
సాక్షి, విశాఖపట్నం: విశాఖ నడిబొడ్డున ఉన్న రూ.కోట్లాది విలువైన జిల్లా గ్రంథాలయ సంస్థ భూమి కొట్టేయాలనుకున్న ప్రత్యూష కంపెనీకి చుక్కెదురైంది. ఆ కంపెనీతో ఒప్పందం రద్దు చేసుకోవడంలో నిబంధనల ఉల్లంఘన జరగలేదని ఉన్నతాధికారుల కమిటీ ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. కంపెనీకి పరిహారం చెల్లించనవసరం లేదని, కావాలని కాలయాపన చేసిన కంపెనీయే గ్రంథాలయ సంస్థకు రూ. 85,86,774 నష్టపరిహారం చెల్లించాలంది. ఒప్పంద సమయంలో ప్రత్యూష కంపెనీ ఇచ్చిన రూ.1.25 కోట్ల బ్యాంకు గ్యారంటీని కూడా ఇవ్వనసరం లేదని, ఆ సొమ్మును గ్రంథాలయ సంస్థ ఖాతాకు జమ చేయాలని సూచించింది.
ప్రస్తుతం స్థలాన్ని సీఆర్‌పీఎఫ్ వద్ద నుంచి వెంటనే స్వాధీనం చేసుకుని గ్రంథాలయ సంస్థకు అప్పగించాలని కమిటీ తెలిపింది. విశాఖలో అత్యంత ఖరీదైన మహారాణిపేటలో జిల్లా గ్రంథాలయ సంస్థకు ఎకరాకు పైగా స్థలం ఉంది. ఈ స్థలాన్ని మంత్రి గంటా శ్రీనివాసరావు డైరెక్టర్‌గా వ్యవహరించిన సమయంలో ప్రత్యూష కంపెనీ 2010 ఫిబ్రవరి 15న 33 ఏళ్ల లీజుకు తీసుకుంది. ఒప్పందం ప్రకారం ఇందులో 24 నెలల్లో బహుళ అంతస్తుల నిర్మాణం పూర్తి చేయాల్సి ఉన్నా అది పూర్తి చేయలేదు. గడువులోగా నిర్మాణ ప్రక్రియ మొదలుపెట్టకపోవడంతో పౌర గ్రంథాల యసేవా సమితి ఉద్యమం చేపట్టింది.