
సమైక్య ఉద్యమం ఉధృతం
రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ ఉవ్వెత్తున ఎగసిన ఉద్యమంతో సీమాంధ్ర అట్టుడుకుతోంది. ప్రజా, విద్యార్థి సంఘాలు ఉద్యమాన్ని ముందుండి నడిపిస్తున్నాయి, మహిళలూ రోడ్డెక్కి ఉద్యమపథాన సాగుతున్నారు. ఊరూవాడ సమైక్య నినాదం ప్రతిధ్వనిస్తోంది. ఆదివారం పెద్ద ఎత్తున ప్రజలు ఉద్యమంలో కదంతొక్కారు. రాష్ట్రాన్ని విభజించొద్దంటూ అనంతపురంలో ముస్లింలు రోడ్డుపైనే ప్రార్థనలు చేశారు. ఆటో యూనియన్, మినీవ్యాన్, బోర్‌వెల్స్, జేసీబీ ఓనర్ల అసోసియేషన్ల ఆధ్వర్యంలో నగరంలో భారీ ర్యాలీలు నిర్వహించారు. టవర్‌క్లాక్, సప్తగిరి, వైఎస్సార్ సర్కిళ్లలో కేసీఆర్, సోనియా శవయాత్రలు, దిష్టిబొమ్మ దహనాలు చేపట్టారు. ఎస్కేయూలో అమరణ నిరాహారదీక్ష చేస్తున్న విద్యార్థి జేఏసీ నాయకులను నందమూరి లక్ష్మీపార్వతి పరామర్శించారు. వీరి దీక్షను రాత్రి 10 గంటలు దాటాక పోలీసులు భగ్నం చేశారు. చిత్తూరులో నాలుగు రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న ఎమ్మెల్యే సీకేబాబు తన దీక్షను మళ్లీ పొడిగించారు. పలమనేరు మాజీ ఎమ్మెల్యే అమరనాథరెడ్డి నిరాహార దీక్ష విరమించారు. సమైక్యాంధ్రకు మద్దతుగా రాజీనామా చేయాలని ఉద్యమకారులు తిరుపతి ఎంపీ చింతామోహన్‌ను కోరినప్పటికీ ఆయన ససేమిరా అని చెప్పారు.
చంద్రగిరి రాయలువారి కోటపెకైక్కి ఆందోళనకారులు నిరసన తెలియజేశారు. పర్యాటకులను బయటకు పంపి కోటకు తాళాలు వేశారు. మదనపల్లిలో హిజ్రాలు ఎమ్మెల్యే షాజహాన్ కార్యాలయం ముందు ఆటపాటలతో నిరసన తెలియజేశారు. జిల్లాలోని మిగిలిన ప్రాంతాల్లో ఉన్న హిజ్రాలంతా ఉద్యమంలో పాల్గొనాలని వారు పిలుపునిచ్చారు. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ దేశాయి తిప్పారెడ్డి డప్పుకొట్టి కూరగాయలు తరిగి వంటావార్పు కార్యక్రమంలో పాల్గొన్నారు. రజకులు ఎమ్మెల్యే కార్యాలయం ఎదుట బట్టలు ఉతికారు. లారీ వర్కర్స్ అసోసియేషన్ వారు లారీలపై కేసీఆర్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి చెప్పులతో కొడుతూ ర్యాలీ నిర్వహించారు. తోపుడు బండ్లవారు మోకాళ్లపై నిరసన తెలియజేశారు. జర్నలిస్టులు గాంధీ విగ్రహం వద్ద అర్ధనగ్న ప్రదర్శన చేశారు. రెవెన్యూ అసోసియేషన్ వారు సబ్‌కలెక్టర్ కార్యాలయం ముందు వంటావార్పు నిర్వహించారు. తిరుపతిలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు జ్యోతి థియేటర్ సర్కిల్‌లో నడిరోడ్డుపై వంటావార్పు కార్యక్రమం నిర్వహించారు. ఎస్వీయూలో విద్యార్థుల ఆమరణ నిరాహారదీక్ష రెండో రోజుకు చేరుకుంది. రాష్ట్ర విభజనపై నిర్ణయం తీసుకున్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి కనువిప్పు కలిగించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తిరుమల పట్టణ నేతలు ఆదివారం శ్రీవారికి విన్నవించారు. హుండీలో వినతిపత్రాలు సమర్పించి, అఖిలాండం వద్ద కొబ్బరికాయలు కొట్టి మొరపెట్టుకున్నారు.
