అసెంబ్లీలోనే ప్రజాస్వామ్యం ఖూనీ
పట్టపగలు ప్రజాస్వామ్యాన్ని యథేచ్ఛగా రాష్ట్ర అసెంబ్లీలోనే ఖూనీ చేస్తున్నారని ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మండిపడ్డారు. శాంతిభద్రతలపై చర్చ పునఃప్రారంభమైన తర్వాత కూడా టీడీపీ సభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి నోటికి వచ్చినట్లల్లా అసత్యాలు మాట్లాడుతూ, ఆరోపణలు చేస్తున్నారని ఆయన అన్నారు. ఒక శాసన సభ్యుడు తన ఇష్టంవచ్చినట్లు అబద్ధాలు చెబుతుంటే, ఆ అబద్ధాలు చెప్పుకోనివ్వండంటూ సమయం కేటాయిస్తున్నారని వైఎస్ జగన్ మండిపడ్డారు. 'ఇదేంటి అధ్యక్షా.. ఆయన నోటికొచ్చినట్లు తప్పులు మాట్లాడుతుంటే, మీరు అనుమతిస్తూనే ఉన్నారు. ఇదే కేసుకు సంబంధించి నేను సూటిగా అడుగుతున్నాను' అని చెప్పారు.
ఆ సమయంలో స్పీకర్ కలగజేసుకుని, అధ్యక్ష స్థానం మీద ఆరోపణలు చేస్తున్నారని, అది సరికాదని చెప్పారు. శాంతిభద్రతలపై చర్చలో వాళ్లకు సమయం ఇచ్చామని, మీకు అవకాశం వచ్చినప్పుడు మీరు చెప్పుకోవాలని అన్నారు. ప్రతిపక్ష నాయకుడికి అవకాశం ఇస్తే ఆయన స్పీకర్ మీదే ఆరోపణలు చేస్తున్నారని పదే పదే చెప్పారు. మీరు ఎప్పుడు అడిగితే అప్పుడు అవకాశం ఇచ్చామని అన్నారు. తాను పూర్తి నిష్పక్షపాతంగానే వ్యవహరిస్తున్నానన్నారు.
ఆ తర్వాత యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ, ఎవరికి అవకాశం వచ్చినప్పుడు వాళ్లు మాట్లాడాలని, స్పీకర్ మీద ఆరోపించడం కూడా సరికాదని, సభా మర్యాదలను కూడా పాటించాలని, స్పీకర్ అనుమతించడం వల్లే ఆయన మాట్లాడారని చెప్పారు. ఆ సమయంలో సభలో తీవ్ర గందరగోళం చెలరేగింది. ఒక్కసారిగా అధికార, విపక్ష సభ్యులు నేరుగా ఒకరితో ఒకరు వాగ్వాదానికి దిగడంతో సభ ఏమాత్రం అదుపులో లేకుండా పోయింది. దాంతో అధికారపార్టీ సభ్యుల వ్యాఖ్యలకు నిరసనగా వైఎస్ఆర్సీపీ సభ్యులు వాకౌట్ చేశారు.
ఆ తర్వాత టీడీపీ సభ్యుడు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ శాసనసభను ఇడుపులపాయ, లోటస్పాండ్ అనుకుని సొంత పాలన చేస్తున్నారని అంటూ.. ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఉద్దేశించి వ్యక్తిగతంగా తీవ్ర అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి, స్పీకర్, ప్రతిపక్ష నాయకుడు ఈ ముగ్గురూ ఇతర సభ్యులకు ఆదర్శంగా ఉండాలన్నారు.
అంతకుముందు శనివారం నాడు చర్చను ప్రారంభించిన బుచ్చయ్య చౌదరి వైఎస్ పాలనను ఉద్దేశించి దోపిడీ అంటూ నోటికి వచ్చినట్లు మాట్లాడారు. మధ్యమధ్యలో విపక్ష సభ్యులను ఉద్దేశించి కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. ఎవరో భూమిని ముఖ్యమంత్రి సారథ్యంలో ఆక్రమించారంటూ దివంగత ముఖ్యమంత్రిపై ఆరోపణలు చేశారు. ఆయుధాలు దిగుమతి చేసుకున్నారని, బాంబే ముఠాలను ఇక్కడకు రప్పించారని, ఛోటా రాజన్ హత్య చేయడానికి ప్రయత్నం చేసిన వ్యక్తి గ్యాంగును దుబాయ్ నుంచి అనంతపురం రప్పించారని అన్నారు. దీనిపై విపక్ష సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేయగా.. 'ఉండవయ్యా, ఉండు' అంటూ సభ్యులను తానే అదుపు చేసే ప్రయత్నం చేశారు. ఇప్పుడు ముఖ్యమంత్రి రక్షణకు వాడుతున్న వాటికంటే అత్యాధునిక ఆయుధాలు తెప్పించారని చెబుతూ.. ఓ పోలీసు అధికారి కూడా ఆయుధాల ఒప్పందం కుదుర్చుకున్నారని ఆరోపించారు.