స్కూల్ బస్ బోల్తా
- 14 మంది విద్యార్థులకు గాయాలు
- కోలుకుంటున్న చిన్నారులు
గొలుగొండ/ నర్సీపట్నం టౌన్ : ప్రవేట్ స్కూల్ బస్సు అదుపుతప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టి సోమవారం ఉదయం బొల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా,14 మంది విద్యార్థులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. రోజూ మాదిరి నర్సీపట్నం రుషివేలీ ప్రైవేటు పాఠశాలకు చెందిన బస్సు ఏటిగైరంపేట, బి.బి.పట్నం, తదితర గ్రామాల నుంచి 25 మంది విద్యార్థులను తీసుకొస్తోంది.
రావణాపల్లి వ ద్ద ఎదురుగా వస్తున్న లారీని తప్పించబోయి అదే గ్రామానికి చెందిన జోగ దేముడును ఢీకొట్టింది. వెంటనే విద్యుత్ స్తంభాన్ని బలంగా ఢీకొని బోల్తా పడింది. ఈసంఘటనలో దేముడుకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు ఎకాయెకిన సంఘటన స్థలానికి చెరుకుని బస్సు అద్దాలు పగులగొట్టి విద్యార్థులను రక్షించారు. వీరిలో 14 మందికి స్వల్ప గాయాలయ్యాయి.
విద్యార్థులు గిరిజా సాయిప్రసాద్( బి.బి.పట్నం), పి. నానాజీ(కొత్తపట్నం)లకు తలకు గాయాలయ్యాయి. దివాకర్( బి.బి.పట్నం)కు కాలికి గాయమైంది. మిగిలిన విద్యార్థులు స్వల్పగాయాలతో బయటపడ్డారు. తీవ్రం గా గాయపడిన దేముడుతోపాటు విద్యార్థులను నర్సీపట్నం ఏరియా ఆసుపత్రికి తరలించారు. విషయం తెలిసి పెద్ద సంఖ్యలో తల్లిదండ్రులు, గొలుగొండ ఎంపీపీ సుర్ల లక్ష్మీనారాయణ ఆసుపత్రికి చేరుకున్నారు.
విద్యార్థుల పరిస్థితిని ఆరా తీశారు. వెనుక నుంచి బస్సు బలంగా ఢీకొట్టడంతో పరిస్థితి విషమంగా ఉన్న దేముడును మెరుగైన వైద్యం కోసం విశాఖపట్నం తరలిస్తుంగా మార్గమధ్యలో మృతిచెందాడు. ప్రమాదం జరిగిన సమయంలో విద్యుత్ సరఫరా ఉంది. స్తంభం విరిగినా, తీగలు తెగిపడి బస్సును తాకినా పెద్ద ప్రమాదం చోటుచేసుకునేది. ఎస్‌ఐ జోగారావు కేసు దర్యాప్తు చేస్తున్నారు.