
3నెలల్లో సీఎం కార్యాలయం పూర్తి
హైదరాబాద్ : వారం రోజుల్లో ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో పూర్తిస్థాయిలో పాలన ప్రారంభిస్తామని ప్రభుత్వ కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు తెలిపారు. ఆయన శుక్రవారమిక్కడ మాట్లాడుతూ మూడు నెలల్లో ముఖ్యమంత్రి కార్యాలయాన్ని పూర్తి చేస్తామన్నారు. ఈనెల 14న ఆలిండియా సర్విసెస్ విభజనపై ప్రత్యూష్ సిన్హా కమిటీ సమావేశం కానున్నట్లు ఐవైఆర్ తెలిపారు.
కాగా చంద్రబాబు తన చాంబర్ కోసం సచివాలయంలోని ఎల్ బ్లాకులో ఎనిమిదో అంతస్తును ఎంచుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడా చాంబర్ ఆధునీకరణకు ప్రభుత్వం రూ. 10 కోట్లు ఖర్చు చేస్తోంది. ఎల్ బ్లాకులోని 8వ అంతస్తులో ముఖ్యమంత్రి, 7వ అంతస్తులో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కార్యాలయాల కోసం ఇప్పటికే ఉన్న భవనంలో పది కోట్ల రూపాయలు వెచ్చించి ఏర్పాట్లు చేస్తున్నారు.
గవర్నర్ ఆదేశాల మేరకు కొత్త సీఎం కోసం హెచ్ బ్లాకులో సీఎం కార్యాలయం కోసం దాదాపు రూ. 3 కోట్లు వెచ్చించి సర్వహంగులూ పూర్తి చేశారు. అయితే చంద్రబాబు సీఎం అయిన తర్వాత ఆయన సన్నిహితులు, జ్యోతిష్యులు దాన్ని పరిశీలించి వాస్తు సరిగా లేదంటూ.. సీఎం కోసం ఎల్ బ్లాకును ఎంపిక చేశారు.
దాంతో హెచ్ బ్లాకులో సీఎం కార్యాలయం కోసం వెచ్చించిన రూ. 3 కోట్లు వృథా అయ్యాయి. అలాగే.. చంద్రబాబు క్యాంపు కార్యాలయం కోసం లేక్‌వ్యూ అతిథి గృహాన్ని కేటాయించగా.. తొలుత అక్కడికి కూడా వెళ్లబోనని ఆయన అధికారులకు సమాచారం పంపించారు. దాంతో అధికారులు ఆయన కోరిన మరో చోట క్యాంపు కార్యాలయం ఏర్పాటు చేయడానికి ప్రయత్నించగా చివరకు లేక్‌వ్యూనే ఎంచుకున్నారు.