కడపలో వికలాంగులు ర్యాలీ తీశారు. మైదుకూరులో ఆర్యవైశ్యులు చేపట్టిన రిలే దీక్షల్లో ైఎమ్మెల్యే డీఎల్ రవీంద్రారెడ్డి పాల్గొన్నారు. కమలాపురంలో చర్చి పాస్టర్లు, క్రైస్తవులు ర్యాలీలు నిర్వహించి మోకాళ్లపై ప్రార్థనలు చేశారు. ప్రకాశం జిల్లా ఒంగోలు శ్రీప్రతిభ కళాశాల విద్యార్థులు కర్నూలు రోడ్డుపై రాస్తారోకో చేశారు మార్కాపురంలో ఏపీ ఎన్‌జీఓలు, బీసీ సంక్షేమ సంఘాల ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శనలు జరిగాయి. వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో మార్టూరులో బంద్ నిర్వహించారు. చీరాలలో పొట్టిశ్రీరాములు విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. వైఎస్సార్‌సీపీ నేతలు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, అనిల్‌కుమార్ యాదవ్ నేతృత్వంలో ఆదివారం నెల్లూరుకు సమీపంలోని చింతారెడ్డిపాళెం వద్ద హైవేపై రాస్తారోకో నిర్వహించారు. గూడూరులో జర్నలిస్ట్‌లు కళ్లకు గంతలతో నిరసన తెలిపారు. తెలంగాణ జిల్లాల్లో పనిచేస్తున్న తమ బంధువుల్ని సీమాంధ్రకు వెళ్లిపోవాలని ఒత్తిడి చేస్తుండడాన్ని తట్టుకోలేక గుంటూరు, కోబాల్డ్‌పేటకు చెందిన ఆటోడ్రైవర్ మంచుపల్లి వందనంబాబు (25) శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత పురుగుమందు తాగి మృతిచెందాడు.
గుంటూరులో ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో హిందూ కళాశాల సెంటర్‌లో భారీ మానవహారం నిర్వహించారు. రాష్ట్రాన్ని ముక్కలు చేసేందుకు శిఖండిలా మారిన కేసీఆర్ బుద్ధిమారాలని హిజ్రాలు వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కేసీఆర్ పోస్టర్లను చెప్పులతో కొడుతూ నిరసన తెలిపారు. తెలుగుజాతి ఐక్యతా సమితి ఆధ్వర్యంలో పొట్టిశ్రీరాములు విగ్రహం వద్ధ విద్యార్థులు నిరసన తెలిపారు. విజయవాడలో పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో సబ్‌కలెక్టర్ కార్యాలయం నుంచి తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద ఉన్న తెలుగుతల్లి విగ్రహం వరకు నిరసన ప్రదర్శన నిర్వహించారు.
