విమానాశ్రయం (గన్నవరం) : కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో భ్రస్టుపట్టిపోయిన సాంఘిక సంక్షేమ శాఖను గాడిలో పెట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ, గిరిజన అభివృద్ధి శాఖల మంత్రి రావెల కిషోర్‌బాబు స్పష్టం చేశారు. సోమవారం ఉదయం హైదరాబాద్ నుంచి గన్నవరం విమానాశ్రయానికి వచ్చిన ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అవినీతిమయమైన కాంగ్రెస్ పాలకులు రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలను నాశనం చేశారని చెప్పారు.
కొత్తగా ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు నేతృత్వంలో ఈ లోపాలను సరిచేసి ప్రజలకు నీతివంతమైన పాలనను అందించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ముఖ్యంగా సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేక దృష్టి సారించామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌కు ఖచ్చితంగా ప్రత్యేక హోదా సాధిస్తామని స్పష్టం చేశారు. నూతనంగా నిర్మించనున్న రాష్ట్ర రాజధానికి ప్రజలు తమవంతు సహాయమందించాలని కోరారు.
తంగిరాల మృతికి సంతాపం...
నందిగామ ఎమ్మెల్యే తంగిరాల ప్రభాకరరావు ఆకాల మృతి పార్టీకి, దళిత వర్గాలకు తీరని లోటన్నారు. విద్యార్థి దశ నుంచి మంచి నాయకత్వ లక్షణాలు కలిగిన ఆయన టీడీపీలో అంచెలంచెలుగా ఎదిగి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాకరని తెలిపారు. తంగిరాల కుటుంబ సభ్యులకు సానుభూతి వ్యక్తం చేస్తున్నట్లు పేర్కొన్నారు. తొలుత విమానాశ్రయంలో మంత్రికి సాంఘిక సంక్షేమ శాఖ అధికారులతో పాటు పలు దళిత సంఘాల నాయకులు, ఎస్సీ ఎంప్లాయీస్ అసోసియేషన్ నాయకులు ఘనంగా స్వాగతం పలికారు.
‘సంక్షేమా’న్ని గాడిలో పెడతాం : మంత్రి రావెల
Published Tue, Jun 17 2014 1:38 AM | Last Updated on Mon, Mar 18 2019 8:51 PM
Advertisement