‘‘రెండు నెలలుగా అలుపెరుగని పోరాటం చేస్తున్నాం. అన్ని పనులు వదులుకుని సమైక్యమే ధ్యేయంగా రోడ్లపైకొచ్చాం. విభజిస్తే మా బతుకులు అంధకారమవుతాయని గొంతు చించుకుని అరుస్తున్నాం. ఎన్ని విధాలుగా నిరసన తెలపాలో అన్ని రూపాల్లో ఆందోళనలు చేస్తున్నాం. మేము సైతం అంటూ మాతో పాటు చిన్న పిల్లలు కూడా ఉద్యమంలో కదం తొక్కుతున్నారు. అయినా ఈ కేంద్ర ప్రభుత్వానికి చీమ కుట్టినట్లైనా లేదు.’’
- సకల జనం ఆవేదన
‘‘ రాష్ట్ర విభజన జరిగితే అత్యంత కరువు ప్రాంతమైన అనంతపురం జిల్లా మరింతగా నష్టపోతుంది. ఎంతగా అంటే నిత్యం తాగు, సాగు నీటి కోసం కొట్టుకోవాల్సినంత. హంద్రీ-నీవా నీరు ఇక వస్తుందో.. రాదో దేవుడికే ఎరుక.’’
- రైతన్న ఘోష
సాక్షి, అనంతపురం : సమైక్యాంధ్ర ఉద్యమం 60 రోజులుగా హోరెత్తుతోంది. ఆంధ్రప్రదేశ్ పరిరక్షణే ధ్యేయంగా ప్రజలు, ఉద్యోగులు కదం తొక్కుతుండడంతో రెండు నెలలుగా ఉధృత స్థాయిలో కొనసాగుతోంది. శనివారం కూడా జిల్లా వ్యాప్తంగా సమైక్య నినాదం మార్మోగింది. అనంతపురం నగరంలో ఏపీఎన్‌జీఓలు కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులను
ముట్టడించారు. విద్యుత్ జేఏసీ ఆధ్వర్యంలో నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఆర్డీఓ కార్యాలయం ఎదుట రిలే దీక్షలు చేస్తున్న జాక్టో నాయకులకు కళాకారులు సంఘీభావం ప్రకటించారు.
ఈ సందర్భంగా వారు ఆట పాటలతో సమైక్యవాదాన్ని వినిపించారు. ఉపాధ్యాయులు, హౌసింగ్, రెవెన్యూ, హంద్రీ-నీవా ఉద్యోగులు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కుల సంఘాల జేఏసీ, ప్రభుత్వ డ్రైవర్ల సంఘం ఆధ్వర్యంలో అర్ధనగ్న ప్రదర్శన, బైక్ ర్యాలీ నిర్వహించారు. వైఎస్సార్‌సీపీ యువజన విభాగం ఆధ్వర్యంలో వందలాది మంది యువకులు నగరంలో బైక్ ర్యాలీ చేపట్టారు. ఫేస్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో కళాకారులు ర్యాలీ చేశారు. పంచాయతీరాజ్ ఉద్యోగులు జిల్లా పరిషత్ ఎదుట మోకాళ్లపై నడిచి నిరసన తెలిపారు. ఎస్కేయూ పీజీ, ఇంజనీరింగ్ విద్యార్థులు వర్సిటీ ఎదుట జాతీయ రహదారిపై ‘ఎస్కేయూ..60’ ఆకారంలో కూర్చుని రాస్తారోకో చేశారు. రాష్ట్రాన్ని విడగొడితే ఊరుకునేది లేదంటూ ఉరవకొండలో వేలాది మంది విద్యార్థులు గర్జించారు. ఒక్కసారిగా ై‘జె సమైక్యాంధ్ర’ అంటూ నినదించడంతో ఉరవకొండ దద్దరిల్లింది. సోనియాకు మంచి బుద్ధి ప్రసాదించాలని దేవున్ని ప్రార్థిస్తూ ఉరవకొండలో సాయిప్రగతి పాఠశాల విద్యార్థులు ర్యాలీ చేశారు. వైఎస్సార్‌సీపీ శ్రేణుల రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. ధర్మవరంలో విద్యార్థులు రోడ్డుపైనే చదువుతూ నిరసన తెలిపారు. తాడిమర్రిలో జేఏసీ నాయకులు బ్యాంకులను బంద్ చేయించారు. గుంతకల్లులోని పాతబస్టాండ్ సర్కిల్‌లో ప్రైవేటు స్కూళ్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులు మానవహారం నిర్మించారు.
మునిసిపల్ ఉద్యోగులు ర్యాలీ చేశారు. హిందూపురంలో ఎన్‌జీఓలు ర్యాలీ చేపట్టారు. విశాలాంధ్ర పరిరక్షణ సమితి సభ్యులు తోపుడు బండ్లపై ఉల్లిపాయలు, వెల్లుల్లి, చిరుధాన్యాలు అమ్ముతూ, ఉపాధ్యాయులు మెడకు ఉరితాళ్లు తగిలించుకుని నిరసన తెలిపారు. చిలమత్తూరులో జేఏసీ నాయకులు గంజి పంపిణీ చేశారు. కదిరిలోని అంబేద్కర్ సర్కిల్‌లో ఓడీచెరువు మండల ఉపాధ్యాయులు రిలేదీక్షలు చేపట్టారు. జేఏసీ నాయకులు ఉరి తగిలించుకొని నిరసన వ్యక్తం చేశారు. విద్యుత్, రెవెన్యూ ఉద్యోగులు ర్యాలీ చేశారు. తలుపులలో సమైక్యవాదులు రోడ్డుపైనే స్నానాలు చేసి నిరసన తెలిపారు. కళ్యాణదుర్గంలో జేఏసీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ, మినీ సర్కస్ నిర్వహించారు.
మడకశిరలో సమైక్యవాదులు రోడ్డుపై బైఠాయించారు. జేఏసీ నాయకులు ఎస్‌బీఐని ముట్టడించారు. అనంతరం భారీ ర్యాలీ చేపట్టారు. కర్ణాటక బస్సులపై వీరప్పమొయిలీకి వ్యతిరేకంగా, సమైక్యాంధ్రకు మద్దతుగా నినాదాలు రాశారు. పుట్టపర్తిలో హిజ్రాలు ర్యాలీ చేశారు. జేఏసీ నాయకులు గ్రామ దేవత సత్యమ్మకు పూజలు నిర్వహించారు. అమడగూరులో జేఏసీ నాయకులు కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులను ముట్టడించారు. నల్లమాడలో వైద్య, ఆరోగ్య శాఖ ఉద్యోగులు ర్యాలీ చేపట్టారు. జేఏసీ నాయకులు వీధులు ఊడ్చి నిరసన తెలిపారు.
కొత్తచెరువులో జేఏసీ నాయకులు యూపీఏ పెద్దల చిత్రపటాలతో శవయాత్ర నిర్వహించారు. పెనుకొండలో ట్రాక్టర్ యజమానుల యూనియన్ ఆధ్వర్యంలో ర్యాలీ, రొద్దంలో జేఏసీ నాయకులు ప్రజా బ్యాలెట్ చేపట్టారు. గోరంట్లలో జేఏసీ నాయకులు శరీరానికి ఆకులు చుట్టుకుని, సోమందేపల్లిలో టీ అమ్ముతూ నిరసన తెలిపారు. రాయదుర్గంలో డాక్టర్లు విధులు బహిష్కరించి ర్యాలీ నిర్వహించారు. ఎన్‌జీఓలు మోకాళ్లపై నిరసన తెలిపారు. కణేకల్లులో ఉప్పర కులస్తులు, ఆత్మకూరులో ఉపాధ్యాయులు ర్యాలీ చేశారు. రాప్తాడులో జేఏసీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను బంద్ చేయించారు. శింగనమల ఆర్టీసీ బస్టాండ్‌ను శుభ్రం చేసి సమైక్యవాదులు నిరసన తెలిపారు. కల్లూరు వద్ద పెన్నానదిలో ‘సమైక్యాంధ్ర’ మంటలు వేశారు. తాడిపత్రిలో జేఏసీ నాయకులు మానవహారం నిర్మించి.. పచ్చగడ్డి తింటూ నిరసన తెలిపారు. ఆంజనేయస్వామి ఆలయంలో 101 టెంకాయలు కొట్టి రాష్ట్రం విడిపోకుండా చూడాలని ప్రార్థించారు. బెళుగుప్పలో జేఏసీ నాయకులు ఇంటి ంటికీ వెళ్లి సమైక్య నినాదాన్ని విన్పించారు. కాగా.. ఉద్యమంలో చురుగ్గా పాల్గొంటూ వచ్చిన ఉరవకొండకు చెందిన చేనేత కార్మికుడు వూడిశెట్టి శేఖర్(42), గుంతకల్లులోని తిలక్‌నగర్‌కు చెందిన దాదావలి(25) శనివారం గుండెపోటుతో మరణించారు.
రెండు నెలలుగా ఉద్యమం
Published Sun, Sep 29 2013 3:17 AM | Last Updated on Fri, Jun 1 2018 8:36 PM
Advertisement