టీటీడీ అధికారులకు పరకామణి సమస్య తలనొప్పి తెచ్చిపెడుతోంది. టీటీడీ ఉద్యోగులు పరకామణి విధులంటేనే హడలిపోతున్నారు.ç ³పరకామణి మండపంలో సౌకర్యాలు లేకపోవడంతో ఎవరూ కూడా పరకామణి విధులకు రావడానికి సాహసించడం లేదు. నిల్వలు రోజురోజుకూ పేరుకుపోతున్నాయి. ఈ సమస్యను ఎలా పరిష్కరించాలో తెలియక అధికారులు తలలు పట్టుకుంటున్నారు.
సాక్షి, తిరుమల : టీటీడీకి ప్రధాన ఆదాయ వనరులు భక్తులు సమర్పించే హుండీ కానుకలు, వాటి లెక్కింపు కోసం టీటీడీ ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసింది. శ్రీవారి ఆలయంలోనే పరకామణి మండపంలో నిత్యం స్వామివారి హుండీ కానుకలును లెక్కిస్తారు. కాని టీటీడీ అనాలోచిత నిర్ణయాలతో స్వామివారి కానుకలు లెక్కించడానికి ఇప్పుడు సిబ్బంది కొరత ఉత్పన్నమైంది. దీంతో నిల్వలు పెరిగిపోతున్నాయి. ఫలితంగా వడ్డీ రూపేణా రావాల్సిన ఆదాయాన్ని టీటీడీ కోల్పోతోంది. శ్రీవారిని దర్శనార్థం వచ్చే భక్తుల సంఖ్య రోజురోజుకు పెరగుతూ ఉండడంతో కానుకల సమర్పణ కూడా పెరుగుతోంది. ప్రస్తుతం ప్రతి రోజూ 8 నుంచి 16 సార్లు హుండీ నిండిపోతోంది. ఈ కానుకలను ఎప్పటికప్పుడు లెక్కించేందుకు టీటీడీ ప్రత్యేకంగా పరకామణి వ్యవస్థను ఏర్పాటుచేసింది.
మొదట్లో టీటీడీ ఉద్యోగులను పరకామణి విధుల కోసం ప్రతి నిత్యం డెప్యుటేషన్‌పై టీటీడీ నియమించేది. స్వామివారికి లభిస్తున్న కానుకలు పెరుగుతుండడంతో ఆ తర్వాత బ్యాంకు ఉద్యోగుల సహకారం కూడా టీటీడీ తీసుకుంది. డిపాజిట్ల వ్యవహారంలో టీటీడీకి, బ్యాంకుల మధ్య సఖ్యత కుదరకపోవడంతో పరకామణి విధుల నుంచి బ్యాంకు సిబ్బంది 2009 నుంచి దూరమయ్యారు. దీంతో టీటీడీ ఉద్యోగులే శ్రీవారి కానుకలను లెక్కిస్తున్నారు.2009 తరువాత పరకామణిలో టీటీడీ మార్పులు తీసుకువచ్చింది. స్వామివారికి కానుకులు నిత్యం రూ.3 కోట్లు దాటుతుండడంతో పాటు ప్రతి నెల లభించే బంగారు ఆభరణాలు 100 కేజీలు దాటుతుండడం, చిల్లర నాణేలు రోజూ రూ.8 నుంచి రూ.16 లక్షల వరకు వçస్తుండడంతో, చిల్లర పరకామణిని తిరుపతిలోని పరిపాలన భవనానికి టీటీడీ తరలించింది.
శ్రీవారి ఆలయంలోని రెండు మండపాల్లో కరెన్సీ, బంగారు లెక్కింపునకు శ్రీకారం చుట్టింది. టీటీడీ ఉద్యోగులకు సహాయకులుగా పరకామణి సేవకులను టీటీడీ ప్రవేశపెట్టింది. గత ఏడాది మహాసంప్రోక్షణ సమయంలో ఆనంద నిలయానికి పక్కన ఉన్న మండపాన్ని యాగశాలగా మార్చివేసిన టీటీడీ కరెన్సీ లెక్కింపు కోసం ఆలయం వెనుక వున్న ఒక్క మండపాన్ని మాత్రమే వినియోగించుకుంటోంది. సంప్రోక్షణ పూర్తి అయినా మండపంలో తిరిగి పరకామణి లెక్కింపు టీటీడీ చేపట్టలేదు. పూర్తిగా క్లోజ్డ్ సర్క్యూట్‌లో ఉండే పరకామణి మండపంలోకి పరిమితికి మించి ఉండడంతో ఉద్యోగులు శ్వాస కూడా తీసుకోవడం ఇబ్బందిగా మారడంతో లెక్కింపు ప్రకియ మందగించింది. దీంతో నిల్వలు పెరిగిపోయాయి. దీంతో లెక్కింపును వేగవంతం చేసేందుకు íసి–షిఫ్ట్‌ను టీటీడీ ఏర్పాటు చేసింది.
అయితే సిబ్బంది కొరత కారణంగా ఈ షిఫ్ట్‌ను అమలు చేయలేని స్థితిలో టీటీడీ ఉంది. ఫలితంగా ఇబ్బందులు పడుతోంది. టీటీడీ ఉద్యోగులు పరకామణి విధులంటేనే హడలిపోతున్నారు. పరకామణి మండపంలో విపరీతమైన దుమ్ము ధూళి నిండిపోవడం, తాగడానికి కనీసం నీటి సౌకర్యం కూడా లేకపోవడం, ఒకసారి పరకామణి మండపంలోకి వెళితే 3 గంటల పాటు వెలుపలికి వచ్చే అవకాశం లేదు. దీంతో ఎవరూ కూడా పరకామణి విధులకు రావడానికి సాహసించడం లేదు. దీంతో తాజాగా టీటీడీ కానుకల లెక్కింపును విద్యార్థులతో చేయిస్తే ఎలా ఉంటుందో అనే కసరత్తు చేస్తోంది. ఇదే విషయమై ఇప్పటికే టీటీడీ అధికారులు సమావేశాలు కూడా నిర్వహించారు. కానీ అసలు సమస్యను సరిచేయకుండా ఇలా రోజుకు ఒకరు అన్న చందాన టీటీడీ లెక్కింపును చేపట్ట్లాని భావిస్తుండడం విమర్శలకు తావిస్తోంది. ఎవరు వచ్చినా.. ఎప్పుడు వచ్చినా... పరకామణి మండపంలో పని చేయడానికి అనువైన వాతావరణం లేకపోతే... భవిష్యత్తులో కానుకల లెక్కింపుకు టీటీడీ యంత్రాల పైనే పూర్తిగా ఆధారపడాల్సి వస్తుందేమో..!
Comments
Please login to add a commentAdd a comment