సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రాన్ని ముక్కలు చేస్తున్నారు... మరి సాగునీటి ప్రాజెక్టులను ఎలా ముక్కలు చేస్తారు..? నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టులు రెండు ప్రాంతాలకు సంబంధించి ఉన్నాయి.. వాటి నుంచి నీటి పంపకం ఎలా చేస్తారంటూ సమైక్య గర్జనసభ ప్రశ్నించింది. తెలుగు ప్రజల రెక్కల కష్టమైన హైదరాబాద్‌ను వదులుకోవడానికి సిద్ధంగా లేమని, సీమాంధ్ర మొత్తం తిరగబడే పరిస్థితి తెచ్చుకోవద్దని హెచ్చరించింది. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ శనివారం విశాఖలో రాజకీయేతర జేఏసీ నిర్వహించిన ‘సమైక్య గర్జన’ సభకు ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి భారీ ఎత్తున సమైక్యవాదులు తరలివచ్చారు.
సభలో ఎన్టీవోల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చంద్రశేఖరరెడ్డి మాట్లాడుతూ పెద్ద పెద్ద ఇంజినీరింగ్ కాలేజీలు, ఆస్పత్రులు, పరిశోధనా కేంద్రాలు, కేంద్రీయ విశ్వవిద్యాలయాలన్నీ రాజధానిలోనే ఉన్నాయని ఇప్పుడు హైదరాబాద్ మీది కాదు పొమ్మంటే కృత్రిమ గుండెతో ఎలా బతకాలని ప్రశ్నించారు. రాష్ట్ర రెవెన్యూ సర్వీసెస్ అసోషియేషన్ అధ్యక్షుడు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ విద్యార్థుల్లో విషాన్ని నింపి తెలంగాణ నేతలు ఉద్యమం నడిపించారని, కానీ, సీమాంధ్రలో ఉద్యమానికి నీతి నిజాయితీలే పెట్టుబడులన్నారు. రాష్ట్ర డిప్యూటీ కలెక్టర్ల అసోసియేషన్ అధ్యక్షుడు ఎం.వెంకటేశ్వరరావు తదితరులు మాట్లాడారు.