గుంటూరు, న్యూస్‌లైన్ : రాష్ట్రాన్ని చీల్చేందుకు ప్రయత్నిస్తున్న జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలను భూస్థాపితం చేస్తామని సమైక్యాంధ్ర జేఏసీ ప్రకటించింది. సమైక్య రాష్ట్ర పరిరక్షణకు చేపట్టబోయే కార్యాచరణను రూపొందించేందుకు మంగళవారం ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం (ఏఎన్‌యూ)లో సీమాంధ్ర విశ్వవిద్యాలయాలు, జిల్లా స్థాయి సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ నాయకుల సమావేశం జరిగింది. సమైక్యాంధ్ర జేఏసీ రాష్ట్ర కన్వీనర్ ఆచార్య ఎన్.శామ్యూల్ మాట్లాడుతూ తెలుగు జాతిని, రాష్ట్రాన్ని ఐక్యంగా ఉంచే వారికే కేంద్రంలో పాలించే అవకాశం కల్పిస్తామని స్పష్టంచేశారు. అసెంబ్లీలో విభజన తీర్మానాన్ని ఓడించే బాధ్యతను వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి, ఎన్.చంద్రబాబునాయుడు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఉద్యమ కార్యాచరణ.. : నవంబర్ 1న తెలుగు తల్లికి క్షీరాభిషేకం, కొవ్వొత్తుల ప్రదర్శన, 2న సోనియా, రాహుల్, సుష్మాస్వరాజ్‌ల దిష్టిబొమ్మల దహనం, 4న కాంగ్రెస్, 5న బీజేపీ ఆఫీసుల వద్ద ధర్నా, 6న హైవేల దిగ్బంధం చేపట్టాలని సమావేశంలో నిర్ణయించారు.
తీర్మనాలు.. : కాంగ్రెస్, బీజేపీల కార్యాలయాల వద్ద పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ముగిసే వరకు నిరసన కార్యక్రమాలు జరపాలని, విభజన తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేస్తామని ప్రకటించని ఎమ్మెలేలను అడ్డుకోవాలని తీర్మానించారు.