హైకోర్టులో దాడులను ఖండించిన సీమాంధ్ర న్యాయవాదుల జేఏసీ
సాక్షి, హైదరాబాద్: శాంతియుతంగా ర్యాలీ చేస్తున్న తమపై తెలంగాణ న్యాయవాదులు భౌతిక దాడులకు దిగారని, మహిళా న్యాయవాదులని కూడా చూడకుండా దుర్భాషలాడారని సీమాంధ్ర న్యాయవాదుల జేఏసీ చైర్మన్ మోహన్‌రెడ్డి ఆరోపించారు. పోలీసులు కూడా తెలంగాణ న్యాయవాదులతో కుమ్మక్కై తమపై దాడికి సహకరించారని ఆరోపించారు. సీమాంధ్ర న్యాయవాదులు నలుగురికి రక్త గాయాలయ్యాయని, ఒకరికి ముఖం పూర్తిగా దెబ్బతిన్నదని తెలిపారు. ‘‘రాజ్యాంగాన్ని రక్షించాల్సిన న్యాయవాదులే భౌతిక దాడులకు దిగారు. ప్రజాస్వామ్యంలోని కనీస హక్కులకు కూడా భంగం కలిగించేలా వ్యవహరించారు.
ఇది ఎంతవరకు సమంజసమో వారే ఒక్కసారి ఆలోచించుకోవాలి’’ అని ఆయన తెలంగాణ న్యాయవాదులకు హితవు పలికారు. హైకోర్టు వద్ద శుక్రవారం సీమాంధ్ర, తెలంగాణ న్యాయవాదుల పోటాపోటీ నిరసనలు ఘర్షణకు దారితీశాయి. ప్రివెంటివ్ కస్టడీ కింద దాదాపు 60 మంది సీమాంధ్ర న్యాయవాదులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కోర్టు ఉత్తర్వుల ద్వారా విడుదలైన సీమాంధ్ర న్యాయవాదులు శుక్రవారం సాయంత్రం గన్‌ఫౌండ్రీలోని ఏపీఎన్జీవోస్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. మానవహారం నిర్వహించేందుకు పోలీసుల అనుమతి తీసుకుని శాంతియుతంగా నిరసన తెలుపుతున్న తమపై తెలంగాణ న్యాయవాదులు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు మోహన్‌రెడ్డి చెప్పారు. పోలీసులు కూడా దాడికి సహకరించారని అన్నారు. శనివారం నాటి ఏపీఎన్జీవోల సభలో సీమాంధ్ర న్యాయవాదులందరూ పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.
న్యాయవాదులే దాడులు చేయడం సమంజసమేనా?
Published Sat, Sep 7 2013 4:26 AM | Last Updated on Fri, Sep 1 2017 10:30 PM
Advertisement
Advertisement