సమైక్యాంధ్ర పరిరక్షణే ధ్యేయంగా ‘అనంత’ ప్రజానీకం ముందుకు సాగుతోంది. జిల్లాలో అన్ని వర్గాల ప్రజలు 36 రోజులుగా అవిశ్రాంత పోరాటం సాగిస్తున్నారు.
అనంతపురం టౌన్, న్యూస్‌లైన్ : సమైక్యాంధ్ర పరిరక్షణే ధ్యేయంగా ‘అనంత’ ప్రజానీకం ముందుకు సాగుతోంది. జిల్లాలో అన్ని వర్గాల ప్రజలు 36 రోజులుగా అవిశ్రాంత పోరాటం సాగిస్తున్నారు. సమైక్య సాధనే తమ లక్ష్యమని, ఇందు కోసం ప్రాణాలైనా అర్పిస్తామని స్పష్టం చేస్తున్నారు. బుధవారం జిల్లా వ్యాప్తంగా సమైక్యాంధ్ర ఉద్యమం కొనసాగింది. రాష్ట్ర విభజన జరిగితే జిల్లా వాసులకు ఏ విధంగా నష్టం వాటిల్లుతుందో ప్రజలకు అర్థమయ్యేలా, రాజకీయ నాయకులకు కనువిప్పు కలిగేలా నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. బత్తలపల్లిలో జర్నలిస్టులు చేపట్టిన దీక్షకు ఎమ్మెల్యే గురునాథరెడ్డి హాజరై సంఘీభావం తెలిపారు.
రాష్ట్ర విభజన జరిగితే అన్ని విధాలా నష్టపోయేది మనమేనని, ప్రాణాలున్నంత వరకూ సమైక్య రాష్ట్రం కోసం కృషి చేస్తామని ఎమ్మెల్యే అన్నారు. సమైక్య రాష్ట్రం కోసం కృషి చేస్తున్నది కేవలం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని గుర్తు చేశారు. రాష్ట్ర విభజన ప్రకటన వెలువడిన వెంటనే తమ పార్టీ ప్రజాప్రతినిధులంతా మూకుమ్మడిగా రాజీనామాలు చేశామని, తర్వాత వైఎస్ విజయమ్మ ఆమరణ దీక్ష చేపట్టారన్నారు. అనంతరం వైఎస్ జగన్మోహనరెడ్డి జైల్లోనే దీక్ష చేపట్టారని గుర్తు చేశారు. ప్రస్తుతం సమైక్య శంఖారావం పేరిట షర్మిల బస్సు యాత్ర చేస్తున్నారన్నారు.
ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా పనిచేస్తున్నది కేవలం వైఎస్ కుటుంబమేనని, కాంగ్రెస్, టీడీపీలు రెండు కళ్ల సిద్ధాంతాన్ని పాటిస్తూ ప్రజలను మభ్యపెడుతున్నాయని ధ్వజమెత్తారు. అనంతపురంలో ఇందిరాక్రాంతి పథం ఉద్యోగులు చేపడుతున్న రిలేదీక్షల్లో వినూత్నంగా ఖాళీ బిందెలను ప్రదర్శించారు. రాష్ట్ర విభజన జరిగితే తాగునీటి కరువు ఏర్పడుతుందని హెచ్చరించారు. స్టేట్ ఆడిట్ ఎంప్లాయిస్ అసోషియేషన్ ఆధ్వర్యంలో ఉద్యోగులు చెవిలో పూలు పెట్టుకొని నిరసన తెలిపారు. నగరంలో ఉపాధ్యాయ జాక్టో ఆధ్వర్యంలో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి.
మంగళవారం జిల్లా కేంద్రంలో సంయుక్త జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన అనంత జనగర్జన కార్యక్రమానికి వస్తున్న ఎస్కేయూ విద్యార్థులు, సమైక్యవాదులను పోలీసులు అడ్డుకోవడాన్ని నిరసిస్తూ సమైక్యవాదులు బుధవారం ఇటుకలపల్లి పోలీస్‌స్టేషన్‌ను ముట్టడించారు. సీఐ, ఎస్‌ఐలను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. రెండు గంటల పాటు పోలీస్‌స్టేషన్ ఎదుటే బైఠాయించారు. ధర్మవరంలో జేఏసీ ఆధ్వర్యంలో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. గుంతకల్లులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి.
విద్యార్థులు, ప్రైవేటు స్కూల్ అసోసియేషన్, జేఏసీల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన విద్యార్థి గర్జన విజయవంతమైంది. గుత్తి, పామిడిలలో సమైక్య ఉద్యమాలు హోరెత్తాయి. కళ్యాణదుర్గంలోని జయనగర్‌కాలనీ వాసులు సమైక్యాంధ్రకు మద్దతుగా ర్యాలీ, మానవహారం చేపట్టారు. మడకశిరలో రెవెన్యూ ఉద్యోగులు ర్యాలీ, వంటావార్పు నిర్వహించారు. అంగన్‌వాడీ కార్యకర్తలు రాస్తారోకో చేశారు. మడకశిరలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సమైక్య ర్యాలీ నిర్వహించారు.
పుట్టపర్తిలో సమైక్యాంధ్ర కోసం ఉద్యమకారులు రోడ్డుపైనే స్నానాలు చేసి నిరసన తెలిపారు. పెనుకొండలో జ్యోతిష్యం చెబుతూ సమైక్యవాదులు నిరసన తెలిపారు. సమైక్యాంధ్రకు మద్దతుగా రాయదుర్గం బంద్ విజయవంతమైంది. శాంతినగర్ కాలనీ వాసులు వంటావార్పు నిర్వహించారు. ప్రైవేట్‌స్కూల్స్, ఆర్యవైశ్యసంఘం, ఫొటోగ్రాఫర్స్, ఆల్‌మర్చెంట్స్, బలిజ సంఘం ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టారు. కణేకల్లులో విద్యార్థులు, ఉపాధ్యాయ జేఏసీ నాయకులు జలదీక్ష చేపట్టారు. ఎన్‌జీఓ సంఘం నాయకులు బిక్షాటన చేసిన నిరసన తెలిపారు. గార్లదిన్నెలో జేఏసీ నాయకులు రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ జేఏసీ ఆధ్వర్యంలో పెన్నా నదిలో నీటిలో కూర్చొని నిరసన తెలిపారు.
తాడిపత్రిలో ఆర్టీసీ జేఏసీ నాయకులు కూరగాయల దండలు ధరించి వినూత్నంగా నిరసన తెలిపారు. రాష్ట్ర విభజన జరిగితే ఇన్నాళ్లూ కష్టపడి అభివృద్ధి చేసుకున్న హైదరాబాద్ మనకు లేకుండా పోతుందా? అని కలత చెందిన ఓడిసి వాసి నారాయణరెడ్డి(43) గుండెపోటుతో మృతి చెందాడు. విభజన జరిగితే జరిగే నష్టాలపై స్థానికులతో చర్చిస్తుండగా గుండెపోటు రావడంతో ముదిగుబ్బ మండలం తప్పెలవారిపల్లికి చెందిన పీసీ నాగన్న (55) మృతి చెందాడు. ఇతడికి భార్య, ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.