
బాధ్యతలు స్వీకరిస్తున్న కమిషనర్ శ్రీకేష్ బాలజీరావ్ లఠ్కర్
నగరంపాలెం: నగర ప్రజలకు సౌకర్యాల కల్పనలో ఒత్తిడిలకు లోనుకాకుండా కచ్చితంగా వ్యవహరించి అభివృద్ధి పనుల్ని ముందుకు తీసుకువెళతానని నగరపాలక సంస్థ కమిషనర్ శ్రీకేష్ బాలాజీరావ్ లఠ్కర్ తెలిపారు. గురువారం బాధ్యతలు తీసుకున్న అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. నగర ప్రజలకు ఉపయోగపడే అభివృద్ధి పనుల్ని ఉద్దేశపూర్వకంగా అడ్డుకునేలా వచ్చే ఒత్తిడుల్ని సహించేది లేదన్నారు. భవిష్యత్‌లో డయేరియా పునరావృత్తం కాకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. తూర్పు నియోజకవర్గంలో డయేరియా ప్రబలడానికి శిథిలమైన పాత పైపులైన్లుతో పాటు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, సైడు కాల్వల్లో మురుగునీరు సక్రమంగా ప్రవహించక పోవడం, కాల్వల్లో నుంచి మంచినీటి కుళాయిలు ఉండటం తదితర కారణాలుగా పేర్కొన్నారు. పట్టణ ప్రజలు కూడా పరిశుభ్రతను పాటిస్తూ అధికారులకు సహకరించాలని ఆయన కోరారు. ఇప్పటికే నగరంలో డయేరియా కేసులూ పూర్తిస్థాయిలో తగ్గాయని, అయినా ముందస్తుగా మెడికల్ క్యాంపులు, సంచార వాహనాల ద్వారా వైద్యసేవలు కొనసాగిస్తున్నామని తెలిపారు.
బాధిత ప్రాంతాల్లో పారిశుద్ధ్య స్పషల్ డ్రైవ్
బాధిత ప్రాంతాల్లోని అన్ని డివిజన్లలో ఇతర మున్సిపాల్టీల నుంచి కమిషనర్లను, సిబ్బందిని నియమించి ఐదు రోజులుగా పారిశుద్ధ్యం డ్రైవ్ నిర్వహిస్తున్నామని చెప్పారు. అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ పైపులు, సైడు కాల్వల్లో పూర్తిస్థాయిలో పూడిక తీసి మురుగునీరు సక్రమంగా ప్రవహించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఆనందపేట, బారాఇమాంమ్ పంజా, ముఫ్తీ స్ట్రీట్ తదితర ప్రాంతాల్లో శిథిలమైన పాత పైపుల స్థానంలో మొదటి విడతగా 23 కి.మీ పైపులైన్లను పది రోజుల్లో యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. మిగతా ప్రాంతాల్లో 45రోజుల్లో మరో 80 నుంచి 90 కి.మీ పైపులైన్లు ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేశామని వెల్లడించారు. నగరంలోని అన్ని డివిజన్లలో మురుగునీటి కాల్వల నుంచి వెళుతున్న మంచినీటి పైపులైన్లును పక్కకు మార్చుతున్నామని చెప్పారు. నగరానికి మంచినీటిని సరఫరా చేస్తున్న హెడ్ వాటర్‌వర్క్స్‌తో పాటు అన్ని ప్రాంతాల్లో ప్రతిరోజు మంచినీటికి క్లోరిన్, బాక్టీరియా పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. డయేరియా ప్రబలిన ప్రాంతాలైన ఆనందపేట, బారాఇమాంమ్ పంజాలోని కొన్ని ప్రాంతాల్లోనే మార్చి 5,6 తేదీల్లో ఈకోలీ బ్యాక్టీరియా ఉన్నట్లు తెలిందన్నారు. ప్రస్తుతం బాధిత ప్రాంతాలతో సహా అన్ని ప్రాంతాల్లో నిర్వహిస్తున్న పరీక్షలలో బాక్టీరియాపై పాజిటివ్ రిపోర్ట్సు రాలేదని తెలిపారు.
నగరాభివృద్ధికి కృషి
నవ్యాంధ్ర రాజధానిలో భాగమైన నగరాభివృద్ధికి నిధులు మంజూరులో ముఖ్యమంత్రి చం ద్రబాబునాయుడు, పురపాలకశాఖ మంత్రి పి. నారాయణ సానుకూలంగా ఉన్నారన్నారు. ట్రాఫిక్ ఇబ్బందులు తొలగేలా రహదారుల విస్తరణకు చర్యలు తీసుకుంటామన్నారు. నగరంలో సమగ్ర మంచినీటి పథకం పనుల్ని నెలరోజుల్లో పూర్తి చేసి, ప్రస్తుతం నగరానికి వస్తు న్న 90 ఎంఎల్‌డీ నీటితో పాటు అదనంగా మరో 45 ఎంఎల్‌డీ నీటిని తీసుకురానున్నామని తెలిపారు. పబ్లిక్ హెల్త్ ఇంజినీరింగ్ ఆధ్వర్యంలో జరుగుతున్న యూజీడీ పనులపై పూర్తిస్థాయిలో మానిటరింగ్ చేసి నాణ్యతలోపాలు లేకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. నగరంలో 900 కి.మీ పొడవు ఉన్న రహదారుల్లో యూజీడీ వల్ల 400 కి.మీ వరకు తవ్వడం వల్ల దుమ్మూ, ధూళీ వ్యాపించిందన్నా రు. ప్రధాన రహదారుల్లో యూజీడీ పనుల్ని వేగవంతంగా పూర్తిచేసి పునరుద్ధరణ చేసేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అవినీతి, ఆక్రమాలకు పాల్పడే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని లఠ్కర్ హెచ్చరించారు.
కమిషనర్‌కు అభినందనలు
నూతన కమిషనర్ శ్రీకేష్ లఠ్కర్‌ను తూర్పునియోజకవర్గం ఎమ్మెల్యే షేక్ మహమ్మద్ ముస్తఫా, అదనపు కమిషనర్ కె.రామచంద్రారెడ్డి, డీసీలు ఏసుదాసు, శ్రీనివాసులు, సెక్రటరీ వసంతలక్ష్మి పుష్పగుచ్ఛం అందించి అభినందనలు తెలి పారు. సిటీ ప్లానర్ చక్రపాణి, ఎగ్జామినర్ ఆఫ్ అకౌంట్స్ చిన్నపరెడ్డి, మేనేజరు వెంకటరామయ్య, మినిస్టీరియల్ ఎంప్లాయీస్ అధ్యక్షుడు పి. నమ్రత్ కుమార్, మున్సిపల్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు జాన్‌బాబు, రెవెన్యూ, టౌన్ ప్లానింగ్, ప్రజారోగ్యశాఖ అధికారులు కలసి అభినందనలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment