ప్రమాద కారణాలను నిగ్గు తేల్చేపనిలో ఫోరెన్సిక్ నిపుణులు
సాక్షి, హైదరాబాద్: బెంగళూరు-నాందేడ్ ఎక్స్‌ప్రెస్ మంటల్లో చిక్కుకున్న ఘటనలో పేలుడు పదార్థాల ఆనవాళ్లేమైనా ఉన్నాయా.. అనే కోణంలో ఫోరెన్సిక్ నిపుణులు పరిశీలన జరుపుతున్నారు. రైలు మంటల్లో చిక్కుకోవడానికి కారణం ఏమిటి? మంటలు ఎలా చెలరేగాయనేదానిపై రాష్ట్ర ఫోరెన్సిక్ సైన్స్ లాబోరేటరీ (ఏపీఎఫ్‌ఎస్‌ఎల్)కు చెందిన నాలుగు బృందాలు నిగ్గు తేల్చేపనిలో ఉన్నాయి. ప్రాథమిక వివరాల ప్రకారం బీ-1 బోగీలోని ఎయిర్ కండీషన్ యూనిట్‌లో షార్ట్ సర్య్యూట్ కావడంతో మంటలు చెలరేగినట్లు డీజీపీ ప్రసాదరావు వెల్లడించారు. ఏపీఎఫ్‌ఎస్‌ఎల్ డెరైక్టర్ ఎ. శారద నేతృత్వంలో మూడు ప్రత్యేక బృందాలు ప్రమాద స్థలికి చేరుకున్నాయి.
పేలుడు పదార్ధాల నిపుణులు, ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్‌లను గుర్తించే నిపుణులు, డీఎన్‌ఏ, క్రైం సీన్ పరిశీలన నిపుణుల బృందాలు ప్రమాదానికి గురైన బీ-1 బోగీని క్షుణ్ణంగా పరిశీలించాయి. తిరుపతి నుంచి కూడా మరో ఫోరెన్సిక్ నిపుణుల బృందం ప్రమాద స్థలికి చేరుకుంది. ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమని ప్రాథమికంగా అంచనాకు వచ్చినప్పటికీ.. బోగీలో మంటలు త్వరితగతిన వ్యాపించడానికి రసాయనాలేమైనా దోహదపడ్డాయా అనే కోణంలోనూ పరిశీలన జరుపుతున్నారు. అన్ని అనుమానాలూ నివృత్తి అయిన తర్వాతే ప్రమాద కారణాన్ని ఫోరెన్సిక్ నిపుణులు వెల్లడించే అవకాశం ఉంది.