ఘోర రోడ్డు ప్రమాదం | Severe road accident | Sakshi
Sakshi News home page

ఘోర రోడ్డు ప్రమాదం

Published Thu, Sep 18 2014 3:09 AM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM

ఘోర రోడ్డు ప్రమాదం - Sakshi

ఘోర రోడ్డు ప్రమాదం

  • బీఈడీ కళాశాల బస్సును ఢీకొన్న లారీ
  •  ప్రిన్సిపాల్ మృతి, 13 మందికి గాయాలు
  • మదనపల్లెక్రైం: మదనపల్లె కొత్త బైపాస్ రోడ్డులో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బీఈడీ కళాశాల బస్సును లారీ ఢీకొనడంతో ప్రిన్సిపాల్ మృతి చెం దారు. 13 మంది గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. అంగళ్లు సమీపంలోని విశ్వం విద్యా సంస్థల్లోని బీఈడీ కళాశాల విద్యార్థుల రికార్డులు, సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కోసం కళాశాల ప్రిన్సిపాల్, 8 మంది అధ్యాపకులు కళాశాల బస్సులో తిరుపతి ఎస్వీ యూనివర్సిటీకి బయలుదేరారు.

    ఉదయం 10.30 గంటల సమయంలో తట్టివారిపల్లె సమీపంలోని కొత్త బైపాస్ రోడ్డు కూడలిలో పుంగనూరు రోడ్డు నుంచి అంగళ్లు వైపు వేగంగా వెళుతున్న లారీ బస్సును ఢీకొంది. బస్సు అవతలి రోడ్డుపై మూడు పల్టీలు కొట్టింది. లారీ అవతలి వైపు రోడ్డు డివైడర్ ఎక్కి ఆగిపోయింది.

    ఈ ఘటనలో కళాశాల ప్రిన్సిపాల్ ఎస్‌ఎండీ.షరీఫ్(45) అక్కడికక్కడే మృతి చెందారు. అధ్యాపకులు అనంతప్రసాద్, వేణుగోపాల్‌రెడ్డి, ఈశ్వర్‌రెడ్డి , రామకృష్ణ, మహేంద్ర, విశ్వనాథ్, వెంకటరవిశంకర్, విజయలక్ష్మి, ఆమె భర్త నాగేంద్ర, విద్యార్థి రాఘవేంద్ర, బస్సుడ్రైవర్ ఖలీల్, క్లీనర్లు శశికుమార్, రెడ్డిశేఖర్ తీవ్రంగా గాయపడ్డారు. మదనపల్లె 108 సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఏరియా ఆస్పత్రికి తరలించారు. వీరిలో రాఘవేంద్ర, వెంకట రవిశంకర్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. వీరితోపాటు రామకృష్ణ, మహేంద్రను బెంగళూరుకు రెఫర్ చేశారు. రూరల్  పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
     
    స్పీడ్ బ్రేకర్లు తొలగించడమే కారణం..


    బైపాస్ రోడ్డులో ప్రమాదాలు జరుగుతుండడంతో ఎస్‌ఐ రవిప్రకాష్‌రెడ్డి తాత్కాలిక స్పీడ్ బ్రేకర్లను ఏర్పాటు చేయించారు. అప్పటి నుంచి ప్రమాదాలు చాలా వరకు తగ్గాయి. ఎందుకనో వారం రోజుల క్రితం ఆ స్పీడ్ బ్రేకర్లను తొలగించారు. ఈ కారణంగానే ప్రమాదం జరిగిందని స్థానికులు అంటున్నారు. స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని స్థానికులు ధర్నా చేశారు. ఆ మేరకు పోలీసులు హామీ ఇవ్వడంతో విరమించారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement