టీడీపీకి ఒకటే మంత్రి పదవి
అశోక్‌గజపతి రాజుకు దక్కిన అవకాశం
పార్లమెంటరీ పార్టీ భేటీలో స్పష్టత ఇచ్చిన బాబు
న్యూఢిల్లీ: మోడీ సర్కార్ తొలివిడత మంత్రివర్గంలో టీడీపీకి ఒకే కేబినెట్ పదవి దక్కింది. ఆ పార్టీ సీనియర్ నేత, విజయనగరం ఎంపీ అశోక్‌గజపతి రాజుకు ఆ అవకాశం ఇస్తున్నట్లు పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ఆదివారం రాత్రి పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఎంపీలకు వెల్లడించారు. మరో మంత్రిపదవి దక్కితే రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరికి అది లభించేదన్నారు. ఆదివారం ఉదయం చంద్రబాబు మోడీతో గుజరాత్‌భవన్‌లో భేటీ అయ్యారు. ఆ సందర్భంగా తొలివిడత మంత్రివర్గ కూర్పులో టీడీపీకి ఒకే కేబినెట్ పదవి ఇవ్వనున్నట్టు మోడీ బాబుకు చెప్పారు. వాస్తవానికి టీడీపీకి రెండు కేబినెట్ పదవులు, మూడు సహాయ మంత్రిపదవులు ఇవ్వాలని చంద్రబాబు బీజేపీ వర్గాలను కోరినప్పటికీ.. మోడీ కేబినెట్‌లో సభ్యుల సంఖ్య తక్కువగా ఉంటుందని, ఒక్కటితో సరిపెట్టుకోవాలని సూచించినట్టు సమాచారం. అందుకు సరేనన్న బాబు ఆదివారం మోడీని కలిసి.. సీమాంధ్ర అభివృద్ధికి తగిన చేయూతనిస్తే చాలని, కొత్త రాష్ట్రానికి ఉపయోగపడేలా తగిన మంత్రిత్వ శాఖను ఇవ్వాలని కోరారు. అశోక్‌గజపతి రాజుకు ఓడరేవులు, నౌకాయాన శాఖ దక్కే అవకాశం ఉన్నట్టు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది.
నియోజకవర్గానికి ఒక జిల్లా: రైతు రుణమాఫీ కోసం కేంద్రం నుంచి నిధులు తెచ్చేలా పనిచేయాలని ఈ సందర్భంగా ఎంపీలను చంద్రబాబు కోరారు. కొత్త రాజధాని నిర్మాణం, కాకినాడ-విశాఖ మెట్రో కారిడార్, ఉద్యోగ కల్పన కోసం ఎంపీలు కష్టపడి పనిచేయాలని కోరారు. టీడీపీ ప్రజాప్రతినిధుల పనితీరుపై ప్రతివారం సమీక్ష ఉంటుందని, కనీసం 80 శాతం సంతృప్తికర పనివిధానం ఉండాలని సూచించారు. ఎంపీలు వారంలో రెండు రోజులు ఢిల్లీలో ఉంటూ నిధులు తెచ్చేందుకు కృషిచేయాలని కోరారు. అలాగే పోలవరం నిర్మాణం పూర్తిచేయడం, ఒక్కొక్క పార్లమెంటరీ నియోజకవర్గాన్ని ఒక్కొక్క జిల్లాగా ఏర్పాటుచేయాలన్న చర్చ ఈ సమావేశంలో వచ్చింది. అలాగే రాయలసీమలో తాగు, సాగునీరుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాని, సీమాంధ్రలో విద్యాసంస్థలు, ఐటీ, ఫార్మాసంస్థలను ఏర్పాటుచేసేందుకు ప్రత్యేక శ్రద్ద పెట్టాలని ఎంపీలు కోరారు. సమావేశ వివరాలను ఎంపీలు ఎన్.శివప్రసాద్, అవంతీ శ్రీనివాసరావు మీడియాకు వెల్లడిస్తూ పార్లమెంటరీ పార్టీ నేతను ఇంకా ఎన్నుకోలేదన్నారు.