పదేళ్లుగా అధికారం కోసం ఆవురావురమని ఎదురుచూసి రైతన్న పుణ్యమో.. నమో మంత్రమో గానీ ఎట్టకేలకు పవర్‌లోకి వచ్చిన తెలుగు తమ్ముళ్లు ఇప్పుడు అడ్డంగా సంపాదించడం కోసం అక్రమ మార్గాల వెతుకులాటలో ఉన్నారు. ‘నేనొచ్చానంటే చాలు. చక్రం తిప్పేస్తా. కేంద్రం మెడలు వంచేస్తా’ అంటూ బీరాలు పలికిన చంద్రబాబు తీరా అధికారంలోకి రాగానే ‘నేను కూర్చోడానికే కుర్చీ లేదు.. పైసల్లేవ్.. ఖజానా ఖాళీ’ అంటూ రాజధాని నిర్మాణం పేరిట విరాళాలు సేకరించే పనిలో నిమగ్నమైపోయారు. దీంతో సర్కారీ పనులు, కాంట్రాక్టుల కోసం ఎదురుచూసిన తమ్ముళ్లు ఇప్పట్లో అవి దక్కేలా లేవని భావించి అక్రమ ఆదాయం కోసం సెటిల్‌మెంట్లు, భూదందాలపై పడుతున్నారు.
ఎక్కడో.. ఏమో గానీ.. మన జిల్లా కేంద్రం ఏలూరులో మాత్రం కొందరు పచ్చచొక్కా నేతలు ప్రస్తుతం ఇవే పనులపై దృష్టి కేంద్రీకరించారు. ఎక్కడ ఖాళీ స్థలం కనిపిస్తే అక్కడ కబ్జా చేయడమనేది ఇప్పటివరకు మనం చూస్తున్న పాత పద్ధతి. ఇళ్లు కట్టుకుని నివాసముంటున్న వాళ్లను కూడా ఖాళీ చేయించి ఆయా స్థలాల్లో పాగా వేయడమే ప్రస్తుత తెలుగు తమ్ముళ్లనయా ‘రియల్’ కల్చర్. పొరుగునే ఉన్న బెజవాడే రాజధాని అని తేలడంతో ఏలూరు శివారు కాలనీలపై బడాబాబుల కన్నుపడింది. బీ.ఫారాలతో ఇళ్ల పట్టాలు పొందిన వారిని నయానో భయానో బెదిరించి ఆ ప్లాట్లను సొంతం చేసుకునేందుకు పావులు కదుపుతున్నారు. మంచిగా పట్టాలు అప్పగిస్తే బదులుగా ఎక్కడో మరో మూలన స్థలం కేటాయిస్తామంటూ బేరసారాలు చేస్తున్నారు.
ఇందుకు అధికారుల సాయం కూడా తీసుకుంటున్నారు. ఏలూరులో బీ.ఫారం పట్టాలతో ఇళ్లు ఉన్న కాలనీలు ఎక్కడెక్కడున్నాయి.. ఖాళీ చేయించి వారిని ఎక్కడికి తరలించొచ్చు అంటూ అధికారులతో సమగ్ర సర్వే చేయిస్తున్నారట. మొత్తంగా ఏలూరు శివారులోని బీ.ఫారం పట్టాలు ఉన్న ఇళ్లన్నీ తొలగించి రియల్ ఎస్టేట్ వెంచర్లు వేయాలన్నదే తెలుగు తమ్ముళ్ల లక్ష్యమట. ఇలానే వదిలేస్తే.. శివారు ప్రాంతాలే కాదు ఏలూరు నగరంలో మురుగునీరు, ముళ్లకంపలన్న ఖాళీ స్థలాలు కూడా సర్వాంగసుందరమైన వెంచర్లుగా మారిపోయినా ఆశ్చర్యం లేదు. అయితే ఇవన్నీ హేలాపురి ప్రజ సిత్రాలుగా చూస్తుందా.. పోరుబాటతో తెలుగుతమ్ముళ్లకు ‘సినిమా’ చూపిస్తుందా అన్నది కాలమే నిర్ణయించాలి.
పైడికొండల.. ఇలాగైతే ఎలా?
హయవేగంలోనూ హలో హలో అంటూ అన్ని వ్యవహారాలూ ఫోన్లలోనే చక్కబెడు తున్న ఈ రోజుల్లో మన మంత్రులు, ప్రజాప్రతినిధులు మాత్రం ఆ వేగాన్ని ఒంటపట్టించుకున్నట్టు కనిపించడం లేదు. సచివులు, చాలామంది ప్రజాప్రతినిధులు ఫోన్లలో అందుబాటులోకి రావడం లేదు. ఫోన్‌చేస్తే నేరుగా మంత్రులు మాట్లాడకపోయినా వాళ్ల సీసీలు, పీఏలు స్పందించి, ఆ తర్వాత విషయాన్ని బట్టి సచివులు లైన్లోకి వస్తుం టారు. కనీసం సీసీలు, పీఏలు కూడా ఎత్తి సరైన సమాధానం, సమాచారం చెప్పని స్థితి ప్రస్తుతం నెలకొంది. ఈ విషయాన్ని స్వయంగా ఓ ఎమ్మెల్యేనే రెండురోజుల కిందట సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లడంతో ఆయన మంత్రులకు చిన్నపాటి క్లాస్ తీసుకున్నారట.
ఇక మన మంత్రుల విషయానికి వస్తే దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు ఫోన్లకు దొరకరనే విమర్శలున్నాయి. ఇటీవల దేవాదాయ శాఖలో అవినీతిపై నేరుగా మంత్రికి ఫోన్‌చేసి సమాచారం చెబుదామనుకున్న నగరానికి చెందిన ఓ ఔత్సాహికుడు ఎలాగోలా ఫోన్ నంబర్ పట్టుకుని రింగ్ చేశారు. రోజంతా ఎన్నిసార్లు చేసినా ఫోన్ తీయలేదట. కనీసం ఎవరు చేశారో.. అని తిరిగి ఫోన్ రాకపోవడంతో చేసేదిలేక సదరు యువకుడు మిన్నకుండిపోయాడట. రెండోరోజైనా ఎవరు ఎందుకు అన్నిసార్లు ఫోన్ చేశారో తెలుసుకుందామన్న కనీస స్పృహ కూడా సదరు మంత్రి సీసీలు, పీఏలకు పట్టలేదట. మంత్రి పదవి పొందిన తొలినాళ్లలో తాడేపల్లిగూడెంలో ఓ మహిళ కరెంటు సమస్యపై పొద్దుపోయాక ఫోన్ చేసినా స్పందించి ధర్నా చేసిన మాణిక్యం పలుకు ఇప్పుడు ఫోన్లలో బంగారమైపోయిందా!?
- జి.ఉమాకాంత్, సాక్షి ప్రతినిధి, ఏలూరు
తమ్ముళ్ల వెతుకులాట
Published Sun, Aug 24 2014 1:00 AM | Last Updated on Fri, Aug 10 2018 9:40 PM
Advertisement
Advertisement