గాంధీ ఆస్పత్రి: కోవిడ్ నోడల్ కేంద్రమైన సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో వైద్యులు ప్రాణాలకు తెగించి కరోనా వైరస్‌తో పోరాడుతుంటే, కొంతమంది కాంట్రాక్టు సిబ్బంది మద్యం మత్తులో మునిగితేలుతున్నారు. ఆస్పత్రి సెల్లార్‌లోని ఓ గదిలో అర్ధరాత్రి వరకు పూటుగా తాగి తందనాలాడారు. వేకువజామున ఇంటికి వెళ్లిన వీరిలో ఓ కాంట్రాక్టు ఉద్యోగి మృతి చెందడం కలకలం రేపింది. కరోనా బాధితులకు వైద్య సేవలందిస్తున్న గాంధీ ఆస్పత్రిలో సోదరులైన శ్రీనివాస్, నరేష్, నగేష్ కాంట్రాక్టు పద్ధతిలో వివిధ విభాగాల్లో పనిచేస్తున్నారు. ఆదివారం రాత్రి ఆస్పత్రి సెల్లార్‌లోని సీఎస్‌డీ విభాగానికి చెందిన గదిలో వీరు ముగ్గురితో పాటు మరో ఇద్దరు కలిసి మద్యం, మాంసంతో విందు చేసుకున్నారు. అనంతరం అవుట్‌సోర్సింగ్ ఉద్యోగితో మరో ఫుల్‌బాటిల్ తెప్పించుకుని అర్ధరాత్రి వరకు తాగి, వేకువజామున ఇళ్లకు వెళ్లారు. ఇంటికి వెళ్లాక ముగ్గురు సోదరుల్లో ఒకడైన శ్రీనివాస్ (38) హఠాత్తుగా కుప్పకూలి మృతి చెందాడు. గుండెపోటుతో మృతి చెందినట్టు కుటుంబసభ్యులు భావించారు. మృతుడు శ్రీనివాస్ ఆస్పత్రి స్టెరిలైజేషన్ విభాగంలో పనిచేస్తున్నాడు. ఆదివారం ఉదయం శ్రీనివాస్ మృతితోపాటు ఆస్పత్రి ప్రాంగణంలో మందు పార్టీ చేసుకున్నట్టు ఆస్పత్రి అధికారులకు తెలిసింది. దీనిపై విచారణకు ఆదేశించారు. కాగా, శ్రీనివాస్ మృతిపై ఫిర్యాదు అందలేదని ఆస్పత్రి అధికారులు చెప్పారు.
మూడంచెల భద్రత ఏమైంది?
గాంధీ ఆస్పత్రిలో 300 మంది పోలీసులతో మూడంచెల భద్రత వ్యవస్థ ఉంది. వీరుకాక, మరో వంద మంది సెక్యూరిటీ గార్డులు ఉన్నారు. వీరి కళ్లుగప్పి ఆస్పత్రి ప్రాంగణంలోకి మద్యం బ్యాటిళ్లు రావడం గమనార్హం. ఆస్పత్రి సెల్లార్‌లో మద్యం విందు జరిగినట్టు దృష్టికి వచ్చిందని డిప్యూటీ సూపరింటెండెంట్ నర్సింహారావునేత, ఆర్‌ఎంఓ జయకృష్ణ తెలిపారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపడతామన్నారు.
విచారణ జరుపుతాం
ఆదివారం రాత్రి ఆస్పత్రి సెల్లార్‌లో కొంతమంది కాంట్రాక్టు సిబ్బంది మద్యం విందు చేసుకున్న విషయమై నిజనిర్ధారణ కమిటీ ఏర్పాటుచేసి విచారణ చేపడతాం. వైద్యులు, సిబ్బంది ప్రాణాలకు తెగించి కరోనా వైరస్‌తో పోరాడుతుంటే కొంతమంది కాంట్రాక్టు సిబ్బంది ఇలాంటి పనులతో చెడ్డపేరు తెస్తున్నారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. సెల్లార్‌లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయిస్తాం. సెల్లార్‌లో ఉన్న తుక్కును తరలించి, డ్రైనేజీ వ్యవస్థను చక్కదిద్ది, అక్కడ కొన్ని వైద్య విభాగాలను ఏర్పాటు చేసే యోచన ఉంది. – ప్రొఫెసర్ రాజారావు, గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్
Comments
Please login to add a commentAdd a comment