కనకదుర్గమ్మ హుండీ సొత్తును లెక్కించేందుకు వచ్చిన కాంట్రాక్టు సిబ్బందిలో ఒకరు మంగళసూత్రాలు, గొలుసు దొంగిలించేందుకు యత్నిస్తూ భద్రతా సిబ్బందికి పట్టుబడ్డాడు.
టీకప్పులో బంగారు చైను, మంగళసూత్రాలు
తరలిస్తూ పట్టుబడిన కాంట్రాక్టు ఉద్యోగి
లక్ష రూపాయల విలువైన హుండీ సొత్తు స్వాధీనం
ఇంద్రకీలాద్రి : కనకదుర్గమ్మ హుండీ సొత్తును లెక్కించేందుకు వచ్చిన కాంట్రాక్టు సిబ్బందిలో ఒకరు మంగళసూత్రాలు, గొలుసు దొంగిలించేందుకు యత్నిస్తూ భద్రతా సిబ్బందికి పట్టుబడ్డాడు. గురువారం జరిగిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి.
దుర్గామల్లేశ్వర స్వామివార్లకు భక్తులు సమర్పించిన కానుకలు, మొక్కుబడుల లెక్కింపు కార్యక్రమాన్ని గురువారం భవానీదీక్షా మండపంలో నిర్వహించారు. ఇందులో ఆలయ సిబ్బందితోపాటు కేశఖండనశాలలో పనిచేసే కాంట్రాక్టు సిబ్బంది పాల్గొన్నారు. ఉదయం సుమారు 10.10 గంటలకు ఒక్కొక్కరూ బయటకు వచ్చి టీ తాగుతున్నారు. దుర్గాఘాట్‌లోని కేశఖండనశాలలో కాంట్రాక్టు పద్ధతిపై పనిచేసే ఎం.రామసుబ్బారావు కూడా వారిలో ఉన్నాడు. రామసుబ్బారావు టీ తాగుతూ మధ్యలో లోనికి వెళ్లి, కానుకలు లెక్కించేందుకు కూర్చున్నాడు. కొద్దిసేపటి తరువాత కాలకృత్యాలు తీర్చుకునేందుకు టీకప్పుతో సహా కిందకు దిగేందుకు యత్నించాడు. రిజిస్టర్‌లో సంతకం చేసి వెళ్లాలని అక్కడ ఉన్న ఎస్‌పీఎఫ్ సిబ్బంది సూచించారు. దీంతో టీకప్పును మెట్ల పక్కనే ఉన్న గోడ వద్ద పెట్టి రిజిస్టర్‌లో సంతకం చేశాడు. తరువాత ఎస్‌పీఎఫ్ సిబ్బంది తనిఖీ చేసి పంపారు.
అతడు నేరుగా కిందకు వెళ్లకుండా మెట్ల పక్కన ఉంచిన టీకప్పును తీసుకువెళ్లేందుకు యత్నించాడు. మెట్ల వద్ద విధుల్లో ఉన్న ఎస్‌పీఎఫ్ కానిస్టేబుల్ టి.శివప్రసాద్‌కు అతడి తీరుపై అనుమానం వచ్చింది. మరోమారు తనిఖీ చేసేందుకు రామసుబ్బారావును వెనక్కి పిలిచాడు. దీంతో అతడు టీకప్పును మెట్ల మధ్యలో పెట్టి పైకి వచ్చా డు. తనిఖీ చేసిన తరువాత కిందకు దిగేందుకు రామసుబ్బారావు కంగారు పడుతున్నాడు. టీకప్పు పైకి తీసుకురావాలని ఎస్‌పీఎఫ్ సిబ్బంది పిలవగా, అతడు లెక్కచేయకుండా వేగంగా కిందకు దిగేందుకు యత్నించాడు. శివప్రసాద్ వెంటపడి టీకప్పుతో సహా అతడిని పైకి తీసుకువచ్చాడు. కప్పును తనిఖీ చేయగా, మంగళసూత్రాలు, బంగారు గొలుసు కనిపించాయి. దీంతో భద్రతా సిబ్బంది ఆలయ కార్యనిర్వహణాధికారికి సమాచారం అందించారు. ఆయన వచ్చి సీసీ టీవీల పుటేజీని పరిశీలించారు. అనంతరం రామసుబ్బారావును విచారణ చేశారు. అతడు చోరీ చేసేందుకు యత్నించిన 40 గ్రాముల బంగారు గొలుసు విలువ సుమారు లక్ష రూపాయలు ఉంటుందని నిర్ధారించుకున్నారు. అనంతరం రామసుబ్బారావును పోలీస్ అవుట్‌పోస్టులో అప్పగించగా, అక్కడి సిబ్బంది వన్‌టౌన్ స్టేషన్‌కు తరలించారు. ఆలయ అధికారుల ఫిర్యాదు మేరకు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు నిర్వహిస్తున్నట్లు స్టేషన్ సిబ్బంది తెలిపారు.