కానూరు అగ్రహారంలో రొయ్యల సాగు వల్ల మోడుబారిన తాటిచెట్లు
సాక్షి, పెరవలి (పశ్చిమ గోదావరి): చేపల చెరువులకు అనుమతులు తీసుకుని ఆపేరుతో అనధికారికంగా రొయ్యల సాగు చేస్తున్నా అధికారులకు పట్టడం లేదు. ఈ రొయ్యల సాగుతో పంట భూములు కలుషితమై చౌడుబారుతున్నాయి. రొయ్యల చెరువుల నుంచి విడుదలయ్యే కలుషిత నీటితో భూగర్భ జలాలు కలుషితమై పంట భూములతో పాటు గట్ల వెంబడి ఉండే కొబ్బరి చెట్లు, తాడిచెట్లు సైతం మోడుబారిపోతున్నాయి.
మామూళ్లమత్తులో అధికారులు
చెరువుల తవ్వకాలప్పుడు పర్యవేక్షించాల్సిన రెవెన్యూ, ఫిషరీస్ డిపార్టుమెంట్ల అధికారులు మామూళ్ల మత్తులో కూరుకుపోవడంతో చెర్వుల యజమానులు ఆడింది ఆటగా పాడింది పాటగా సాగుతోంది. జిల్లాలో ఈ విధంగా అనధికారకంగా రొయ్యల సాగు సుమారు 2 వేల హెక్టార్లలో సాగుతున్నట్టు అంచనా. ఒక్క పెరవలి మండలంలోనే కానూరు, నడుపల్లి, కానూరు అగ్రహారం, ఉసులమర్రు, తీపర్రు గ్రామాల్లో చేపల చెపల చెర్వుల తవ్వకాలకు 950 ఎకరాలకు అనుమతులు ఇచ్చారు. వీటిలో కేవలం 150 ఎకరాల్లో చేపల సాగు జరుగుతుండగా మిగిలిన 800 ఎకరాల్లో రొయ్యల సాగు చేస్తున్నారు. ఇప్పటికే కానూరు, కానూరు అగ్రహారం, ఉసులుమర్రు గ్రామాల్లో తాగునీటికి ప్రజలు ఇబ్బందులు ఎదర్కొంటున్నారు. ఇదేవిధంగా కొనసాగితే భవిష్యత్తులో స్వచ్ఛమైన తాగునీరు దొరకని పరిస్థితి ఏర్పడుతుందని ప్రజలు ఆవేదన చెందుతున్నారు.
నిబంధనలు ఇలా..
► చేపల చెరువుల యజమానులు వాల్టా చట్టానికి తూట్లు పొడుస్తున్నారు. దీనికి అధికారులు కూడా వంత పాడుతున్నారు. చేపల చెరువులు, పంటభూమల వద్ద బోరు వేయాలంటే సబంధిత శాఖ అనుమతి తప్పనిసరి. కానీ పెరవలి మండలంలో ఎలాంటి అనుమతులు లేకుండానే బోర్లు వేశారు. అయినా ఎలాంటి చర్యలూ లేవు. ఏ చెర్వు యజమాని అనుమతులు తీసుకోకుండా బోర్లు వేశారు.
► గతంలో ఆప్రాంతంలో బోరు ఉంటే మరో బోరుకు అనుమతి ఇవ్వకూడదు. మరో బోరు వేయాలంటే పాత బోరు పూర్తిగా పాడైయిందని నిర్ధారించిన తరువాత మాత్రమే కొత్తదానికి అనుమతి ఇవ్వాలి.
► ఒకబోరు వేసిన చోట నుంచి మరో బోరు వేయడానికి 250 మీటర్ల దూరం ఉండాలి. అప్పుడే కొత్తబోరుకి అనుమతి ఇవ్వాలి. కానీ ఇక్కడ ఒకే చెర్వు వద్ద మూడు నుంచినాలుగు బోర్లు వేసి భూగర్భ జలాలను దుర్వినియోగం చేస్తున్నారు. ఈగ్రామాల ఆయకట్టు ప్రకారం మొత్తం కానూరు, కానూరు అగ్రహరం, ఉసులుమర్రు, తీపర్రు గ్రామాల్లో కేవలం 350 బోర్లు వేయాల్సి ఉండగా ఇక్కడ మాత్రం 800 బోర్లు పైనే ఉన్నాయి. వాల్టా చట్టం ప్రకారం ఉప్ప నీటిని పైకి తీసుకురావాలంటే ప్రత్యేక అనుమతి ఈ శాఖ వద్ద తీసుకోవలసి ఉంది. అలా తీసుకున్న దాఖలాలు ఎక్కడా లేవు. అంతే కాకుండా పంటభూములు ఉన్న చోట ఈ బోర్లకు అనుమతి ఇవ్వకూడదు. కానీ ఈ నిబంధనలు ఏమీ పాటించకుండానే ఇష్టారాజ్యంగా బోర్లు వేసి రొయ్యల సాగు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment