
బిల్లుపై బీజేపీ నిరసనలు
రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లు ఏకపక్షంగా ఉందంటూ బీజేపీ సీమాంధ్ర ఉద్యమ కమిటీ పిలుపు మేరకు శుక్రవారం ఆ ప్రాంతంలో నిరసనలు ప్రదర్శనలు జరిగాయి.
సాక్షి నెట్‌వర్క్: రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లు ఏకపక్షంగా ఉందంటూ బీజేపీ సీమాంధ్ర ఉద్యమ కమిటీ పిలుపు మేరకు శుక్రవారం ఆ ప్రాంతంలో నిరసనలు ప్రదర్శనలు జరిగాయి. ఈ సందర్భంగా ఎటువంటి అరెస్టులు జరగనప్పటికీ పలుచోట్ల పోలీసులకు ఆందోళనకారులకు మధ్య తోపులాటలు జరిగాయి. సీమాంధ్రలోని జిల్లా కేంద్రాలతో పాటు రెవెన్యూ డివిజన్లలోనూ ర్యాలీలు నిర్వహించినట్టు ఉద్యమ కమిటీ చైర్మన్ రఘునాధ్ బాబు తెలిపారు. సీమాంధ్ర సమస్యల్ని పూర్తిగా విస్మరించిన పునర్‌వ్యవస్థీకరణ బిల్లును ఆమోదించవద్దని, పోలవరం బహుళార్ధసాధక ప్రాజెక్టును యథావిధిగా నిర్మించాలని, భద్రాచలం డివిజన్‌ను సీమాంధ్రలో కలపాలని, హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా ఉంచేందుకు అవసరమైన రాజ్యాంగ సవరణ చేయలాని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. తెలంగాణ బిల్లు పూర్తిగా రాజ్యాంగవిరుద్ధంగా ఉందని బీజేపీ జాతీయ నేత కంభంపాటి హరిబాబు ఆవేదన వ్యక్తం చేశారు. బిల్లులో ఉన్న 12 అంశాలూ సీమాంధ్ర ప్రాంతానికి వ్యతిరేకంగా ఉన్నాయన్నారు. సీమాంధ్రులకు జరుగుతున్న అన్యాయంపై బీజేపీ ఆధ్వర్యంలో విశాఖపట్నం లోని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. రాష్ట్రం నుంచి రాజ్యసభకు ఎన్నికై ఆంధ్రప్రాంతానికి అన్యాయం చేస్తున్న కేంద్రమంత్రి జైరాం రమేష్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలంటూ ఆయన దిష్టిబొమ్మను దహనం చేశారు.
రాష్ర్ట విభజనకు సహకరిస్తే రాజీనామా
రాష్ట్ర విభజనకు బీజేపీ ఆమోదం తెలిపితే రాజీనామాలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని పార్టీ పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షుడు భూపతిరాజు శ్రీనివాసవర్మ హెచ్చరించారు. తెలంగాణ ముసాయిదా బిల్లును వ్యతిరేకిస్తూ.. బిల్లు రూపొం దించిన జైరాం రమేష్ దిష్టిబొమ్మను భీమవరం ప్రకాశం చౌక్‌లో శుక్రవారం దహనం చేశారు. బీజేపీ ఏలూరు నగర శాఖ ఆధ్వర్యంలో పాత బస్టాండ్ వద్ద జైరాం రమేష్ దిష్టిబొమ్మను దహనం చేశారు. కర్నూలు కలెక్టరేట్ ఎదుట బీజేపీ ఆధ్వర్యంలో సోనియాగాంధీ దిష్టిబొమ్మను దహనం చేశారు.
బీజేపీ జిల్లా అధ్యక్షుడు జి.ఎస్.నాగరాజు మాట్లాడుతూ తాము విభజనకు మద్దతిస్తున్నా, సీమాంధ్రకు న్యాయం జరగనిదే పార్లమెంట్‌లో మద్దతు ఇవ్వబోమన్నారు. చిత్తూరు జిల్లా, మదనపల్లెలో సోనియా, దిగ్విజయ్‌ల దిష్టిబొమ్మలను దహనం చేయగా, ములకలచెరువు బస్టాండ్ కూడలిలో రాస్తారోకో చేపట్టారు. బీజేపీ విజయనగరం జిల్లా శాఖ అధ్యక్షుడు బవిరెడ్డి శివప్రసాద్‌రెడ్డి ఆధ్వర్యంలో కేంద్రమంత్రి జైరామ్ రమేష్ దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతపురం జిల్లా తాడిపత్రి పోలీస్‌స్టేషన్ సర్కిల్‌లో జైరాం రమేష్ ఫ్లెక్సీని దహనం చేశారు. అనంతపురంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు అంకాల్‌రెడ్డి ఆధ్వర్యంలో నాయకులు ర్యాలీ తీయగా, శ్రీకృష్ణ దేవరాయ విశ్వవిద్యాలయం ఎదుట బీజేవైఎం నేతలు టీ-బిల్లు ప్రతులను చించివేశారు. కడప కలెక్టర్ కార్యాలయం ఎదుట బీజేపీ నాయకులు తెలంగాణ బిల్లు ప్రతులను దహనం చేశారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు శశిభూషణ్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర విభజనకు తమ పార్టీ వ్యతిరేకం కాదని, అయితే వెనుకబడ్డ రాయలసీమకు రాజ్యాంగ పరమైన రక్షణ అవసరమన్నారు. అసెంబ్లీలో టీ బిల్లు ప్రవేశపెట్టినందుకు నిరసనగా బద్వేలులో సోనియా, జైరాంల చిత్రపటాలను దహనం చేశారు.