
వెండితెర సీత అంజలీదేవి ఇక లేరు!
సాక్షి, విజయవాడ: వెండితెర సీత అంజలీదేవి(86) సోమవారం కన్ను మూశారు. ఆమె తూర్పుగోదావరి జిల్లా పెద్దపురంలో జన్మించినప్పటికీ విజయవాడతో సన్నిహిత సంబంధాలున్నాయి. ఆమె నటించిన లవకుశ, సువర్ణసుందరి, అనార్కలీ, బండిపంతులు,భోగిమంటలు, వీరాంజనేయ, భక్త ప్రహ్లాద తదితర చిత్రాలు విజయవాడలోని మారుతీటాకీస్, దుర్గాకళామందిరం, శ్రీనివాస్ మహాల్, సర్వస్వతి పిక్చర్ ప్యాలెస్, ఈశ్వరమహాల్ థియేటర్లలో వందేసి రోజులు ఆడాయి.
ఆమె పుట్టపర్తిసాయిబాబాకు భక్తురాలు. నాటి ప్రముఖ నటుడు చిత్తూరు నాగయ్యే ఆమెను పుట్టపర్తి బాబాకు పరిచయం చేశారు. 2008లో ఆమె విజయవాడ వచ్చినప్పుడు సీతారాంపురంలోని సత్యసాయిబాబా మందిరానికి వెళ్లి అక్కడ బాబా భక్తులతో గడపటం విశేషం. నగరంలోని ఆంధ్రా ఆర్ట్స్ అకాడమీ ప్రధాన కార్యదర్శి గోళ్ల నారాయణరావు తీసిన కన్నకొడుకు చిత్రంలో అంజలీదేవి సినీనటుడు నాగేశ్వరరావు తల్లిగా నటించి మన్ననలు పొందింది.
నగరంలో అంజలీ పిక్చర్స్ కార్యాలయం...
అంజలీదేవి నటిగానే కాకుండా చిత్ర నిర్మాత. అంజలీ పిక్చర్స్‌ను ప్రారంభించి అనేక చిత్రాలను ఆమె తీశారు. నగరంలోని దుర్గాకళామందిరం వెనుక అంజలీ పిక్చర్ కార్యాలయం ఉండేది. ఆమె భర్త ఆదినారాయణరావుతో కలిసి అమె అనేక సార్లు ఈ కార్యాలయానికి వచ్చేదని నాటి సినీ అభిమానులు చెబుతున్నారు. ఆమె తీసిన భక్త తుకారం చిత్రానికి అభినందన సభ విజయవాడలోని నటరాజ్ థియేటర్‌లో జరిగింది. ఈ సభకు పద్మశ్రీ తుర్లపాటి కుటుంబరావు అధ్యక్షత వహించడం విశేషం. అంజలీదేవి ఏ చిత్రం నిర్మించినా తుర్లపాటిని ప్రత్యేకంగా ఆహ్వానించేవారు.
2008లో ఘన సన్మానం....
లవకుశ విడుదలై 46 ఏళ్లు పూర్తయిన సందర్భంగా శ్రీ సోమనాధ నాట్యమండలి అధ్యక్షుడు బొలిశెట్టి రాధకష్ణమూర్తి అంజలీదేవి(సీత), కుశుడు(సుబ్రహ్మణ్యం), లవుడు(నాగరాజు)లను విజయవాడకు ప్రత్యేకంగా ఆహ్వానించి ఘంటసాల సంగీత కళాశాలలో 2008 జూన్ 8న ఘనంగా సన్మానించారు. రాధాకష్ణమూర్తి కోరిన వెంటనే ఆమె విజయవాడ రావడానికి అంగీకారం తెలిపారు. వయోభారం కుంగదీస్తున్నప్పటికీ నగరాకి వచ్చి ఆ చిత్రం విశేషాలను శ్రోతలకు వివరించడం విశేషం.