నల్లదుస్తులతో సీమాంధ్ర ఉద్యోగుల నిరసనలు
హైదరాబాద్ : సచివాలయ సీమాంధ్ర ఉద్యోగులు వినూత్నంగా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ఏర్పాటు ప్రకటన తర్వాత విధులు బహిష్కరించిన ఉద్యోగులు రోజుకో రీతిన తమ నిరసనలు తెలుపుతున్నారు. మంగళవారం భోజన విరామ సమయంలో నల్ల దుస్తులు ధరించి ర్యాలీ నిర్వహించారు. సీ, డీ బ్లాక్ల ముందు ఆందోళనకు దిగారు. విభజన ప్రక్రియ తక్షణమే ఉపసంహరించాలని డిమాండ్ చేశారు.
రాజీనామాల ప్రకటనలు మాని సీమాంధ్ర ప్రాంత మంత్రులు తక్షణమే పదవులకు రాజీనామా చేయాలని సీమాంధ్ర ఉద్యోగులు డిమాండ్ చేశారు. జీతభత్యాలు కోల్పోతూ, ఎస్మా చట్టాలను సైతం ఎదురించి ఉద్యోగులు ఉద్యమంలోకి దిగితే ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. పదవులను పట్టుకుని వేళ్లాడకుండా వెంటనే రాజీనామాలు చేయాలని కేంద్ర, రాష్ట్ర మంత్రులను డిమాండ్ చేశారు. సీమాంధ్ర ఉద్యోగుల ఆందోళనలకు మండలి బుద్ధ ప్రసాద్ సంఘీభావం తెలిపారు.