బ్రేకుల్లేని రవాణా | Sharing notes with robbers and thieves on earth ... | Sakshi
Sakshi News home page

బ్రేకుల్లేని రవాణా

Published Fri, Jan 17 2014 2:36 AM | Last Updated on Fri, Jun 1 2018 8:36 PM

Sharing notes with robbers and thieves on earth ...

సాక్షి ప్రతినిధి, అనంతపురం : దొంగలు దొంగలు కలిసి నోట్ల కట్టలను పంచుకుంటున్నారు.. ఉన్నది లేనట్టు.. లేనిది ఉన్నట్టు కనికట్టు చేస్తున్నారు. బియ్యం రవాణా కాంట్రాక్టర్ అవతారం ఎత్తిన టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే, ఎఫ్‌సీఐ(భారత ఆహార సంస్థ), పీడీఎస్(పౌర సరఫరాల శాఖ) అధికారులు కుమ్మక్కయ్యారు. గోదాముల నుంచి ఎంఎల్‌ఎస్(మండల స్థాయి స్టాక్) కేంద్రాలకు వాహనాల్లో సామర్థ్యానికి మించి(ఓవర్‌లోడ్) బియ్యాన్ని సరఫరా చేస్తున్నారు.
 
 రవాణాలో ఓవర్‌లోడ్ రూపంలో నెలకు రూ.40 లక్షల చొప్పున ఏడాదికి రూ.4.80 కోట్లను కాజేసి, పంచుకుతింటున్నారు. వివరాల్లోకి వెళితే.. జిల్లాలో 11,53,713 తెల్ల రేషన్‌కార్డులు, 54,529 గులాబీ కార్డులు చలామణిలో ఉన్నాయి. రేషన్ కార్డుల లబ్ధిదారులకు 2,685 చౌక దుకాణాల ద్వారా ప్రతి నెలా 14,745 టన్నుల బియ్యాన్ని సరఫరా చేస్తున్నారు. అనంతపురం మండలం కందుకూరుకు సమీపంలోని ఎఫ్‌సీఐ గోదాముల నుంచి 24 ఎంఎల్‌ఎస్ కేంద్రాలకు ప్రతి నెలా బియ్యాన్ని తరలించి.. అక్కడి నుంచి చౌక దుకాణాలకు సరఫరా చేస్తారు. ఎఫ్‌సీఐ గోదాముల నుంచి ఎంఎల్‌ఎస్ కేంద్రాలకు బియ్యం సరఫరా చేసే(స్టేజ్-1) పనులను లారీ యజమానుల సంఘం ప్రతినిధులను తీవ్ర స్థాయిలో టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే బెదిరించి.. బినామీ పేర్లతో చేజిక్కించుకోవడం ఆర్నెల్ల క్రితం సంచలనం రేపింది.
 
  కందుకూరులోని ఎఫ్‌సీఐ గోదాముల నుంచి 16 కిలోమీటర్ల లోపు దూరం ఉన్న ఎంఎల్‌ఎస్ కేంద్రాలకు బియ్యం రవాణాకు క్వింటాలుకు కిలోమీటర్‌కు రూపాయి చొప్పున చెల్లిస్తారు. 16 కిలోమీటర్ల కన్నా ఎక్కువ దూరం ఉంటే.. కిలోమీటర్‌కు క్వింటాలుకు రూ.2 చొప్పున అదనంగా చెల్లిస్తారు.
 
  ఆరు చక్రాల లారీల్లో పది టన్నులు.. 10 చక్రాల లారీల్లో 21 టన్నులు, ట్రైలర్ లారీల్లో 40 టన్నుల చొప్పున రవాణా చేయవచ్చు. అంతకు మించి రవాణా చేయడానికి వీలులేదు. ఆ మేరకు టెండర్ అగ్రిమెంట్‌లో కూడా టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే బినామీ కాంట్రాక్టర్ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నారు.  ఎఫ్‌సీఐ కేంద్రం నుంచి ప్రతి నెలా 14,745 టన్నుల బియ్యాన్ని 24 ఎంఎల్‌ఎస్ కేంద్రాలకు సరఫరా చేసినందుకు సగటున రూ.1.14 కోట్ల మేర బియ్యం రవాణా కాంట్రాక్టర్‌కు బిల్లులు చెల్లిస్తున్నారు.
 
