ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో చదువుతున్న ఎస్సీ, ఎస్టీ బాలికలకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రోత్సాహక నగదు బహుమతులు ఐదేళ్లుగా అందని ద్రాక్షగానే మిగిలాయి.
ఒంగోలు ఒన్‌టౌన్, న్యూస్‌లైన్: ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో చదువుతున్న ఎస్సీ, ఎస్టీ బాలికలకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రోత్సాహక నగదు బహుమతులు ఐదేళ్లుగా అందని ద్రాక్షగానే మిగిలాయి. 9వ తరగతి చదువుతున్న ఎస్సీ, ఎస్టీ బాలికల పేరుతో బ్యాంకులో రూ. 3 వేలు డిపాజిట్ చేస్తామన్న కేంద్ర ప్రభుత్వ మాటలు నీటి మూటలయ్యాయి. జిల్లాలో సుమారు 10 వేల మంది 9వ తరగతి విద్యార్థినులకు రూ. 3 కోట్లు విడుదల చేయాల్సిన ప్రభుత్వం కనీసం చిల్లిగవ్వ కూడా విడుదల చేయలేదంటే ఎస్సీ, ఎస్టీ బాలికల పట్ల పాలకుల చిత్తశుద్ధి ఏపాటిదో తేటతెల్లమవుతుంది. బాలికలకు లబ్ధి చేకూర్చేందుకు 2008-09 ఆర్థిక సంవత్సరంలో ప్రవేశపెట్టిన పథకం కాగితాలకే పరిమితమైంది. పెట్రోలు, డీజిల్ వంటి ఇతర అన్ని రకాల వస్తువుల విక్రయాలపై విద్యాపన్ను (ఎడ్యుకేషన్ సెస్), ఆదాయపన్ను చెల్లింపుదారుల నుంచి ఎడ్యుకేషన్ చార్జిని ముక్కు పిండి వసూలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం విద్యా పథకాలకు, ప్రోత్సాహకాలకు మాత్రం నిధులు విడుదల చేయడంలో మీనమేషాలు లెక్కిస్తోంది. ఫలితంగా కేంద్రం ఆర్భాటంగా ప్రకటిస్తున్న పథకాలు ఆచరణతో కార్యరూపం దాల్చకుండా అటకెక్కుతున్నాయి.
పథకం లక్ష్యాలివీ...
ఎస్సీ, ఎస్టీ బాలికల్లో బాల్య వివాహాలు నిరోధించి వారు కనీసం ఇంటర్మీడియెట్ వరకు విద్యను కొనసాగించడం లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఇన్సెంటివ్ టు గర్ల్స్ ఫర్ సెకండరీ ఎడ్యుకేషన్ పేరుతో నగదు ప్రోత్సాహక పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం కింద 2008-09 విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ, జిల్లా పరిషత్, మున్సిపల్, ఎయిడెడ్ ఉన్నత పాఠశాలల్లో 9వ తరగతి చదువుతున్న ఎస్సీ, ఎస్టీ బాలికల పేరుతో బ్యాంకుల ఖాతాలు ప్రారంభించి ఒక్కొక్కరి ఖాతాకు రూ. 3 వేలు డిపాజిట్ చేయాలని నిర్ణయించారు. ఆ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. అప్పట్లో ప్రధానంగా ఎస్సీ, ఎస్టీ వర్గాల్లో బాలికలకు బాల్య వివాహాలు చే స్తుండటంతో వారు విద్యకు దూరమవుతున్నారు.
