శిల్పారామానికి చురుగ్గా ఏర్పాట్లు | Silparamani active arrangements | Sakshi
Sakshi News home page

శిల్పారామానికి చురుగ్గా ఏర్పాట్లు

Published Thu, Jun 26 2014 1:14 AM | Last Updated on Sat, Sep 2 2017 9:23 AM

Silparamani active arrangements

సాక్షి, విజయవాడ : నగరవాసులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న శిల్పారామం ఏర్పాటుకు అధికారులు వేగంగా కసరత్తు చేస్తున్నారు. భవానీద్వీపంలోని 20 ఎకరాల స్థలాన్ని శిల్పారామం ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ సొసైటీకి  కేటాయించాలంటూ ఆంధ్రప్రదేశ్ పర్యాటకాభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ) ప్రిన్సిపల్ సెక్రటరీ చందనాఖాన్ ఇప్పటికే ఆదేశాలు జారీచేశారు. 133 ఎకరాల విస్తీర్ణం ఉన్న ద్వీపంలో ఎక్కడ స్థలం కేటాయించాలనే అంశంపై ఏపీటీడీసీ అధికారులు ఒక నిర్ణయానికి వచ్చారు. ఆ ప్రాంతంలో ముళ్లకంపలు ఉండడంతో వాటిని తొలిగించిన తరువాత సర్వేయర్‌తో కొలతలు వేయించి పది రోజుల్లో శిల్పారామం సొసైటీకి అప్పగించనున్నారు.
 
స్థలం వస్తే టెండర్ల పిలుపు..
 
ఇరవై ఎకరాల స్థలం రాగానే టెండర్లు పిలిచి పనులు ప్రారంభించేందుకు శిల్పారామం సొసైటీ అధికారులు సిద్ధంగా ఉన్నారు. శిల్పారామం నిర్మాణానికి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం రూ.ఐదు కోట్లు మంజూరుచేసింది. ఇవి ఖర్చుచేశాక మరికొన్ని నిధులు కేటాయించే అవకాశం ఉంది. ఏడాది క్రితమే పనులు ప్రారంభించాల్సి ఉండగా.. స్థలం కొరత కారణంగా మొదలుకాలేదు. చందనాఖాన్ ఆదేశాలతో  అధికారులు  భవానీద్వీపాన్ని పరిశీలించి అన్ని విధాలుగా ఉపయోగపడుతుందని సంతృప్తి వ్యక్తం చేశారు.
 
రూ. 2.5 కోట్లతో కల్యాణమండపం..
 
శిల్పారామంలో సుమారు రూ.2.5 కోట్ల వ్యయంతో 1200 మందికి ఉపయోగపడే విధంగా కల్యాణమండపం, డైనింగ్ హాల్ నిర్మించాలని భావిస్తున్నారు. పక్కనే ఏపీటీడీసీకి చెందిన కాటేజీలు ఉన్నాయి. భారీఎత్తున పెళ్లిళ్లు చేసుకునేవారు శిల్పారామం కల్యాణమండపంతోపాటు ఏపీటీడీసీ కాటేజీలను ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. పిల్లల కోసం ఆటపరికరాలను ఏర్పాటుచేస్తారు.    హస్తకళాకారులు తయారుచేసిన వస్తువుల్ని ప్రదర్శించుకునేందుకు వీలుగా దుకాణాలు నిర్మిస్తారు. ఇతర రాష్ట్రాలకు చెందిన కళాకారులు వస్తే వారు అక్కడే ఉండే విధంగా సౌకర్యాలు కల్పిస్తారు.

ఏడాదికి రెండుసార్లు జాతీయ స్థాయిలో ప్రదర్శనలు నిర్వహించేందుకు తగిన విధంగా శిల్పారామాన్ని తీర్చిదిద్దుతారు. విజయవాడ-గుంటూరు మధ్య రాజధాని ఏర్పడితే ఆంధ్రప్రదేశ్ 13 జిల్లాలకు చెందిన ప్రజలు రాజధానికి వచ్చిపోతుంటారు. వారిని ఆకట్టుకునేలా శిల్పారామాన్ని తీర్చిదిద్దే అవకాశం ఉంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement