డీఎస్పీ గారూ.. ఇదిగో ఇక్కడున్నారు
సాక్షి ప్రతినిధి, ఏలూరు :అంకన్నగూడెం ఘటన నేపథ్యంలో 10 రోజుల క్రితం పోలీసులు అదుపులోకి తీసుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలను బుధవారం చేబ్రోలు పోలీస్ స్టేషన్‌కు తరలించారు. వీరి జాడ విషయమై ఏలూరు డీఎస్పీ మోకా సత్తిబాబును అడగ్గా... ‘వాళ్లా.. ఏమో ఎక్కడున్నారో తెలియదు. మా దగ్గర లేరు. తీసుకువచ్చిన మాట వాస్తవమే కానీ?? ఆస్పత్రి నుంచి ఎక్కడికి వెళ్లిపోయారో తెలి యదు’ అని స్పష్టం చేశారు. బుధవారం రాత్రి ‘సాక్షి’ ప్రతినిధి
ఫోన్లో సంప్రదించగా తమ వద్ద ఎవరూ లేరని డీఎస్పీ ఘంటాపథంగా చెప్పారు. ఉంగుటూరు పరిధిలో ఉన్నట్లు సమాచారం ఉందని ప్రస్తావించగా... ‘తర్వాత మాట్లాడదాం.. మీరు రండి’ అని చెప్పి ఫోన్ పెట్టేశారు. కానీ.. వైఎస్సార్ సీపీ నేతలు పోలీసుల అదుపులోనే ఉన్నట్లు స్పష్టమైంది. మొరవినేని భాస్కరరావు, గోపాలరావు, శేఖర్‌లను మంగళవారం మధ్యాహ్నం ఏపీ 37 టీఏ 3899 టవేరా వాహనంలో ఉంగుటూరు మండలం చేబ్రోలు స్టేషన్‌కు పోలీసులు తీసుకువెళ్లారు. ఆ ముగ్గురినీ స్టేషన్‌లోని ఒక గదిలో ఉంచారు. ఆ ముగ్గురిలో గోపాలరావు అనారోగ్యం పాలవడంతో వైద్యసేవల నిమిత్తం అక్కడి ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. చేబ్రోలు పోలీస్ స్టేషన్‌పై ఎవరైనా నిఘా ఉంచారేమోననే అనుమానంతో స్టేషన్ చుట్టూ పోలీసులు పహారా తిరుగుతున్నారు. బుధవారం రాత్రికి కూడా వారిని చేబ్రోలు పోలీసు స్టేషన్‌లోనే ఉంచారు.
కేసును డీఎస్పీ చూస్తున్నారు : ఎస్పీ
అంకన్నగూడెం ఘటన వ్యవహారంలో నిష్పక్షపాతంగా వ్యవహరిస్తామని జిల్లా ఎస్పీ ఎస్.హరికృష్ణ స్పష్టం చేశారు. ‘సాక్షి ప్రతినిధి’తో ఆయన మాట్లాడుతూ.. కేసును డీఎస్పీ మోకా సత్తిబాబు పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. నిందితులు అదుపులోనే ఉన్నారని, రెండు, మూడురోజుల్లో పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్పారు. అంకన్నగూడెం గ్రామంలో పరిస్థితి ప్రస్తుతానికి అదుపులోనే ఉందన్నారు.