 అధికారులు, కాంట్రాక్టర్ కుమ్మక్కు..
 ఎఫ్‌సీఐ, పీడీఎస్ అధికారులు, బియ్యం రవాణా కాంట్రాక్టర్ అయిన టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే కుమ్మక్కయ్యారు. లారీల్లో ఓవర్‌లోడ్ వేసుకుని.. ఎంఎల్‌ఎస్ కేంద్రాలకు బియ్యం సరఫరా చేసేలా ఒప్పందం కుదుర్చుకున్నారు.
 
 సిక్స్ వీలర్ లారీల్లో కనిష్టంగా 17 టన్నులు.. 10 వీలర్ లారీల్లో కనిష్టంగా 35 టన్నులు, ట్రైలర్ లారీల్లో కనిష్టంగా 60 టన్నుల చొప్పున బియ్యాన్ని ఎంఎల్‌ఎస్ కేంద్రాలకు సరఫరా చేస్తున్నారు. కానీ.. రికార్డుల్లో మాత్రం నిబంధనల మేరకు బియ్యం రవాణా చేస్తున్నట్లు తప్పుడు లెక్కలు నమోదు చేస్తున్నారు. ఓవర్‌లోడ్‌తో బియ్యాన్ని సరఫరా చేస్తుండటం వల్ల కాంట్రాక్టర్ అయిన ఎమ్మెల్యేకు భారీ ఎత్తున కలిసివస్తోంది. టిప్పుల సంఖ్య గణనీయంగా తగ్గిపోతోంది. దీని వల్ల నెలకు కనిష్టంగా రూ.40 లక్షల మేర ఎమ్మెల్యేకు ఉత్తినే మిగులుతోంది. రికార్డుల్లో తప్పుడు లెక్కలు నమోదు చేసి, సహకరించినందుకు ప్రతిఫలంగా ఎఫ్‌సీఐ, పీడీఎస్ అధికారులకు ప్రతి నెలా చెరో రూ.2.50 లక్షల చొప్పున ముడుపులు ముట్టచెబుతున్నట్లు ఆ శాఖ వర్గాలే పేర్కొంటున్నాయి.
 
 రవాణా శాఖకు రూ.ఐదు లక్షలు..
 ఓవర్‌లోడ్‌తో బియ్యం రవాణా చేస్తుండటం వల్ల ఆ వాహనాలు తరచుగా ప్రమాదాలకు గురవుతున్నాయి. రహదారులు పాడవుతున్నాయి. రవాణాశాఖ(ఆర్టీఏ) అధికారులు మాత్రం ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. బియ్యం రవాణా చేసే లారీలను కనీసం తనిఖీ కూడా చేయడం లేదు.
 
 ఇందుకు ప్రతి ఫలంగా రవాణా శాఖ ఉన్నతాధికారులకు బియ్యం రవాణా చేసే కాంట్రాక్టర్ అయిన ఎమ్మెల్యే ప్రతి నెలా రూ,.ఐదు లక్షల మేర ముడుపులు ముట్టచెబుతున్నారు. ఈ విషయం తెలియని ఒక ఎంవీఐ పక్షం రోజుల క్రితం పెనుకొండకు సమీపంలో ఓవర్‌లోడ్‌తో వెళ్తోన్న బియ్యం లారీని తనిఖీల్లో భాగంగా పట్టుకున్నారు. ఓవర్‌లోడ్‌తో వెళ్తున్నట్లు గుర్తించి.. భారీ ఎత్తున జరిమానా విధించేందుకు సిద్ధమయ్యారు. ఈ అంశాన్ని లారీ డ్రైవర్ బియ్యం రవాణా కాంట్రాక్టర్ అయిన ఎమ్మెల్యే అనుచరుడికి తెలియజేశారు.
 
 విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే రవాణాశాఖ ఉన్నతాధికారిపై ఆగ్రహావేశాలు వ్యక్తం చేయడం ఆ శాఖలో కలకలం రేపుతోంది. ఇదే అంశంపై డీటీసీ ప్రతాప్‌ను ‘సాక్షి’ వివరణ కోరగా.. బియ్యం కాంట్రాక్ట ర్ వద్ద నుంచి తమకు ఎలాంటి ముడుపులు అందడం లేదన్నారు. బియ్యం రవాణా చేసే లారీలను క్రమం తప్పకుండా తనిఖీ చేసి.. ఓవర్‌లోడ్ వేసుకున్నట్లు తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement