టీడీపీ నేతలు ఇక మారరా..!
సాక్షి ప్రతినిధి, ఏలూరు: తెలుగుదేశం పార్టీ నేతల అరాచకానికి పరాకాష్ట ఇది. అధికారం దన్నుతో ఇప్పటివరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తల ఆస్తులే లక్ష్యంగా దాడులకు తెగబడుతున్న టీడీపీ శ్రేణులు ఇప్పుడు వైఎస్సార్ సీపీ నాయకులు కుల, మత, రాజకీయాలకు అతీతంగా నెలకొల్పిన జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహాన్ని తొలగించి మూలన పడేశారు. తమకు ఇష్టం లేకుండా విగ్రహం ఎలా ఆవిష్కరిస్తారంటూ జాతిపిత ప్రతిరూపాన్ని నిర్దాక్షిణ్యంగా చెత్త బండిలో పడేసి పంచాయతీ కార్యాలయూనికి తరలించారు. ఇదేమిటని ప్రశ్నించిన వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై తప్పు డు కేసులు బనాయించి పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పుతున్నారు. పెదవేగి మం డలం చొదిమెళ్ల పంచాయతీ పరిధిలోని దొండపాడులో నాలుగు వారాలుగా రావణ కాష్టంలా రగులుతున్న ఈ వివాదాన్ని పరిశీలిస్తే దెందులూరు నియోజకవర్గ టీడీపీ నేతల అరాచకం ఏస్థాయిలోఉందో ఇట్టే అర్థమవుతుంది.
ఇదీ జరిగింది
దొండపాడులోని కమ్యూనిటీ హాల్ వద్ద జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహాన్ని నెలకొల్పాలని పంచాయతీ వార్డు సభ్యుడు, వైఎస్సార్ సీపీ కార్యకర్త మునుబర్తి ముర ళీకృష్ణ భావించారు. ఈ విషయాన్ని సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి దృష్టికి తీసుకువెళ్లారు. జాతిపిత విగ్రహం ఏర్పాటుకు పంచాయతీ తీర్మానం అవసరం లేదని, తాను కూడా చందా ఇస్తానని కార్యదర్శి ఎం.ధర్మారావు చెప్పడంతో శరవేగంగా పనులు చేపట్టారు. గ్రామస్తులు విరాళాలు ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. ఓట్లేయని వాళ్లు పిలిస్తే ఎందుకొస్తామహాత్మాగాంధీ 150వ జయంతి సందర్భంగా విగ్రహాన్ని ఆవిష్కరిస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ వద్దకు విగ్రహ దాత బీటీ కుమార్, మరికొంతమంది గ్రామస్తులు వెళ్లి ఆయనను ఆహ్వానించారు. ‘ఎన్నికల్లో మీరు నాకు ఓట్లు వేయలేదు కదా.. నేను వచ్చి విగ్రహం ఎలా ప్రారంభిస్తా’నంటూ చింతమనేని ఆగ్రహించడంతో చేసేది లేక వెనుదిరిగారు. ఎమ్మెల్యే నిర్వాకంతో భయపడిన సర్పంచ్, ఉప సర్పంచ్ విగ్రహావిష్కరణకు ముందుకు రాలేదు. దీంతో చొదిమెళ్ల ఎంపీటీసీ చల్లారి కనకదుర్గ, గ్రామ పెద్దలు అక్టోబర్ 2న విగ్రహాన్ని ఆవిష్కరించారు. కక్షకట్టిన ఎమ్మెల్యే.. ‘నేను జన్మభూమి కార్యక్రమానికి వచ్చే నాటికి అక్కడ మహాత్మ గాంధీ విగ్రహం ఉండకూడదు’ అని పం చాయతీ అధికారులను ఆదేశించారు. దీంతో గత నెల 28న పంచాయతీ సిబ్బంది విగ్రహాన్ని తొలగిం చి చెత్త రిక్షాలో కార్యాలయూనికి తరలిం చారు. విగ్రహాన్ని నెలకొల్పిన దిమ్మెను తొలగించారు.
వైఎస్సార్ సీపీ కార్యకర్తపై కేసు
విగ్రహం ఏర్పాటుకు ముందుకు వచ్చిన వైఎస్సార్ సీపీ కార్యకర్త, పంచాయతీ వార్డు సభ్యుడు మురళీకృష్ణపై పంచాయతీ అనుమతి లేకుండా విగ్రహాన్ని ఏర్పాటు చేశారంటూ ఏలూరు త్రీటౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టారు. దీనిపై మురళీకృష్ణ లోక్ అదాలత్‌ను ఆశ్రయించి పిటిషన్ దాఖలు చేశారు. లోక్ అదాలత్ నోటీసులు జారీ చేసినప్పటికీ పంచాయతీ సర్పంచ్, కార్యదర్శి స్పందించలేదు. దీంతో తమకు న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్ కె.భాస్కర్‌కు, జిల్లా పంచాయతీ అధికారికి ఫిర్యాదు చేసినా స్పందన లేదని మురళీకృష్ణ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు.