చెక్కుపై సంతకం చేసినట్లు ఇచ్చినట్లుగా చంద్రబాబు లేఖ రాశారన్నారు. ఆయనగారు చంద్రబాబునాయుడు కాదు... వెన్నుపోటు చంద్రబాబునాయుడని.. ఈ వెన్నుపోటుదారునికి ఆత్మగౌరవం ఉందా.. అని షర్మిల ప్రశ్నించారు. ప్రజల గొంతు కోసి నిసిగ్గుగా యాత్ర చేపట్టారని ధ్వజమెత్తారు. తెలంగాణకు అనుకూలంగా ఇచ్చిన లేఖను వెనక్కి తీసుకోవాలని, ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు రాజీనామాలు చేసి పోరాడాలని డిమాండ్ చేశారు. అంతవరకు రాయలసీమలో అడుగు పెట్టనీయవద్దని తరిమితరిమి కొట్టాలన్నారు.
జనసంద్రం
Published Sun, Sep 8 2013 4:49 AM | Last Updated on Fri, Sep 1 2017 10:32 PM
Advertisement
Advertisement