రాజమండ్రిలో జరిగిన సమైక్యాంధ్ర సదస్సులో సకల జనుల సహాయ నిరాకరణకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి తక్షణం రాజీనామా చేయాలని, లేకపోతే త్వరలో విడుదలయ్యే రామ్‌చరణ్ సినిమాను అడ్డుకుంటామని ఆయన అభిమానులు హెచ్చరించారు. ఈ నెల ఎనిమిదో తేదీ వరకూ విధులు బహిష్కరించాలని ఉభయ గోదావరి జిల్లాల న్యాయవాదుల ఐక్య కార్యాచరణ సమితి తీర్మానించింది. అమలాపురం శివారు ఇందుపల్లి గ్రామస్తులు, బ్రాహ్మణ సంఘం సభ్యులు అమలాపురం వెళ్లి గడియారం స్తంభం సెంటర్‌లోని ఆలయం వద్ద హోమాలు నిర్వహించారు. పి.గన్నవరం నియోజకవర్గం నగరంలో ఓఎన్‌జీసీ గ్యాస్ కలెక్షన్ సెంటర్, రిఫైనరీల నుంచి ఉత్పత్తుల తరలింపును ఆందోళనకారులు అడ్డుకున్నారు. కాగా సీతానగరం, గోకవరంలలో మంత్రి తోట నరసింహాన్ని ఘెరావ్ చేశారు.
సీతానగరంలో టీడీపీకి చెందిన రాజానగరం ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్, మంత్రి తోటకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. మండపేట నియోజకవర్గం కేశవరం గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీ చంద్రమళ్ల వీరేంద్ర (23) రాష్ట్ర విభజన ప్రతిపాదన తట్టుకోలేక రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. విజయనగరంలో సమైక్యవాదులు ముగ్గురు శిరోముండనం చేయించుకుని ఒంటినిండా జై సమైక్యాంధ్ర అంటూ నినాదాలు రాసుకుని నిరసన తెలిపారు. కర్నూలు జిల్లాలో జర్నలిస్టులు ర్యాలీలు తీశారు. కర్నూలులో ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు, వికలాంగులు, అంధులు, బధిరులు నిరసన వ్యక్తం చేశారు. రజక సంఘం ఆధ్వర్యంలో గాడిదలకు నాయకుల చిత్రపటాలు తగిలించి ఊరేగించారు. సమైక్యాంధ్రకు మద్దతుగా ఈనెల 6న హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారిని దిగ్బంధించనున్నట్లు వైఎస్సార్‌సీపీ కర్నూలు నియోజకవర్గ సమన్వయకర్త ఎస్వీ మోహన్‌రెడ్డి తెలిపారు. విశాఖ జిల్లా మద్దిలపాలెంలో యూత్‌కాంగ్రెస్ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసనలో ఆందోళనకారులు బస్సు అద్దాల్ని పగలగొట్టారు. ఉత్తరాంధ్ర టెక్నికల్ జేఏసీ ఏర్పాటైంది. దువ్వాడలో, ఎన్‌ఏడీ జంక్షన్ వద్ద ఆందోళనకారులు రైళ్లు నిలిపివేశారు. ఏయూలో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన విద్యార్థుల ఆరోగ్యం మరింత క్షీణించడంతో వారిని కేజీహెచ్‌కు తరలించారు.
అయితే మరికొందరు విద్యార్థులు రిలే నిరాహారదీక్షలు మొదలెట్టారు. పశ్చిమగోదావరి జిల్లా తాడిపూడిలో రాజీవ్‌గాంధీ విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. కేబుల్ ఆపరేటర్లు వినోదచానళ్ల ప్రసారాలను నిలిపివేశారు. పోలవరంలో వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్ తెల్లం బాలరాజు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. దెందులూరు మండలం శ్రీరామవరం గంగానమ్మ ఆలయంలో మహిళలు 1,008 బిందెలతో అభిషేకం చేశారు. శ్రీకాకుళం జిల్లా పాలకొండలో ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో మౌన ప్రదర్శన నిర్వహించారు. నరసన్నపేటలో విశ్వబ్రహ్మణ సంఘం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ తీయగా, ఎచ్చెర్లలో డాక్టర్ అంబేద్కర్ యూనివర్సిటీ విద్యార్థులు అంబేద్కర్ విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. గోదావరి జిల్లాల న్యాయవాదుల ఫిర్యాదు మేరకు రాజమండ్రి త్రీటౌన్ పీఎస్‌లో కేసీఆర్‌పై కేసు నమోదు చేశారు.