శాంతిభద్రతలపై చర్చ.. సభలో తీవ్ర ఉద్రిక్తత | situation becomes tense in assembly over law and order discussion | Sakshi
Sakshi News home page

శాంతిభద్రతలపై చర్చ.. సభలో తీవ్ర ఉద్రిక్తత

Published Fri, Aug 22 2014 12:42 PM | Last Updated on Sat, Aug 18 2018 5:15 PM

situation becomes tense in assembly over law and order discussion

రాష్ట్రంలో శాంతిభద్రతలపై చర్చ సందర్భంగా అసెంబ్లీలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. సభలో లేని వ్యక్తులపై అభాండాలు వేయడం ఏమిటంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు తీవ్రస్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిపై టీడీపీ సభ్యులు ధూళిపాళ్ల నరేంద్ర, బొండా ఉమామహేశ్వరరావు తీవ్రస్థాయిలో ఆరోపణలు గుప్పించారు. అధ్యక్ష స్థానంలో ఉన్న డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ను దీనిపై రూలింగ్ ఇవ్వాలని కోరినా.. స్పీకర్ పరిశీలించి రూలింగ్ ఇస్తారంటూ ఆయన మళ్లీ టీడీపీ సభ్యులకు అవకాశం ఇవ్వడంతో వైఎస్ఆర్సీపీ సభ్యులు పోడియంలోకి వచ్చి నినాదాలు చేశారు.

సభలో లేని వ్యక్తులు, ఆరోపణలకు సమాధానం ఇవ్వలేని వ్యక్తుల మీద అసెంబ్లీలో ఎలాంటి ఆరోపణలు చేయకూడదని అసెంబ్లీ నియమ నిబంధనలు స్పష్టంగా చెబుతున్నాయని, దీనిపై రూలింగ్ ఇవ్వాలని వైఎస్ఆర్సీపీకి చెందిన సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధనరెడ్డి నిబంధనను ప్రస్తావిస్తూ డిప్యూటీ స్పీకర్ను కోరారు. అయినా మళ్లీ మళ్లీ టీడీపీ సభ్యులకు అవకాశం రావడం, వాళ్లు మళ్లీ మళ్లీ ఆరోపణలు చేయడంతో వైఎస్ఆర్సీపీ సభ్యులు పోడియంలోకి దూసుకొచ్చారు.

అయినా కూడా స్పీకర్ నిబంధనలను పరిశీలించి ఆ తర్వాత రూలింగ్ ఇస్తారని, అప్పటివరకు కూర్చోవాలని డిప్యూటీ స్పీకర్ అన్నారు. మరోవైపు బొండా ఉమామహేశ్వరరావుకు, ధూళిపాళ్ల నరేంద్రకు మాత్రం మాట్లాడేందుకు అవకాశం ఇచ్చారు. ఆ సమయంలో ధూళిపాళ్ల నరేంద్ర నిబంధనలను చదువుతుండగా పోడియం వద్దకు వైఎస్ఆర్సీపీ సభ్యురాలు రోజా రాగా, ఆమెపై నరేంద్ర అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement