పార్టీ మార్పిడిని సూచించడం ఎలా? గతంలో ఈ ప్రక్రియకు ఉన్న పేరేమిటి? అప్పటి ప్రక్రియ కంటే ఇప్పటి ప్రక్రియ వల్ల ఒనగూరే అదనపు ప్రయోజనాలేమిటి?
పైన కనిపిస్తున్న వాక్యం పరీక్ష పేపర్‌లోని ప్రశ్నలా అనిపిస్తోందా? కరెక్టే. కానీ ఈ ప్రశ్న నా దృష్టికి వచ్చిన తీరూ.. దాని కథా కమామిషూ తర్వాత చెబుతా. క్వెశ్చన్ పేపర్లో దీన్ని చదవగానే.. ‘‘ఇదేంట్రా.. ఈ ప్రశ్నేమిటి ఇలా ఉంది?’’ అంటూ మా బుజ్జిగాడిని అడిగా.
‘‘ఇది చాలా ఈజీ క్వెశ్చెన్ నాన్నా. పైగా ఏదైనా తెలియకపోతే కామన్‌సెన్స్‌తో ఆలోచించి రాసేయమని నువ్వే అన్నావ్ కదా. అలా ఈజీగా రాసేశా’’ అన్నాడు.
‘‘పార్టీ మార్పిడికి అప్పట్లో ఓ మాటా.. ఇప్పుడు ఆ ప్రక్రియకు ఓ విధానం ఉందా? అయినా ఈజీ క్వెశ్చెన్ అంటున్నావు కదా. ఏం రాశావ్?’’ అని అడిగా.
అప్పుడు వాడు చెప్పిన జవాబిది.
ఒకప్పుడు పార్టీ మారితే.. దాన్ని ‘‘తీర్థం పుచ్చుకోవడం’’ అనే మాటతో సూచించేవారు. ఉదాహరణకు ఒక అభ్యర్థి ఒక పార్టీ నుంచి మరో పార్టీకి మారినప్పుడు ఫలానా అభ్యర్థి ఫలానా పార్టీ ‘‘తీర్థం పుచ్చుకున్నాడ’’ని న్యూస్ పేపర్లలో రాసేవారు. కానీ ప్రస్తుతం ‘‘తీర్థం పుచ్చుకోవడం’’ అనే ఆ మాట పూర్తిగా అంతరించిపోయినట్లే. దాన్ని ఇప్పుడెవరూ న్యూస్ పేపర్లలో రాయడం గానీ, టీవీల్లో చెప్పడం గానీ చేయడం లేదు. అయితే ఒక అభ్యర్థి పార్టీ మారిన సందర్భాల్లో మరికొందరు ‘‘ఫలానా గూటికి చేరడం’’ అని కూడా వ్యవహరించేవారు. ఈ మాట కూడా దాదాపుగా అంతరించే దశలోనే ఉంది.
ప్రస్తుతం అమల్లో ఉన్న విధానం: అయితే ఇప్పుడు తాజాగా పార్టీ మారిన ప్రక్రియకు సూచనగా ఆ పార్టీ జెండాను సూచించేలా ఉన్న రంగులతో కూడిన ‘‘కండువాను పార్టీ మారిన వ్యక్తికి కప్పడం’’ జరుగుతోంది. అందుకే ఇప్పుడు పార్టీ మారే ప్రక్రియను ‘‘తీర్థం పుచ్చుకోవడం’’గా చెప్పడానికి బదులు ‘‘కండువా కప్పుకోవడం’’గా వ్యవహరిస్తున్నారు.
ప్రయోజనాలు: తీర్థం పుచ్చుకోవడం అన్న మాట ఒక సూచనాత్మకమైన మాట మాత్రమే. ఈ సమయంలో నిజంగా తీర్థం పుచ్చుకోవడం జరిగేది కాదు. ఒకవేళ గతంలో పార్టీ మారినప్పుడు నిజంగానే తీర్థం పుచ్చుకోవడం జరిగినా అది కడుపులోకి వెళ్లి, మటుమాయం అయిపోతుంది కాబట్టి తాను మారిన పార్టీ ఏమిటో గట్టిగా గుర్తుపెట్టుకుంటే తప్ప అభ్యర్థికి పెద్దగా గుర్తుండే అవకాశం ఉండదు. అయితే కండువా కప్పడం వల్ల మంచి ప్రయోజనం ఉంది. కండువాపై పార్టీ జెండాలోని రంగులు, పార్టీ గుర్తు స్పష్టంగా ఉంటాయి కాబట్టి... ఆ కండువా కనిపిస్తున్నంత సేపు అభ్యర్థికి తాను మారిన పార్టీ ఏదో, తానిప్పుడు ఏ పార్టీలో ఉన్నాడో స్పష్టంగా తెలుస్తుంది.
‘‘ఇదీ నాన్నా ఆ ప్రశ్నకు ఆన్సరు’’ అంటుండగా నాకు మెలకువ వచ్చింది.
ఇప్పుడు అసలు విషయం చెబుతా వినండి. ప్రస్తుతం మావాడి పరీక్షలు అవుతున్నాయి. ఈ టైమ్‌లోనైనా కాస్తో కూస్తో శ్రద్ధ తీసుకోవాలి కదా అంటూ నిన్న వాడితో సోషల్ సబ్జెక్ట్ చదివించా. అలాగే వాడు పరీక్ష రాసి రాగానే.. ఆ క్వెశ్చన్ పేపర్‌లోని ప్రశ్నల్ని చదువుతూ.. వాటికి ఆన్సర్లు ఏమి రాశాడో వాకబు చేయడం కూడా నాకు అలవాటు. సరిగ్గా పరీక్షల సీజన్‌లోనే, ఎన్నికలూ రావడం.. న్యూస్‌పేపర్లలో చదివిన అంశాలూ, వాడితో చదివించిన విషయాలు మెదడులో కలగాపులగమైపోయాయి. దాంతో వాడు ‘‘పార్టీమార్పిడి... అనుకూల దశలు... పద్ధతులూ – ప్రయోజనాలూ’’ లాంటి పాఠాన్ని నేను వాడితో చదివించినట్టూ.. అదే లెసన్ నుంచి ఎగ్జామ్‌లో క్వెశ్చన్ వచ్చినట్టూ, దానికి వాడు రాసిన ఆన్సర్‌ను నేను చదివించుకున్నట్టూ వచ్చిన కల ఇది.
–యాసీన్
Comments
Please login to add a commentAdd a comment