ఆ ఎమ్మెల్యే తీరుపై తమ్ముళ్ల అసంతృప్తి | SATYAVEDU dissatisfied with the way the MLA | Sakshi
Sakshi News home page

ఆ ఎమ్మెల్యే తీరుపై తమ్ముళ్ల అసంతృప్తి

Published Tue, Jan 19 2016 1:52 AM | Last Updated on Fri, Aug 10 2018 8:16 PM

SATYAVEDU dissatisfied with the way the MLA

సత్యవేడు ఎమ్మెల్యే తీరుపై తమ్ముళ్ల అసంతృప్తి
తిరుపతిలో ఎమ్మెల్యే అల్లుడిదే హవా
శ్రీకాళహస్తిలో చెర్మైన్, కౌన్సిలర్‌ల మధ్య మాటల యుద్ధం
చంద్రగిరిలో మూడు ముక్కలాట
జీడీ నెల్లూరులో కొరవడిన సఖ్యత
కుప్పంలో సీఎం, పీఏ తీరుపై నాయకుల్లో వ్యతిరేకత

 
తిరుపతి:  తెలుగుదేశం పార్టీలో అంతర్గత కుమ్ములాటలు రోజురోజుకూ పెచ్చరిల్లుతున్నాయి. ముఖ్యమంత్రి స్వంత జిల్లాలో పార్టీ నాయకులు బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేసే స్థాయికి వర్గవిభేదాలు చేరాయి.
 
సత్యవేడులో సామాన్యుల గోడు
 సత్యవేడు నియోజకవర్గంలో ఎమ్మెల్యే తలారి ఆదిత్య తండ్రి పెత్తనంపై ద్వితీయశ్రేణి నాయకులు రగిలిపోతున్నారు. నియోజకర్గానికే చెందిన పిచ్చాటూరు జెడ్పీటీసీ సభ్యురాలు ఇటీవల  తిరుపతిలో విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసి తమను పార్టీలో అవమానాలకు గురిచేస్తున్నారని ప్రకటించడం గమనార్హం. జిల్లాలోని పార్టీ పెద్దలకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని వాపోయారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మహిళలకు ఇచ్చే గౌరవం ఇదేనా అని  కన్నీటిపర్యంతమయ్యారు.
 
తిరుపతిలో అల్లుడిదే పరపతి
తిరుపతిలో ఎమ్మెల్యే సుగుణమ్మ అల్లుడు, ఆయన కోటరీ పెత్తనంతో ద్వితీయ శ్రేణి నాయకులు రగిలిపోతున్నారు. నగర అధ్యక్షుడి తీరుపై సీనియర్ నాయకులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇక్కడ ముఖ్యంగా రెండు సామాజికవర్గాల మధ్య పోరు నడుస్తోంది.
 
చంద్రగిరిలో తలో దారి
చంద్రగిరిలో దేశం నాయకుల మధ్య మూడు ముక్కలాట సాగుతోంది. మాజీ మంత్రి గల్లా అరుణకుమారి, ఎమ్మెల్సీ ముద్దుకృష్ణమనాయుడుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా పరిస్థితి ఉంది. దీనికి తోడు చినబాబు, గల్లా వర్గీయుల మధ్య ఆధిపత్య పోరు నడుస్తూనే ఉంది. జన చైతన్యయాత్రలో సైతం ఇది కొట్టొచ్చినట్లు  కనిపించింది.

గంగాధర  నెల్లూరులో గరం గరం
గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో నియోజవర్గ ఇన్‌చార్జి కుతూహలమ్మ, పాతగుంట మనోహర్‌నాయుడు వర్గాల మధ్య బహిరంగంగానే మాటల యుద్ధం సాగుతోంది.
 
శ్రీకాళహస్తిలో చిర్రుబుర్రు
శ్రీకాళహస్తి నియోజకవర్గంలో  టీడీపీకి చెందిన మున్సిపల్ చైర్మన్‌కు, అదేపార్టీ కౌన్సిలర్లకు మధ్య అంతరం రోజురోజుకు పెరుగుతూనే వుంది. పార్టీలో దాదాపు 90 శాతానికి పైగా కౌన్సిలర్‌లు చైర్మన్ తీరుపై అసంతృప్తితో ఉన్నట్టు సమాచారం. కౌన్సిలర్లుగా ఎన్నికై 18 నెలలు గడిచినప్పటికీ ప్రజలకు తామేమీ చేయలేకపోయామని బహిరంగంగా వారు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. నియోజకవర్గంలో ద్వితీయశ్రేణి నాయకుల మధ్య ఉన్న  వర్గ విభేదాలతో మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి సైతం తలపట్టుకుంటున్నారు.
 
అన్నింటా అసంతృప్తి మంట
 పీలేరులో సైతం మూడు గ్రూపుల నడుమ కార్యకర్తలు ఇబ్బందిపడుతున్నారు. కుప్పం నియోజకవర్గంలో ముఖ్యమంత్రి, ఆయన పీఏ తీరుపై నాయకులు అసంతృప్తితో రగిలిపోతున్నారు. చిత్తూరులో రెండు సామాజికవర్గాల మధ్య ఆధిపత్య పోరు నడుస్తూనే  ఉంది. నగరి నియోజకవర్గంలో ఆది నుంచి పార్టీని అంటిపెట్టుకుని ఉన్న దేశం నేతలు, గాలి ముద్దుకృష్ణమనాయుడు వర్గానికి దూరంగా ఉంటున్నారు. మదనపల్లిలో రెండు గ్రూపుల మధ్య తగాదాలు అధినేత తల బొప్పికట్టిస్తున్నాయి.
 
ఇలా ముఖ్యమంత్రి సొంతజిల్లాలోని టీడీపీ నేతల మధ్య అసంతృప్తి రోజు రోజుకు పెరిగిపోతుండటంతో అధిష్టానం ఆందోళన చెందుతోంది. జిల్లాలో నెలకొన్న గ్రూపుల మధ్య సయోధ్య కుదర్చాలని ముఖ్యమంత్రి, చినబాబు చేసిన ప్రయత్నాలు సైతం బెడిసికొట్టడంతో, పార్టీ పెద్దలు అందోళన చెందుతున్నారు. ఈ తగాదాలు ఏ తీరానికి చేరుతాయోనని చర్చించుకుంటున్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement