సాక్షి, మచిలీపట్నం : పంచాయతీల్లో చెక్ పవర్‌ను పూర్తిగా సర్పంచులకే కట్టబెడుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. జిల్లాలో 970 పంచాయతీలకు గాను ఇటీవల 968 పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించడంతో కొత్త పాలకవర్గాలు ఏర్పడిన సంగతి తెలిసిందే. కృత్తివెన్ను మండలం చినపాండ్రాక పంచాయతీ ఎన్నికలకు సుమారు ఆరు నెలల గడువు ఉండడంతో పాత పాలకవర్గమే కొనసాగుతోంది. కంచికచర్ల మండలం పెండ్యాల పంచాయతీ రిజర్వేషన్ ఖరారులో వివాదం నెలకొనడంతో ఎన్నిక నిలిచిపోయింది. దాదాపు రెండేళ్లకు పైగా ఎన్నికలు నిర్వహించని ప్రభుత్వం పంచాయతీలను ప్రత్యేక అధికారుల పాలనకే వదిలేసింది.
2006లో ఏర్పడిన పంచాయతీల పాలకవర్గాలకు 2011తో పదవీకాలం పూర్తికావడంతో అప్పటి నుంచి ఇటీవల కొత్త పాలకవర్గాలు ఏర్పడే వరకు ప్రత్యేక అధికారుల పాలన కొనసాగిన సంగతి విదితమే. నిధులు లేక, ఆలనాపాలన లేక పంచాయతీలు నిర్వీర్యమయ్యాయి. ఇదే సమయంలో జిల్లాలో పంచాయతీలకు రావాల్సిన రూ.40 కోట్ల నిధులు నిలిచిపోయాయి. ఈ క్రమంలో కోటి ఆశలతో పదవులు చేపట్టిన కొత్త పాలకవర్గాలకు చెక్ పెడుతూ సర్పంచ్‌తోపాటు కార్యదర్శికి కూడా చెక్ పవర్ (జాయింట్ సంతకం) ఉండేలా ప్రభుత్వం నిబంధన పెట్టింది.
దీనికితోడు సమైక్య ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడడంతో ఉద్యోగులు ఆగస్టు 12 నుంచి సెప్టెంబర్ 17వరకు సమ్మెబాట పట్టారు. నిధులు మంజూరులోను జాప్యం జరిగింది. ఉద్యోగులు సమ్మె విరమించిన అనంతరం జిల్లాకు రూ. 20 కోట్లు మంజూరయ్యాయి. 13వ ఆర్థిక సంఘం నిధులు రూ.15 కోట్లు, స్టేట్ ఫైనాన్స్ నిధులు రూ.5 కోట్లు కేటాయించారు. తీరా వాటితో పంచాయతీల్లో అభివృద్ధి పనులు చేపడదామంటే కార్యదర్శుల జాయింట్ సంతకం కొత్త పాలకవర్గాలకు ఇబ్బందికరంగా మారింది. దీనిపై రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం ఆందోళన చేసింది.
ప్రభుత్వ నిర్ణయంపై కొత్త పాలకవర్గాలు సైతం తీవ్ర నిరసన వ్యక్తం చేశాయి. ఎట్టకేలకు దిగివచ్చిన ప్రభుత్వం జాయింట్ సంతకం నిబంధనను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ తాజా నిర్ణయంపై ఒక మేరకు ఆనందం వ్యక్తం చేస్తున్న సర్పంచ్‌లు ఆర్థికపరమైన విషయాలపై ఆంక్షలు పెట్టడంపై పెదవి విరుస్తున్నారు. ఆర్థిక పరమైన లావాదేవీలపై ఎటువంటి ఆక్షలు లేకుంటే నిధులు సైతం దుర్వినియోగం అయ్యే ప్రమాదం ఉందని పలువురు సీనియర్ కార్యదర్శులు చెబుతుండడం కొసమెరుపు.
ఉత్తర్వులు రావాలి
సర్పంచులకే చెక్ పవర్ కేటాయిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అధికారి కంగా ఉత్తర్వులు అందలేదు. కొత్త పాలకవర్గాలు ఏర్పడిన అనంతరం ఉద్యోగులు సమ్మె బాట వీడి విధుల్లోకి చేరిన తరువాత జాయింట్ చెక్ పవర్ ఆదేశాలను అమల్లోకి తెచ్చాం. ఇటీవల జిల్లాకు ప్రభుత్వం విడుదల చేసిన నిధుల వినియోగం, పలు అభివృద్ధి పనులు, బిల్లుల చెల్లిం పులు అన్నీ జాయింట్ సంతకంతోనే జరుగుతున్నాయి. సర్పంచులకే చెక్ పవర్ ఉత్తర్వులు మాకు అందాకే అమల్లోకి తెస్తాం,
- ఆనంద్, జిల్లా పంచాయతీ అధికారి
ప్రజాసమస్యల పరిష్కారానికి ఊతం..
చెక్ పవర్‌పై జాయింట్ సంతకం పద్ధతి తొలగించడం మంచి పరిణామం. సర్పంచులకే చెక్ పవర్ ఇవ్వడం వల్ల స్వేచ్ఛగా అభివృద్ధి పనులు చేయడానికి ఆస్కారం ఏర్పడుతుంది. ప్రజాసమస్యలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించడానికి మార్గం సుగమం అవుతుంది.
-తలారి రామవెంకటలక్ష్మి, తుమ్మలచెరువు సర్పంచ్
జాయింట్ సంతకం ఇబ్బందే..
జాయింట్ చెక్ పవర్ వల్ల అభివృద్ధి పనులకు నిధుల కేటాయింపులో ఇబ్బందులు ఎదురవుతాయి. దీనిపై సర్పంచులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో ప్రభుత్వం దిగివచ్చింది. సర్పంచులకే చెక్ పవర్ ఇవ్వడం వలన అప్పటికప్పుడు పంచాయతీల్లో కావాల్సిన పనులు త్వరితగతిన చేపట్టవచ్చు.
-మేకా లవకుమార్, పోతిరెడ్డిపాలెం సర్పంచ్
పేదలకు ఆసరాగా...
సర్పంచిగా గెలిచి, నెలలు గడుస్తున్నా వ్యక్తిగతంగా చెక్ పవర్‌ను ప్రభుత్వం ఇవ్వలేదు. వ్యక్తిగతంగా సర్పంచులకు ఇచ్చిన చెక్‌పవర్‌తో గ్రామంలో పేదలకు అవసరమైన పనుల్ని చేసేందుకు ఆసరాగా నిలుస్తా. నమ్మి సర్పంచిగా గెలిపించిన గ్రామానికి అభివృద్ధిని అందిస్తా.
- పడమటి సుజాత, కౌతవరం సర్పంచి (గుడ్లవల్లేరు మండలం)
బాధ్యత తప్పింది...
సర్పంచులతో పాటు మాకూ జాయింట్ చెక్ పవర్ ఇచ్చారు. కానీ అది కాదని సర్పంచ్ ఒక్కరికే ఇవ్వడం వలన మాకు బాధ్యత తప్పింది. మాకు సంబంధం లేకుండా చెక్కుల జారీలో సర్పంచులే నిర్ణయాలు తీసుకుంటారు. నిధుల విషయంలో అనుకోకూడనివి జరిగితే మాకు సంబంధం లేకుండా పోయింది.
- జి.టి.వి.రమణ, గుడ్లవల్లేరు గ్రామ కార్యదర్శి
సర్పంచులకే చెక్ ‘పవర్’
Published Mon, Nov 4 2013 1:26 AM | Last Updated on Sat, Sep 2 2017 12:15 AM
Advertisement
Advertisement