మన తీరం భద్రమేనా.. | Save the coast of Visakhapatnam? | Sakshi
Sakshi News home page

మన తీరం భద్రమేనా..

Published Sun, Jan 4 2015 1:09 AM | Last Updated on Thu, Sep 19 2019 2:50 PM

మన తీరం భద్రమేనా.. - Sakshi

మన తీరం భద్రమేనా..

తూర్పు తీరంలో కీలకంగా మారిన విశాఖ
నిరంతర నిఘాతో కోస్టు గార్డు అప్రమత్తం
భరోసా ఇస్తున్న నౌకాదళం

 
విశాఖపట్నం: గుజరాత్ తీరంలో శుక్రవారం జరిగిన సంఘటన ప్రజానీకాన్ని కలవరపర్చింది. ఆయుధాలతో పాక్ పడవొకటి తీరంలోకి చొరబడేందుకు చేసిన యత్నం గగుర్బాటు కలగించింది. తీరంతో అల్లుకున్న విశాఖ భద్రతపై ఒక్కసారిగా ఇక్కడి ప్రజానీకం ఉలికిపడింది. ఇదే సందర్భంలో విశాల తీరమున్న విశాఖలో భద్రత ఎలా ఉందనే ప్రశ్న అందరిలో మెదిలింది. నిరంతరం కంటికి రెప్పలా తీరాన్ని   పరిరక్షిస్తున్న కోస్టుగార్డు..మెరైన్ పోలీసు బలగాలు మాత్రం అప్రమత్తమై ఎలాంటి ఢోకా లేదంటూ భరోసానిస్తున్నాయి. జిల్లాలో 170 కిలోమీటర్లు మేర తీర ప్రాంతం ఉంది. నగర కమిషనరేట్ సరిధిలో 45 కిలో మీటర్ల తీరముంది. దీని రక్షణకు నగరంలో కోస్ట్‌గార్ట్ స్టేషన్‌ను 1987లో రిషికొండ వద్ద నెలకొల్పారు. కోస్ట్ గార్ట్‌కు 200 మీటర్ల పొడవున్న సొంత జెట్టీ కూడా ఉంది. తీరరక్షణ దళం 24గంటలూ తీరంపై డేగకన్ను వేస్తుంది. కొంత కాలంగా మెరైన్ పోలీస్ వ్య వస్థను కూడా పటిష్టపరిచేందుకు ప్రభుత్వం తీసుకుంటోంది. అయితే ఈ వ్యవస్థను ఇంకా బలోపేతం చేయాల్సి ఉందనే అభిప్రాయం వినిపిస్తోంది. ఆదిలో చేసిన హడావిడి ఇప్పుడు కనిపించడం లేదు. ఈ విభాగం సిబ్బంది కొరతతో సతమతమవుతోంది.  తీర రక్షణకు మెరైన్ పోలీస్ స్టేషన్‌ను రుషికొండ, ఒన్‌టౌన్‌లోని విశాఖ టెర్మినల్ వద్ద, పూడిమడక ప్రాంతంలో ఏర్పాటు చేశారు. విశాఖ మెరైన్ పోలీస్ స్టేషన్లకు ఓ ఏఎస్పీ, ఇద్దరు డీఎస్పీ, 42 మంది కానిస్టేబుళ్లను మంజూరు చేస్తే ప్రస్తుతం ఏఎస్పీ తో పాటు 25 మంది కంటే తక్కువగా కానిస్టేబుళ్లు ఉన్నారు. అన్నిటినీ మించి మెరైన్ పోలీస్ వింగ్ ప్రధానాధికారి ఇప్పటికీ హైదరాబాద్‌లోనే ఉన్నారు. తీరమే లేని రాజధా ని నుంచి దీని ఆపరేషనుకు చర్యలేమిటనే విమర్శ వినిపిస్తోంది. రాష్ట్ర మెరైన్ పోలీస్ వింగ్ ప్రధాన కేంద్రానికి 2012 నవంబర్ నుంచి హరీష్‌కుమార్ గుప్తా టాప్ బాస్‌గా ఉన్నారు. విశాఖలో ఐజి శ్రీనివాసరెడ్డి ఉండేవారు. కానీ దినేష్‌రెడ్డి డీజీపీగా ఉన్నప్పుడు ఆయన కూడా హైదరాబాద్‌కు వెళ్లిపోయారు. రాష్ట్ర విభజన జరిగినా మన రాష్ట్రానికి ప్రధానాధికారిని ప్రత్యేకంగా కేటాయంచలేదు. మెరైన్ పోలీస్‌కు కేటాయించిన జెట్టీని నిలిపేందుకు కూడా పోర్టులో అనుకూల స్థలం లేదు. సంఘటన జరగకమునుపే ఇలాంటి వ్యవహారాలపై స్పందించాల్సిన అవసరముంది.
 
తూర్పు నౌకాదళం కేంద్రం: తూర్పు నౌకాదళం ప్రధాన కేంద్రం నగరంలోనే ఉండటం తీరరక్షణకు సానుకూలాంశం. భారీ బలగమున్న ఈ నౌకాదళం ఇప్పటికే ఎన్నో విజయాలను నమోదు చేసుకుంది. నాలుగు దశాబ్దాల కిందటే పాకిస్తానుకు తన సత్తాను చూపించిందీ శౌర్యదళం.
 
 
1971లో విశాఖలో చొరబడటానికి పాకిస్థాన్ తీవ్రవాదులు ప్రయత్నించారు. అయితే మన నౌకాదళం మన రక్షక దళం ప్రాణాలొడ్డి పోరాడి విజయం సాధించింది. దానికి గుర్తుగా ప్రతి ఏటా డిసెంబర్ 5న నేవీ డే నిర్వహిస్తున్నారు. ముష్కరులు దాడి చేస్తే ఏ విధంగా ఎదుర్కోడానికి మన దగ్గర ఉన్న సత్తా ఏమిటో ప్రపంచానికి చాటి చెబుతున్నారు. ఆనాటి యుద్ధానికి చిహ్నంగా బీచ్ రోడ్డులో ‘విక్టరీ ఎట్ సీ’ పార్కును 1996లో నిర్మించారు. ఆనాటి నుంచీ విశాఖ తీరం శత్రు దుర్భేధ్యంగానే ఉంది. ఎలాంటి చొరబాట్లకు అవకాశం లేకుండా సముద్రంలో కోస్ట్ గార్డ్, ఉపరితలంపై పోలీస్ విభాగాలు నిరంతరం పహారా కాస్తున్నాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement