ఎస్కేయూ/అనంతపురం ఎడ్యుకేషన్ : ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో కాంట్రాక్టు లెక్చరర్ల పోస్టులను అడ్డదారుల్లో భర్తీ చేశారు. రోస్టర్‌కు విరుద్ధంగా అడ్డగోలుగా నియామకాలు చేపట్టారు. ఇంటర్ విద్య రీజనల్ జాయింట్ డెరైక్టర్ (ఆర్జేడీ-కడప)ను సమాచార హక్కు చట్టం కింద వివరాలు కోరగా.. ఈ అక్రమాలు వెలుగు చూశాయి. 2010 ఆగస్టు 13కు ముందు భర్తీ చేసిన 972 కాంట్రాక్ట్ లెక్చరర్ పోస్టులను 2013-14 విద్యా సంవత్సరంలో రోస్టర్ ప్రకారం రెన్యూవల్ చేయలేదని ఆర్జేడీ అధికారులు రాతపూర్వకంగా ఇచ్చారు.
రాయలసీమ జోన్ పరిధిలో మొత్తం 1,369 మంది కాంట్రాక్ట్ లెక్చరర్లు పని చేస్తున్నారు. వీరిలో 972 మందిని 2010 ఆగస్టు 13వ తేదీకి ముందు విధుల్లోకి తీసుకున్నారు. అప్పటి నుంచి ప్రతియేటా రెన్యూవల్ చేస్తున్నారు. అలాగే 397 మందిని 2010 ఆగస్టు 13 తర్వాత తీసుకున్నారు. మొదటి దఫా ఉద్యోగాల భర్తీలో రోస్టర్ పాటించలేదు. 2013-14 విద్యా సంవత్సరంలో రోస్టర్‌ను అనుసరించి రెన్యూవల్ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.
అయితే.. ఈ ఆదేశాలను పట్టించుకోకుండా స్థానిక ప్రిన్సిపాళ్ల సిఫార్సులకు పెద్దపీట వేశారనే ఆరోపణలున్నాయి. ఈ వ్యవహారంలో పెద్దఎత్తున డబ్బులు చేతులు మారినట్లు తెలిసింది. రోస్టర్ పాటించని కారణంగా బడుగు, బలహీన వర్గాల అభ్యర్థులే ఎక్కువగా నష్టపోయారు. రోస్టర్ పాటించకుండా.. అర్హులందరికీ సమాన అవకాశాలు ఇవ్వకుండా జరిపిన నియామకాలు 15 ఏళ్ల సర్వీసు ఉన్నా రద్దు చేయాలని ‘ఉమాదేవి వర్సెస్ కర్ణాటక స్టేట్’ కేసులో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. దీన్ని మన అధికారులు పరిగణనలోకి తీసుకోవడం లేదు.
న్యాయ పోరాటాలకు సిద్ధం
కాంట్రాక్టు లెక్చరర్ల నియామకాల్లో జరిగిన అక్రమాలపై త్వరలో న్యాయపోరాటాలకు దిగుతామని ఎస్కేయూలోని నిరుద్యోగ పోరాట సమితి స్పష్టం చేసింది. నిబంధనలు పాటించాల్సిన అధికారులే ఇలా అడ్డగోలుగా నియామకాలు ఎలా చేస్తారని ప్రశ్నించింది. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి నిరుద్యోగులకు జరిగిన అన్యాయంపై పోరాడతామని సమితి సభ్యుడు రవిప్రకాష్ తెలిపారు. వేలాది మంది పీజీ, పీహెచ్‌డీలు పూర్తి చేసుకుని జూనియర్ లెక్చరర్ల (జేఎల్) నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారని తెలిపారు. ఈ అక్రమ నియామకాలు రద్దు చేస్తే మూడు వేల పోస్టులతో రెగ్యులర్ నోటిఫికేషన్‌కు మార్గం సుగమం అవుతుందన్నారు.
అడ్డదారుల్లో నియామకాలు!
Published Mon, Jul 28 2014 2:22 AM | Last Updated on Fri, Jun 1 2018 8:52 PM
Advertisement
Advertisement