ధాన్యం పుష్కలంగా పండుతున్నా.. ఏటా ఏదో ఒక సమయంలో బియ్యం ధర ఆకాశన్నంటుతోంది. ఆ సమయంలో నియంత్రించేందుకు అధికారులు ఆపసోపాలు పడుతున్నారు.
మంత్రాలయం, న్యూస్‌లైన్: ధాన్యం పుష్కలంగా పండుతున్నా.. ఏటా ఏదో ఒక సమయంలో బియ్యం ధర ఆకాశన్నంటుతోంది. ఆ సమయంలో నియంత్రించేందుకు అధికారులు ఆపసోపాలు పడుతున్నారు. వాస్తవానికి ఇక్కడ పండిన ధాన్యం జిల్లా సరిహద్దులు దాటకుండా చర్యలు చేపడితే ధరలు పెరిగే మాటే తలెత్తదు.
మంత్రాలయం కేంద్రంగా మాధవరం బ్రిడ్జి మీదుగా కర్ణాటకకు సోనా వరి బియ్యం యథేచ్ఛగా తరలిపోతోంది. అక్రమ రవాణాను అరికట్టాల్సిన వ్యవసాయ మార్కెట్ కమిటీ అధికారులు చేతులెత్తేశారు. తుంగభద్ర నది నీటి ఆధారంగా నియోజకవర్గంలోని వేలాది ఎకరాల్లో వరి సాగవుతోంది. ఈ ప్రాంతంలో నెల్లూరు సోన, బీపీటీ 5204, 64, 1010, కావేరి తదితర రకాలను రైతులు అధికంగా సాగు చేస్తున్నారు. బీపీటీ రకం తప్ప మిగతా ధాన్యానికి ఇక్కడితో పోలిస్తే కర్ణాటకలో ఎక్కువ ధర లభిస్తోంది. రాంపురంలో కెనాల్ కింద 20వేల ఎకరాలు, కోసిగిలో 18వేల ఎకరాలు.. కౌతాళంలో 10వేల ఎకరాల్లో వరి సాగు చేస్తుండగా.. ఎకరాకు 40 బస్తాల దిగుబడి వస్తోంది. అయితే ఇప్పటి వరకు ఈ మూడు మండలాల నుంచి 42వేల టన్నులు ధాన్యం కర్ణాటకకు తరలినట్లు అంచనా. ఇందులో నెల్లూరు సోన 20వేల టన్నులు, బీపీటీ 5వేలు, 64 రకం 10వేలు, 1010 రకం 5 వేలు, కావేరి 2వేల టన్నులు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయంలో ఎమ్మిగనూరు మార్కెట్ కమిటీ అధికారుల నిర్లక్ష్యం దళారులకు వరంగా మారుతోంది. చెక్‌పోస్టులు ఉన్నా అధికారుల కొరత సాకుతో తాళాలు వేసేశారు. ఫలితంగా దళారులు రైతుల పొలాల వద్దకు వెళ్లి లారీల కొద్ది ధాన్యాన్ని సేకరించి మాధవరం మీదుగా రాయచూరు, ఆదోని మీదుగా శిరుగుప్పకు యథేచ్ఛగా తరలించేస్తున్నారు.
అప్పటికప్పుడు డబ్బు చెల్లిస్తుండటంతో రైతులు దళారుల వైపే మొగ్గు చూపుతున్నారు. ఇక్కడ సాగవుతున్న వరికి స్థానికంగా ధర తక్కువ లభిస్తుండటంతో.. దళారులు వారికి అధిక ధర ఆశ చూపి కొనగోలు చేస్తున్నారు. ఇదిలాఉండగా గత ఏడాది క్వింటా బియ్యం రూ.4వేల నుంచి రూ.6వేల ధర పలికింది. సామాన్య, మధ్య తరగతి ప్రజలు ఈ ధరతో బియ్యం కొనుగోలు చేసేందుకు బెంబేలెత్తారు. అక్రమ రవాణా ఇదే తరహాలో సాగితే ఈ సంవత్సరం కూడా ధరలు ఆకాశాన్నంటే ప్రమాదం లేకపోలేదని తెలుస్తోంది. ఇప్పటికైనా అధికారులు మేల్కొనాల్సిన అవసరం ఎంతైనా ఉంది.