భయం గుప్పిట్లోనే ‘అంకన్నగూడెం’
సాక్షి, ఏలూరు:అరెస్ట్ చేయలేదు. అదుపులో ఉన్నారని కూడా చెప్పడం లేదు. మరి పోలీసులు తీసుకువెళ్లిన వైఎస్సార్ పార్టీ నాయకులు ఏమయ్యారు. 10 రోజులు గడుస్తున్నా పెదవేగి మండలం అంకన్నగూడెం ప్రజలు భయం గుప్పిట్లోనే కాలం గడుపుతున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలపైన, వారి ఇళ్లపైన దాడులకు తెగబడ్డ అల్లరిమూకలకు సారధ్యం వహించింది ఎవరనే విషయాన్ని పోలీసులు పూర్తిగా పక్కనపెట్టేశారు. బాధితులైన వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు పోలీసుల అదుపులోనే ఉన్నప్పటికీ అధికారులు మాత్రం తమ వద్ద లేరని బుకాయిస్తున్నారు. స్టేషన్లు మారుస్తూ చిత్రహింసలకు గురి చేస్తున్నారని బాధితుల కుటుంబ సభ్యులు అందోళన వ్యక్తం చేస్తున్నారు.
అక్రమ నిర్బంధంలో వైఎస్సార్ సీపీ నేతలు
గత నెల 29న రాత్రి అంకన్నగూడెంలో టీడీపీ సర్పంచ్ చిదిరాల రాజేష్‌పై దాడికి పాల్పడ్డారంటూ గ్రామానికి చెందిన వైఎస్సార్ సీపీ నేతలు మొరవినేని భాస్కరరావు, అతని సోదరుడు గోపాలరావు, బంధువులు బాచిరాజు సూర్యప్రకాశరావు, మొరవనేని శేఖర్, ఎం.సుధాకర్‌లపై సర్పంచ్ వర్గీయులు దాడిచేసి తీవ్రంగా గాయపరిచారు. భాస్కరావు, సూర్యప్రకాశరావుకు చెందిన ఇళ్లను పూర్తిగా ధ్వంసం చేశారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన వారిని పోలీసులు తమ వెంట తీసుకువెళ్లారు. ఆ తర్వాత వాళ్లు ఏమయ్యారో తెలియడం లేదు. వారిని తాము తీసుకువెళ్లిన మాట వాస్తవమేనని, తరువాత ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో చేర్చామని చెబుతున్న డీఎస్పీ మోకా సత్తిబాబు ప్రస్తుతం వారు ఎక్కడ ఉన్నారో తమకు తెలియదని, ఆసుపత్రి నుంచి ఎక్కడికెళ్లిపోయారో చూడలేదని బుకాయిస్తున్నారు.
స్టేషన్లు మారుస్తూ చిత్రహింసలు
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు భాస్కరరావు, గోపాలరావు, శేఖర్, మరో వ్యక్తిని పోలీసులు వారం రోజులుపాటు ఏలూరులోని సెంట్రల్ క్రైం స్టేషన్‌లోనే ఉంచా రు. వారికి సరైన తిండి పెట్టకుండా మంచినీళ్లు ఇవ్వకుండా చిత్రహింసలకు గురిచేశారు. రోజులు గడిచిపోతుండటంతో వారిని మంగళవారం చేబ్రోలు పోలీస్ స్టేషన్‌కు తరలించారు. టీడీపీ నేతల దాడుల్లో తీవ్రంగా గాయపడి, సరైన చికిత్స పొందకుండానే పోలీసుల అక్రమ నిర్బంధంలో ఉన్న భాస్కరావు, గోపాలరావు ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తోంది. గోపాలరావును స్థానిక ప్రైవేటు అసుపత్రికి చికిత్స కోసం తీసుకువెళ్లారు. గణపవరం సీఐ సత్యానందం ఈ నలుగురినీ తన ఆధీనంలో ఉంచుకున్నారు.
గ్రామంలో కొనసాగుతున్న పోలీస్ పికెట్స్
అంకన్నగూడెంలో నేటికీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఏ క్షణాన ఏం జరుగుతుందోనని గ్రామస్తులు భయపడుతున్నారు. ఆరు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన పోలీస్ పికెట్లు కొనసాగుతున్నారుు. దాడిలో గాయపడిన భాస్కరావు, సూరిబాబు కుటుంబ సభ్యులు భయంతో బంధువుల ఇళ్లకు వెళ్లిపోయారు.
గుంటూరులో చికిత్స పొందుతున్న సర్పంచ్
గుంటూరు నగరంలోని లలితా సూపర్ స్పెషాలిటీ హాస్పటల్‌లో సర్పంచ్ రాజేష్ చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా లేదని, అలాగని ప్రమాదకరంగా లేదని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. వెంటిలేటర్‌పైనే చికిత్స కొనసాగిస్తున్నామని వెల్లడించాయి.
మమ్మల్ని చంపేస్తామన్నారు
‘ఘటన జరిగిన రోజున ఉదయం మా ఆయన మొరవినేని భాస్కరరావు ఇంటి కిటికీ దగ్గర నిలబడ్డారు. నేను బయట మొహం కడుక్కుంటున్నాను. ఇంతలో సుమారు 300 మంది పెద్దపెద్ద రాళ్లతో మావారి తలపైన, కాళ్లపైన కొట్టారు. భయంతో కేకలు వేస్తూ నేను, మావారు లోపలికి వెళ్లి తలుపు వేసుకున్నాం. కిటికీ అద్దాలు పగులగొట్టి, ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. మావారిని గదిలోంచి లాక్కెళ్లి కొట్టారు. తగలబెట్టేందుకు కిరోసిన్ పోశారు. ఇంతలో పోలీసులు రావడంతో దుండగులు వెళ్లిపోయారు. ఎవర్నీ ఏమీ చేయమని, నన్ను, మావారిని చంపి కాని ఊరుకోమని వారు హెచ్చరించారు.’’ - మొరవినేని బాజమ్మ, భాస్కరరావు భార్య
మా వాళ్లు నిరపరాధులు
మా నాన్న, చిన్నాన్న, ఇతర బంధువులపై ఉద్దేశపూర్వకంగానే టీడీపీ వర్గీయులు దాడులకు పాల్పడ్డారు. గత నెల 29న మా నాన్న విజయవాడలో జరిగిన ఒకరి దినకర్మ కార్యక్రమానికి వెళ్లారు. అదే కార్యక్రమానికి ప్రభుత్వ విప్, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కూడా వెళ్లారు. మధ్యాహ్నం 2.15 గంటల నుంచి రాత్రి 7.15 గంటల వరకూ మానాన్న అక్కడి లాడ్జిలోనే ఉన్నారు. దానికి సంబంధించిన సీసీ కెమెరా పుటేజీని పోలీసులకు అందజేశాం. అయినా అధికారులు మా వాళ్లను విడిచిపెట్టడం లేదు. కనీసం ఎక్కడున్నారో కూడా చెప్ప డం లేదు. వారి ఆరోగ్యం బాగోలేదు. వాళ్లు నిరపరాధులు. ఏమైపోతారోనని భయంగా ఉంది.
-మొరవినేని అనిల్, భాస్కరరావు కుమారుడు