దుర్గమ్మ గుడిలో మరో మాయాజాలం | Saree missing at durga temple in vijayawada | Sakshi

దుర్గమ్మ గుడిలో మరో మాయాజాలం

Published Mon, Aug 6 2018 2:42 AM | Last Updated on Mon, Aug 6 2018 7:12 AM

Saree missing at durga temple in vijayawada - Sakshi

దుర్గమ్మ గుడిలో మాయమైన రూ. 18 వేలు విలువ చేసే పట్టు చీర ఇదే..

ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ): బెజవాడ దుర్గమ్మ గుడిలో మరో మాయాజాలం చోటు చేసుకుంది. దుర్గమ్మకు ఆషాఢ సారెలో సమర్పించిన రూ.18 వేల విలువైన పట్టుచీర ఆదివారం మాయమైంది. ఇంద్రకీలాద్రిపై మహామండపంలోని ఆరో అంతస్తులో ఉత్సవమూర్తికి పట్టుచీరను అలంకరించిన పది నిమిషాల తర్వాత పట్టుచీర మాయం కావడంతో సారెను సమర్పించిన భక్త బృందం తీవ్ర మనస్తాపానికి గురైంది. అమ్మవారి సన్నిధి నుంచి చీరను దొంగిలించడంతో ఇంద్రకీలాద్రిపై భద్రత మరోసారి ప్రశ్నార్థకమైంది. గుంటూరు జిల్లా
తాడేపల్లి మండలం ఉండవల్లికి చెందిన లలితా మిగతా  పారాయణ భక్త బృందం సభ్యులు దుర్గమ్మకు సారెను సమర్పించారు.

సారెలో అమ్మవారికి సమర్పించేందుకు మదనపల్లిలో ప్రత్యేకంగా పట్టుచీరను నేత నేయించారు. సుమారు రూ.18 వేల విలువైన పట్టుచీరతోపాటు పూలు, పండ్లు, పూజా సామగ్రితో 300 మంది అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం మహామండపం ఆరో అంతస్తులో భక్త బృంద సభ్యులైన పద్మజ, బాలాత్రిపుర సుందరి అమ్మవారికి పట్టుచీరను సమర్పించారు. అమ్మవారి వేదిక వద్ద ఉన్న ఆలయ వైదిక కమిటీ సభ్యులు శంకర శాండిల్య, అర్చకుడు రమేశ్‌ ఉత్సవమూర్తికి పట్టుచీరను అలంకరించారు. కొద్దిసేపటి తర్వాత పట్టుచీరను ఉత్సవమూర్తిపై నుంచి తీసి పక్కనే ఉన్న అర్చకులకు అందచేశారు. ఇంతలో భక్త బృందానికి చెందిన బాలాత్రిపుర సుందరి చీరను ఇవ్వాలని కోరగా అప్పటికే చీర మాయమైనట్లు గుర్తించారు.

సిబ్బంది ఎదురుదాడి
చీర మాయం కావడంతో బాలాత్రిపుర సుందరి, పద్మజ ఆలయ సిబ్బందిని నిలదీశారు. ఆలయ సిబ్బంది మాత్రం మీ బృందం సభ్యులకే చీరను ఇచ్చామంటూ ఎదురుదాడికి దిగారు. భక్తితో అమ్మవారికి సమర్పించిన చీరను తామే తీసుకుని అబద్ధం ఆడాల్సిన అవసరం ఏముందంటూ వారు సిబ్బందిని ప్రశ్నించారు. చీర మాయమైన వ్యవహారంపై ఆలయ ఈవో ఎం.పద్మకు ఫిర్యాదు చేశారు. తర్వాత సీసీ కెమెరా పుటేజీని భక్త బృందం, ఆలయ అధికారులు పరిశీలించారు.

సీసీ పుటేజీ వైదిక కమిటీ సభ్యుడు చీరను ఉత్సవమూర్తి పై నుంచి తీసే వరకే ఉండటం వివాదానికి మరింత ఆజ్యం పోసినట్టైంది. మాయమైన చీర కోసం భక్త బృందం సభ్యులు చీరల కౌంటర్‌తోపాటు మహామండపం ఆరో అంతస్తులో వెతికినా ప్రయోజనం లేకుండా పోయింది. ఈ క్రమంలో చీర విషయాన్ని ఇక్కడితో వదిలేయాలని పాలకమండలి సభ్యుడు ఒకరు భక్త బృందం సభ్యులకు సూచించడంతో వారు అవాక్కయ్యారు. ఆలయ సిబ్బందే చీరను మాయం చేసి ఉంటారనే నిర్ధారణకు వచ్చారు.

మరోసారి బయటపడిన డొల్లతనం
దుర్గగుడిలో సీసీ కెమెరాల పనితీరు డొల్లతనం మరోసారి బయటపడింది. ఆషాఢ మాసం ప్రారంభం నుంచి భక్తుల రద్దీతో ఉంటున్న ఆరో అంతస్తులో సీసీ కెమెరాల పుటేజీ పూర్తిస్థాయిలో లభ్యం కాకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చీరను ఉత్సవమూర్తి పై నుంచి తీసిన తర్వాత పుటేజీ లభ్యం కాకపోవడం వెనుక కచ్చితంగా ఆలయ సిబ్బంది పాత్ర ఉండొచ్చని అంటున్నారు. పుటేజీని కావాలనే తొలగించి ఉంటారని భావిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement