సెటిల్‌మెంట్లలో ఆరితేరిన టీడీపీ నేతలు
రౌడీ ముదిరి రాజకీయ నాయకుడైతే ఏమవుతుందో జిల్లా ప్రజలు ప్రత్యక్షంగా చూస్తున్నారు. ఆదినుంచీ అలవాటైన సెటిల్‌మెంట్లను అధికారమనే అండతో యథేచ్ఛగా సాగిస్తున్న టీడీపీ నేతల తీరుతో జనం బేజారెత్తిపోతున్నారు. ఏలూరు నగరం నడిబొడ్డున, డీఐజీ కార్యాలయానికి కూతవేటు దూరంలో ఓ యువకుడిని పది రోజులపాటు నిర్బంధించి చిత్రహింసలకు గురిచేస్తుంటే పోలీసులే తెలుసుకోలేకపోయారు. మరోవైపు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలపై టీడీపీ దాష్టీకాలు పెచ్చుమీరుతున్నాయి. రాష్ట్ర మంత్రి పీతల సుజాత ప్రాతినిధ్యం వహిస్తున్న చింతలపూడి నియోజకవర్గ పరిధిలోని లింగపాలెం మండలంలో ఈ తరహా ఘటనలు చోటుచేసుకుంటున్నాయి.
సాక్షి, ఏలూరు/ఏలూరు (ఫైర్‌స్టేషన్ సెంటర్) : ఒక యువకుడిని కిడ్నాప్ చేసి.. ఇంట్లో నిర్బంధించి చిత్రహింసలకు గురి చేసిన ఘటన ఏలూరు నగరంలో సంచలనం సృష్టించింది. ఆ యువకుడి బంధువులకు ఎమ్మెల్యే అనుచరుడు ఫోన్‌చేసి డబ్బు డిమాండ్ చేయడంతో వారు జిల్లా ఎస్పీ కె.రఘురామ్‌రెడ్డిని ఆశ్రయించారు. దీంతో ఏలూరు టూటౌన్ పోలీసులు రంగంలోకి దిగి యువకుడిని కిడ్నాప్ చెరనుండి విడిపించారు. ఇందుకు కారకులైన నగర డెప్యూటీ మేయర్ చోడే వెంకటరత్నంతోపాటు మరో ఏడుగురిని అదుపులోకి తీసుకోవడంతో టీడీపీ దాష్టీకాలు వెలుగులోకి వచ్చారుు.
అసలేం జరిగిందంటే..
ఖమ్మం జిల్లా బూర్గంపాడు మండలం రెడ్డిపాలెం గ్రామానికి చెందిన శింగంరెడ్డి రామకోటిరెడ్డి హైదరాబాద్‌లోని ఒక ప్రైవేటు కంపెనీలో చిన్న ఉద్యోగం చేస్తున్నాడు. బీహెచ్‌ఈఎల్, ప్రభుత్వ శాఖలలో ప్రముఖులతో తనకు పరిచయాలు ఉన్నాయని, ఉద్యోగాలు ఇప్పిస్తానని
నమ్మబలికిన రామకోటిరెడ్డి నిరుద్యోగుల నుంచి భారీగా డబ్బు వసూలు చేశాడు. సత్తుపల్లికి చెందిన బి.రవిప్రసాద్ అనే వ్యక్తి ద్వారా ఏలూరుకు చెందిన ఐదుగురు నిరుద్యోగుల నుంచి రామకోటిరెడ్డి సుమారు రూ.40 లక్షలు వసూలు చేశాడు. ఇది జరిగి నెల రోజులైనా ఉద్యోగాలు రాకపోవడంతో డబ్బులిచ్చిన వారు రామకోటిరెడ్డికి ఫోన్ చేశారు. ఉద్యోగాలు రావాలంటే మరికొంత డబ్బు ఇవ్వాలని రామకోటిరెడ్డి డిమాండ్ చేశారు. దీంతో అతడికి డబ్బులిచ్చిన నిరుద్యోగులు ఏలూరు ఎమ్మెల్యే బడేటి బుజ్జిని ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే అనుచరులైన నగర డెప్యూటీ మేయర్ చోడే వెంకటరత్నంనాయుడు, రౌడీషీటర్ నిమ్మల శ్రీనివాస్ మరో ఆరుగురితో కలిసి సింగంరెడ్డి రామకోటిరెడ్డిని అక్రమంగా నిర్బం ధించారు. అతని శరీరంపై బ్లేడుతో కోసి, కర్రలతో కొట్టి, చిత్రహింసలకు పాల్పడ్డారు.
బయటపడిందిలా
ఎమ్మెల్యే అనుచరుడైన నిమ్మల శ్రీనివాస్ సోమవారం సాయంత్రం రామకోటిరెడ్డి బంధువులకు ఫోన్‌చేసి మంగళవారం ఉదయం 10 గంటలకు డబ్బు ఇవ్వకపోతే తమ నిర్బంధంలో ఉన్న రామకోటిరెడ్డిని చంపేస్తామని బెదిరిం చాడు. కంగారుపడిన అతని బంధువులు తెలంగాణ కాంగ్రెస్ నాయకుడు రోసిరెడ్డిని తీసుకుని మంగళవారం ఉదయం ఏలూరు చేరుకున్నారు. ఎస్పీ కె.రఘురామ్ రెడ్డిని కలిసి జరిగిన ఘటనను వివరించి తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు. స్పందించిన ఎస్పీ విషయం ఏమిటో చూడాలంటూ టూటౌన్ పోలీసులకు ఆదేశాలిచ్చారు. రంగంలోకి దిగిన పోలీసులు పవర్‌పేటలోని చర్చి సమీపంలో ఎమ్మెల్యే అనుచరుడికి చెందిన రెండంతస్తుల గృహంలో నిర్బంధంలో ఉన్న రామకోటిరెడ్డిని, అతనికి కాపలాగా ఉన్న అజయ్, ప్రభు, బాబి అనేవారిని అదుపులోకి తీసుకున్నారు.
అనంతరం ఎమ్మెల్యే నివాసంలో ఉన్న నగర డెప్యూటీ మేయర్ చోడే వెంకటరత్నంనాయుడు, రౌడీ షీటర్ నిమ్మల శ్రీనుతోపాటు మరికొందరిని అదుపులోకి తీసుకున్నారు. అందరినీ ఏలూరు టూటౌన్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. రామకోటిరెడ్డి సోదరులు వెంకటేశ్వరరెడ్డి, సంజీవ్‌రెడ్డి, కాంగ్రెస్ నాయకులు రోసిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు డెప్యూటీ మేయర్ చోడే వెంకటరత్నం, రౌడీ షీటర్ నిమ్మల శ్రీనివాస్, తదితరులపై సెక్షన్ 365, 394, 506, 144, రెడ్‌విత్ 34 కింద కేసును నమోదు చేసినట్టు టూటౌన్ సీఐ వై.సత్యకిషోర్ తెలిపారు. డెప్యూటీ మేయర్ వెంకటరత్నంను ప్రధాన నిందితుడిగా పేర్కొన్నారు. రామకోటిరెడ్డిని వైద్య పరీక్షల నిమిత్తం ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
తెరవెనుక ప్రయత్నాలు
ఓ వ్యక్తిని ఎమ్మెల్యే అనుచరులు నిర్బంధించి చిత్రహింసలకు గురిచేసిన ఉదంతం టూటౌన్ పోలీస్‌స్టేషన్ ఎదుట తీవ్ర కలకలం రేపుతుంటే.. ఎమ్మెల్యే బడేటి బుజ్జి కొత్త డీఐజీ హరికుమార్‌ను పోలీస్ స్టేషన్ పక్కనే ఉన్న డీఐజీ కార్యాలయంలో కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. కొత్తగా వచ్చిన డీఐజీని మర్యాదపూర్వకంగా కలిసేందుకు వెళ్లానని ఎమ్మెల్యే పైకి చెబుతున్నా, తనపేరు బయటకు రాకుండా జాగ్రత్తపడేందుకే వెళ్లారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కారణంగానే పోలీసులు తమపై రకరకాల వత్తిళ్లు ఉంటాయని మీడియా వద్ద వ్యాఖ్యానించి ఉంటారని భావిస్తున్నారు. ఎన్నికల ముందు బుజ్జిపై పలు కేసులు నమోదయ్యాయి. సెటిల్‌మెంట్లు, దందాలు వంటి అసాంఘిక కార్యకలాపాల్లో అతనికి భాగస్వామ్యం ఉందనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నైజంతోనే తాజా సెటిల్‌మెంట్‌ను ప్రోత్సహించి ఉంటారని, ఆయనకు తెలియకుండా ఆయన కార్యాలయంలో వ్యవహారం నడవదని బాధితులు చెబుతున్నారు.
వాళ్లిద్దరూ ఎమ్మెల్యేకి ప్రధాన అనుచరులు
ఏలూరు నగరపాలక సంస్థ డెప్యూటీ మేయర్ చోడే వెంకటరత్నం నాయుడు 1999-2004 మధ్య అప్పటి మునిసిపాలిటీలో 34వ వార్డు కౌన్సిలర్‌గా పనిచేశారు. 2014 ఎన్నికల్లో 17వ డివిజన్ నుంచి టీడీపీ తరఫున కార్పొరేటర్‌గా గెలుపొందిన ఆయన డెప్యూటీ మేయర్ అయ్యారు. ఆయన ఎమ్మెల్యే బడేటి బుజ్జికి ప్రధాన అనుచరుడిగా ఉంటూ సెటిల్‌మెంట్లు చేస్తుంటారనే ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యం గా జూదాలను ప్రోత్సహిస్తూ, స్వయంగా ఆడతారని చెబుతున్నారు. ఎమ్మెలేకు మరో అనుచరుడైన నిమ్మల శ్రీనివాస్‌పై నగరంలోని పలు పోలీస్ స్టేషన్లలో వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదై ఉన్నాయి. ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్‌లో రౌడీషీట్ ఉంది. క్రిమినల్ కేసుల్లో ప్రధాన నిందితుడిగా కూడా ఉన్నారు. ఎమ్మెల్యే కనుసన్నల్లో దందా నిర్వహిస్తుంటారనే ఆరోపణలు ఉన్నాయి.
వారికివి సర్వసాధారణమే
టీడీపీ నేతలకు సెటిల్‌మెంట్లు, దందాలు సర్వసాధారణమైపోయాయి. ఎన్నికల్లో గెలిచి పదవులు దక్కించుకున్న తర్వాత వాటిని మరింతగా విస్తరించారు. కొందరు స్వయంగా, మరికొందరు తెరవెనుక ఉండి అరాచకాలను ప్రోత్సహిస్తున్నారు. గత నెలలో దెందులూరు ఎమ్మెల్యే ఇదేవిధంగా కొందరు వ్యక్తులపై దాడికి పాల్పడ్డారు. అధికారాన్ని ఉపయోగించి అక్రమంగా అరెస్ట్‌లు చేయించి విమర్శల పాలయ్యారు. అంతకుముందు టీడీపీ వర్గీయులు అంకన్నగూడెంలో అరాచకం సృష్టించి కొందరి ఇళ్లపై దాడులకు తెగబడ్డారు. తాజాగా ఏలూరు ఎమ్మెల్యే అనుచరులు అక్రమ నిర్బంధానికి పాల్పడి వార్తల్లోకి ఎక్కారు. వీరి దందాలతో సామాన్యులు వణికిపోతున్నారు.