చిన్నతనంలోనే గర్భవతులై ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పిల్లల చదువు ఖర్చును భరించలేక ఈ వర్గాల పిల్లలను తల్లిదండ్రులు విద్యకు దూరం చేస్తున్నారు. ప్రభుత్వం 2004-05 విద్యా సంవత్సరంలో బాలికల నమోదు, నిలకడ, డ్రాపవుట్స్ వివరాలను ప్రాతిపదికగా తీసుకున్నారు. ఆ సంవత్సరం గణాంకాల ప్రకారం 1 నుంచి 8వ తరగతి వరకు 50.8 శాతం, 1 నుంచి 10వ తరగతి వరకు 64 శాతం మంది ఎస్సీ, ఎస్టీ బాలికలు మధ్యలోనే చదువుకు స్వస్తి చెబుతున్నారు. అంటే 100 మంది బాలికలు 1వ తరగతిలో చేరితే కేవలం 34 మంది మాత్రమే 10వ తరగతి వరకు చదువు కొనసాగిస్తున్నట్లు తేలింది. ఈ నేపథ్యంలో ఎస్సీ, ఎస్టీ బాలికలను కనీసం 18 సంవత్సరాల వరకు చదువును కొనసాగించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ పథకానికి శ్రీకారం చుట్టింది.
ఎవరు అర్హులు..
2008-09 విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ రంగ పాఠశాలల్లో 8వ తరగతి ఉత్తీర్ణులై ప్రభుత్వ రంగ పాఠశాలలోనే 9వ తరగతి చదువుతున్న ఎస్సీ, ఎస్టీ బాలికలు ఈ పథకం కింద లబ్ధిపొందేందుకు అర్హులు. కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాల్లో 8వ తరగతి పూర్తిచేసి 9వ తరగతికి రెగ్యులర్ పాఠశాలల్లో చేరిన అన్ని వర్గాలకు చెందిన బాలికలకు రిజర్వేషన్లతో సంబంధం లేకుండా అందరికీ ఈ పథకాన్ని వర్తింపచేయమన్నారు. అయితే 9వ తరగతిలో చేరే నాటికి వారిలో ఎవరికైనా వివాహం అయి ఉంటే వారికి ఈ పథకం వర్తించదు. 18 సంవత్సరాలు పూర్తైకనీసం 10వ తరగతి ఉత్తీర్ణులైన వారికి మాత్రమే ఈ పథకం కింద వారి పేరుతో బ్యాంకులో డిపాజిట్ చేసిన మొత్తాన్ని, దానిపై వడ్డీని సంబంధిత బ్యాంకులకు చెల్లిస్తారు. ఈ పథకం అమలుకు 11వ పంచవర్ష ప్రణాళికలో మొత్తం రూ. 1556.73 కోట్లు కేటాయించారు. 2008-09లో 11.91 లక్షల మందికి, 2009-10లో 12.50 లక్షల మందికి, 2010-11లో 13.12 లక్షల మందికి, 2011-12లో 13.78 లక్షల మంది బాలికలకు నగదు ప్రోత్సాహకాలు ఇవ్వాలని నిర్ణయించి ఆ మేరకు నిధులు మంజూరు చేశారు. అయితే ఆ గడువు ముగిసినా నేటికీ ఈ పథకం కింద ఒక్క రూపాయి కూడా జిల్లాకు విడుదల కాకపోవడం గమనార్హం.
10వేలమంది బాలికల ఎదురుచూపులు..
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఎస్సీ, ఎస్టీ బాలికలకు నగదు ప్రోత్సాహక పథకం కింద లబ్ధిపొందేందుకు బ్యాంకుల్లో ఖాతాలు ప్రారంభించిన సుమారు 10 వేల మంది నిధుల కోసం ఎదురుచూస్తున్నారు. రూ. 500 చెల్లించి బ్యాంకుల్లో ఖాతాలు ప్రారంభించి నాలుగేళ్లు దాటినా నేటికీ తమ ఖాతాల్లోకి నిధులు జమ పడకపోవడంపై బాలికలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో 2008-09లో 1500 మంది, 2009-10లో 1754 మంది, 2010-11లో 1923 మంది, 2011-12లో 2222 మంది, 2012-13లో 2400 మంది విద్యార్థినులు బ్యాంకుల్లో ఖాతాలను ప్రారంభించారు. జిల్లా బాలికలకు సుమారు 3 కోట్ల రూపాయల ప్రోత్సాహక నిధులు విడుదల చేయాల్సిన ప్రభుత్వం ముఖం చాటేస్త్తోంది.