సోనియాపై ఆగ్రహజ్వాలలు
సాక్షి నెట్‌వర్క్: రాష్ట్రాన్ని ముక్కలు చేయాలని తలపెట్టిన ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ జన్మదినాన్ని సోమవారం సీమాంధ్ర జిల్లాల్లో బ్లాక్‌డేగా పాటించారు. ఆమె రాజకీయ జీవితానికి డెత్‌డేగా పేర్కొంటూ శవయాత్రలు చేపట్టారు. ఎక్కడికక్కడ దిష్టిబొమ్మల దహనాలు చేశారు. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే గురునాథరెడ్డి ఆధ్వర్యం లో అనంతపురంలో సోనియా దిష్టిబొమ్మను దహనం చేశారు. పెనుకొండలో జేఏసీ నేతలు పేడతో తయారు చేసిన కేక్‌ను దిష్టిబొమ్మకు తినిపించిన అనంతరం దహనం చేశారు. చిలమత్తూరులో శ్మశానవాటికలో ఆమె జన్మదినాన్ని నిర్వహించారు. చిత్తూరుజిల్లా మదనపల్లె, పుంగనూరులోనూ దిష్టిబొమ్మలకు శవయాత్ర నిర్వహించారు.
శ్రీకాళహస్తిలో కాంగ్రెస్ కార్యకర్తలు సైతం సోనియా జన్మదినాన్ని పురస్కరించుకొని బ్లాక్‌డే పాటించారు. కర్నూలు జిల్లా డోన్‌లో విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో ఆమె దిష్టిబొమ్మను పట్టణ పురవీధుల్లో చీపుర్లతో కొడుతూ ఊరేగించారు. తూర్పుగోదావరి జిల్లాలో సమైక్యవాదులు తెలుగుజాతికి విద్రోహదినంగా పాటించారు. విశాఖ, విజయనగరం జిల్లా బొబ్బిలి, బొండపల్లి, తెర్లాం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లోనూ సోనియా దిష్టిబొమ్మలను తగులబెట్టారు. విజయవాడలో సోనియా చిత్రపటం వద్ద దీపం ఉంచి చీపురులు, చెప్పులతో కొట్టి నిరసన వ్యక్తంచేశారు. నెల్లూరులో వీఆర్‌సీ కూడలిలో టీఎన్‌ఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో ఆమె దిష్టిబొమ్మకు అంత్యక్రియలు నిర్వహించారు. ఆమె ఫొటో ఉన్న ప్లెక్సీకి హీలియం బెలూన్లు కట్టి గాల్లోకి వదిలారు. వెంకటగిరిలో సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో ఆమె దిష్టిబొమ్మకు ఉరి బిగించారు.
అశోక్‌బాబు అరెస్ట్
హైదరాబాద్:ఏపీఎన్జీల ఆధ్వర్యంలో ఉద్యమకారులు సోమవారం సచివాలయం వద్ద సోనియా, రాహుల్‌గాంధీల దిష్టిబొమ్మలను దహనం చేశారు. అనంతరం సమైక్యాంధ్ర నినాదాలు చేస్తూ నిరసన తెలుపుతున్న ఏపీఎన్జీవోల సంఘం అధ్యక్షుడు అశోక్ బాబు, చలసాని శ్రీనివాస్, మాల మహానాడు నేత కారెం శివాజీ తో పాటు 32మందిని సైఫాబాద్ పోలీసులు అరెస్ట్‌చేశారు.
వేడుకల్లో గలాట
విశాఖ, అనంతపురం కాంగ్రెస్ ఆఫీసుల్లో గందరగోళం
సాక్షి నెట్‌వర్క్: విశాఖపట్నం, అనంతపురంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల్లో సోమవారం జరిగిన సోనియాగాంధీ జన్మదిన వేడుకల్లో గందరగోళం చోటుచేసుకుంది. అనంతపురంలో పార్టీ నగర శాఖ ఆధ్వర్యంలో జన్మదిన వేడుక నిర్వహిస్తుండగా.. ఆ పార్టీ కార్యకర్త గోపాల్ ఆగ్రహంతో ఊగిపోయారు. ఓట్లు.. సీట్ల కోసం రాష్ట్రాన్ని రెండు ముక్కలుగా చేసి తెలుగు ప్రజల గుండెలు కోసిన సోనియాకు బర్త్‌డే కాదు.. చేతనైతే డెత్‌డే జరపండి అంటూ గట్టిగా అరిచారు. అనంతరం తలపై కర్చీఫ్ వేసుకుని నిరసన తెలిపారు. ఈ ఘటనపై కాంగ్రెస్ నగరశాఖ అధ్యక్షుడు ఆగ్రహం వ్యక్తం చేయడంతో కొద్దిసేపు గందరగోళం నెలకొన్నా, ఆ తర్వాత పరిస్థితి సద్దుమణిగింది. ఇక విశాఖలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సోనియా జన్మదిన వేడుకలకు హాజరైన మంత్రి బాలరాజు, ప్రభుత్వ విప్ ద్రోణంరాజు శ్రీనివాస్, ఎమ్మెల్యే మళ్ల విజయప్రసాద్ సమక్షంలోనే పార్టీ కార్యకర్త రాము తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. విభజనకు పూనుకున్న ఆమె జన్మదిన వేడుకలను ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్వహించొద్దంటూ మంత్రికి సూచించాడు. ఇష్టం లేకపోతే వెళ్లిపోవాలని నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు భాస్కరరావు చెప్పడంతో సోనియా డౌన్‌డౌన్ అంటూ నినదించాడు. పార్టీ నేతలు బలవంతంగా అతడిని బయటకు పంపించేశారు.